NTV Telugu Site icon

Vidudala Part 1 Movie Review: విడుదల – 1 రివ్యూ (తమిళ డబ్బింగ్)

Vidudala

Vidudala

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కంటూ ఓ వర్గం ప్రేక్షకులు ఉన్నారు. పదిహేనేళ్ళ కెరీర్ లో ఆయన తెరకెక్కించింది ఆరు చిత్రాలే అయినా… అందులో జాతీయ అవార్డులను అందుకున్న సినిమాలూ ఉన్నాయి. సమాజంలోని అట్టడుగు వర్గాలను రిప్రజెంట్ చేస్తూ వెట్రిమారన్ సినిమాలు తీస్తుండటంతో సహజంగానే విమర్శకుల ప్రశంసలూ ఆ యా చిత్రాలకు లభిస్తుంటాయి. అలా వెట్రిమారన్ తీసిన తాజా చిత్రం ‘విడుదలై’. తమిళంలో మార్చి 31న విడుదలైన ఈ సినిమాను గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ తెలుగువారి ముందుకు ‘విడుదల’ పేరుతో ఈ నెల 15న తీసుకు రాబోతున్నారు.

డైరెక్టర్ వెట్రిమారన్ ‘విడుదల’ చిత్రాన్ని గవర్నమెంట్ వర్సెస్ ఎక్స్ ట్రిమిస్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ఖనిజ సంపద ఉన్న అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ పరం చేయాలనుకున్నప్పుడు… అక్కడి తీవ్రవాదులు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అందుకోసం ఎలాంటి పోరాటం చేశారు? అనేది వెట్రిమారన్ ఇందులో చూపించాడు. అంతేకాదు… ఏజెన్సీ లోని పోలీస్ క్యాంప్స్ లో అధికారుల దాష్టికాలకూ, అంతర్గత కలహాలకూ, కోవర్ట్ ఆపరేషన్స్ కూ ప్రాధాన్యమిచ్చాడు. నిజానికి కథ చెప్పుకోవాలంటే ఇది సింపుల్ అండ్ సింగిల్ పాయింట్.

ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజాదళం అనే తీవ్రవాద సంస్థ రైలును బాంబు పెట్టి పేల్చేస్తుంది. దానికి కారకుడైన దళ నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ను అందమొందించడం కోసం ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్ సునీల్ (గౌతమ్ మీనన్)ను పంపుతుంది. అప్పటికే కానిస్టేబుల్ గా ఏజెన్సీలో పోస్టింగ్ వచ్చిన కుమరేశన్ (సూరి) తన పై అధికారుల అగచాట్ల కారణంగా నానా కష్టాలు పడుతుంటాడు. అక్కడి గిరిజన యువతి తమిళరసి (భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. ఆమెకు తీవ్రవాదులతో బంధుత్వం ఉందనే విషయం కుమరేశన్ కు ఆలస్యంగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో తీవ్రవాది పెరుమాళ్ ను చూసిన కుమరేశన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. పెరుమాళ్ ఆచూకిని పై అధికారులకు అతను చెప్పాలని అనుకున్నా… కొందరు పోలీసులు అడ్డు పడతారు. పెరుమాళ్ వివరాల కోసం గిరిజనులను స్టేషన్ కు రప్పించి పోలీసులు ఓ పక్క హెరాస్ చేస్తుంటే… పెరుమాళ్ ను పట్టుకునేందుకు కుమరేశన్ గ్రామంలోకి అడుగుపెడతాడు. మరి అతనికి పెరుమాళ్ చిక్కాడా? పోలీసుల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడిందా? కుమరేశన్, తమిళరసి ఒక్కటి అయ్యారా? అనేది మిగతా కథ.

