చియాన్ విక్రమ్ హీరోగా దుషారా విజయన్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం వీర శూరన్ ఈ సినిమాని తెలుగులో వీర ధీర శూర పేరుతో రిలీజ్ చేశారు. నిజానికి ఇది రెండో భాగం అని చెబుతూ రిలీజ్ చేయడం గమనార్హం. ఎన్వి సినిమాస్ బ్యానర్ మీద ఎన్ వి ప్రసాద్ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది?అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం
వీర వీర శూర కథ:
సిటీలో అందరూ పెద్దాయనగా పిలిచే రవి(30 ఇయర్స్ పృథ్వి) ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పెద్దాయన కుమారుడు కన్నన్ (సురాజ్ వెంజరమూడు) అనుకోకుండా ఒక మహిళ, ఆమె కుమార్తె మిస్సయిన కేసులో బుక్ అవుతాడు. అయితే అప్పటికే వారితో శత్రుత్వం ఉన్న ఎస్పీ(ఎస్ జె సూర్య) ఇదే అదునుగా తీసుకుని ఎన్కౌంటర్లో వారిద్దరినీ చంపేయాలని ఫిక్స్ అవుతాడు. విషయం తెలియడంతో ముందు కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించినా ఎస్పీ కాకపోవడంతో తన వద్ద గతంలో పనిచేసి ఇప్పుడు ఒక కిరణా షాప్ నడుపుకుంటున్న కాళీ(విక్రమ్)దగ్గరకు వెళ్లి తనను తన కొడుకుని కాపాడమని ప్రాధేయపడతాడు రవి. అలా కాపాడాలంటే ఎస్పీని చంపడమే ఏకైక మార్గమని కాళ్ళ మీద పడి అడుగుతాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా కాళ్ళ మీద పడిన తర్వాత అందుకు సిద్ధమవుతాడు. అయితే కాళీ ఎస్పీని చంపాడా? రవి, కన్నన్ ఇద్దరికీ కాళీ ఎలా రక్షణ కల్పించాడు? చివరికి వారిద్దరూ ఏమయ్యారు? ఎస్పీని చంపేందుకు బయలుదేరిన కాళీ ఎస్పీని ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకుండా సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడం అనేది బహుశా ఇది ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు. సినిమా ప్రారంభంలో ఇదేంట్రా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ నెమ్మదిగా దర్శకుడు కథలోకి తీసుకు వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. నిజానికి ఇదేమైనా కొత్త కథ అంటే అవునని చెప్పలేం. ఎందుకంటే గతంలో ఇలాంటి కథతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక రౌడీ గ్యాంగ్ తో పనిచేసే హీరో పెళ్లయిన తర్వాత పెళ్ళాం మాట విని వారికి దూరంగా బతుకుతూ ఉంటే, ఆ రౌడీ గ్యాంగ్ పెద్ద వచ్చి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది కాపాడమని అడగడం, అందుకు హీరో పెళ్ళాం మాట వినకుండా వెళ్లి కాపాడడానికి సిద్ధమవడం గతంలోనే చూశాం. ఈ సినిమా కథ కూడా దాదాపుగా అదే లెవెల్ లో తీసుకువెళ్లాడు దర్శకుడు. సినిమా సాగుతున్న కొద్ది ప్రేక్షకులలో తర్వాత ఏం జరగబోతోంది అని విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆ విధంగా దర్శకుడు రాసుకున్న కథ దానితో పాటు నడిపించిన కథను ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలాగే విక్రం రెచ్చిపోయినటించాడు. ఇక మళ్ళీ అవకాశం రాదు ఏమో అన్నట్టు ప్రతి సీన్ లో విక్రం తపన కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అయితే అదరగొట్టాడు. ఇక సురాజ్ వెంజర మూడుకి ఇది ఒక అదిరిపోయే కమర్షియల్ ఎంట్రీ అని చెప్పొచ్చు. 30 ఇయర్స్ పృద్వి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక దుషార నటన కొన్ని సన్నివేశాల్లో అయితే పీక్స్ అంతే. మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటల కంటే ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసిన తీరు కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. సినిమాలో చాలా విజిల్స్ వేసే సీన్లు ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్త స్క్రీన్ మీద కనిపించింది.
ఫైనల్లీ ఇది ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ.. యాక్షన్ లవర్స్ కళ్ళు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు.