NTV Telugu Site icon

Viraaji Movie Review: వరుణ్ సందేశ్ ‘విరాజి’ రివ్యూ

Viraaji Movie Review

Viraaji Movie Review

Viraaji Movie Review: సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన సినిమా “విరాజి”. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కొంచెం తేడాగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహా మూవీస్ – ఎమ్ 3 మీడియా బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

విరాజి కథ:
ఒక ఈవెంట్ లో స్టాండ్ అప్ కామెడీ చేయాలని కమెడియన్ వేద( కుశాలిని), స్వామీజీకి సన్మానం అని సినిమా నిర్మాత కోదండరాం (కాకినాడ నాని), అదే సన్మానం అని చెప్పి సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఆ సన్మానాన్ని షూట్ చేయాలని ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల)లను ఒక కొండమీద ఉన్న బంగ్లాకి రప్పిస్తారు. వీరు కాకుండా ఇల్లీగల్ గా ఏదో జరుగుతోంది అని సీఐ ప్రభాకర్ (బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని)లతో పాటు 95% ఆఫ్ అని హనీమూన్ ప్యాకేజ్ కింద వైవా రాఘవ దంపతులను కూడా రప్పిస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ ట్రాప్ లో పడ్డామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ పడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తే నిర్మాత కోదండరాంతో పాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు. దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉంటారు. ఆ టైంలో ఆండీ (వరుణ్ సందేశ్) వచ్చి తనకు డ్రగ్స్ ఇవ్వాలని అడుగుతాడు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ అందరినీ ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి ఎవరు బయటపడ్డారు? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను కూడా ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు మేకర్స్. ఆసక్తికరమైన విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న అంశాలను ఎంచుకుని వాటికి సస్పెన్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. నిజానికి ఈ సినిమా నిడివి చాలా తక్కువ. సినిమా అసలు కథ మొదలైంది అనుకునే లోపే ఇంటర్వెల్ తో షాక్ ఇస్తాడు డైరెక్టర్. అంతేకాక సినిమా చివరి వరకు అసలు ట్విస్టు ఏమాత్రం అంచనాకు అందకుండా రాసుకున్నాడు డైరెక్టర్. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి ట్రాప్ అయి రావడం, వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది చివరి వరకు రివీల్ చేయకుండా తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా మూడ్ మొత్తాన్ని గ్రేలో తీసుకు వెళ్లే ప్రయత్నం కొంత ఇబ్బందికర అంశం. కాస్తో కూస్తో ఆ కలర్ పేలెట్స్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో సాగిన కథనం సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులతో ఆకట్టుకునేలా ముందుకు తీసుకు వెళ్ళాడు డైరెక్టర్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా రాసుకున్నారు. ఇక నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.

నటీనటుల విషయానికి వస్తే ఆండీ అనే క్యారెక్టర్ లో ఒక వింతమనిషిగా వరుణ్ సందేశ్ రెచ్చిపోయి నటించాడు. ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్స్ లో వరుణ్ సందేశ్ నటన చాలా మెరుగయింది. సిఐ మురళిగా బలగం జయరాం, సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, వంటి వాళ్ళు థ్రిల్లర్ సినిమాలో కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రమోదిని, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పులప వంటి వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమా మొత్తానికి ప్రాణం పోసింది. తనదైన బిజిఎంతో సినిమాకి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగున్నా కలర్ పేలేట్ ఎంపిక విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: విరాజి ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. అంచనాలు లేకుండా వెళ్తే నచ్చొచ్చు.