నిజానికి ఈ సినిమాకు ముగింపు లేదు… ఎందుకంటే అసలు కథను దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదలై’ పార్ట్ 2 లో చూపించాలనుకున్నాడు. ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం నిజాయితీపరుడైన కానిస్టేబుల్ కుమరేశన్ కష్టాల చుట్టూ తిప్పిన దర్శకుడు, సెకండ్ హాఫ్ తీవ్రవాదుల పట్ల సానుభూతి కలిగేలా కథను మలిచాడు. తీవ్రవాదులు పోలీసులపై చేసిన దాడులకు, రైలు పేల్చివేతకు కూడా బలమైన కారణాలను చూపించాడు. దాంతో మూవీ మొత్తం తీవ్రవాదుల కొమ్ము కాసినట్టుగా అయిపోయింది. దీనికి తోడు ప్రధమార్థంలో మొదటి అరగంట డాక్యుమెంటరీని తలపించింది. ద్వితీయార్థంలోనే కొంతలో కొంత కథ, కదలిక ఉంది. అయితే పోలీసుల అకృత్యాలను జుగుప్స కలిగేలా తెర మీద చూపించడం దారుణం.

తీవ్రవాదుల చర్యలను సమర్థించే వారు, వ్యతిరేకించే వారు ఈ సొసైటీలో ఎప్పుడూ ఉంటారు. అయితే… కాలం చెల్లిన ఆ సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమనేది సినిమా రంగంలో ఇటీవల కాస్తంత పెరిగింది. తమిళనాట పరిస్థితి ఏమో కానీ తెలుగులో మాత్రం ఇలాంటి సినిమాలను ఆదరించే రోజులు పోయాయి. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, రానా ‘విరాట పర్వం’ చిత్రాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక మావోయిస్టుల భుజం కాస్తూ ఆర్. నారాయణ మూర్తి తీస్తున్న సినిమాలకు ఎంతో కాలంగా ఆదరణ దక్కడం లేదు. అయినా… ఏ ఆబ్లిగేషన్ తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేస్తున్నారో అర్థం కాదు. బహుశా మొన్న ‘కాంతార’, నిన్న ‘మాలికాపురం’ చిత్రాలను విడుదల చేసిందుకు కాంపన్ సేషన్ గా… తనకు ఇజాల పట్టింపులు లేవని తెలపడానికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారేమో!!

నటీనటుల విషయానికి వస్తే… కమెడియన్ గా మంచి పేరున్న సూరి ఇందులో నిస్సహాయుడైన కానిస్టేబుల్ పాత్రను అద్భుతంగా పోషించాడు. గిరిజన యువతిగా భవాని శ్రీ సహజ నటన కనబరిచింది. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రలతో పోల్చితే ఇది బెటర్ క్యారెక్టర్. తీవ్రవాద సంస్థ నాయకుడిగా బాగానే మెప్పించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలు వరుసగా చేస్తుండటంతో గౌతమ్ వాసుదేవ మీనన్ నటనలో మొనాటనీ కనిపిస్తోంది. స్టేట్ చీఫ్ సెక్రటరీగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ ను ఎంపిక చేయడం బాగుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ పెక్యులర్ గా ఉండి ఆకట్టుకుంది. ఇక ఇతర ప్రధాన పాత్రలను చేతన్, ఇళవరసు, మున్నార్ రమేశ్, శరవణ సుబ్బయ్య, దర్శకుడు బాలాజీ శక్తి వేల్ పోషించారు. ఇళయరాజా నేపథ్య సంగీతం మూవీకి స్పెషల్ ఎస్సెట్. చైతన్య ప్రసాద్ రాసిన పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది. బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఆర్ వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితనం ఎంత గొప్పగా ఉన్నా… ఇలాంటి చిత్రాలు అన్ని వర్గాలను మెప్పించలేవు.

రేటింగ్ : 2.5 /5

ప్లస్ పాయింట్స్
సూరి నటన
ఇళయరాజా రీరికార్డింగ్
వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనం
జుగుప్స కలిగించే ఇంటరాగేషన్ సీన్స్
పేలవమైన ముగింపు

ట్యాగ్ లైన్: వెట్రిమారన్ ముద్ర!

Show comments