సత్యరాజ్ ప్రధాన పాత్రలో త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది, ఎందుకంటే పురాణాల్లో ఉన్న బార్బరికుడి ప్రస్తావనతో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మారుతి టీమ్ ప్రొడక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ :
సిటీలో సైకాలజిస్ట్‌గా పని చేసే శ్యామ్ (సత్యరాజ్), మనవరాలు మేఘన (సునీల్), స్కూల్‌కి వెళ్లి ఇంటికి తిరిగి రాదు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన శ్యామ్ కి ఆమె మిస్సయిన విషయం అర్థమవుతుంది. ఆమెను పోలీసులు సాయంతో వెతకడం మొదలు పెడతాడు. మరొక పక్కా రామ్ (వశిష్ట) అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. స్నేహితుడు దేవ్ (క్రాంతి కిరణ్) వ్యసనాలకు బానిసై, అప్పు కట్టడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో రామ్ అతనికి సాయం చేయడానికి సిద్ధమవుతాడు. అయితే అనుకోకుండా తన మనవరాలు మరణించిందని ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటాడు శ్యామ్. అయితే ఆ మనవరాలు చంపింది ఎవరు? అసలు కథలో రామ్, ఇద్దరి పాత్ర ఏమిటి? రామ్ విదేశాలకు వెళ్ళాడా? ఇందులో దేవ్, అత్త వాకిలి పద్మ, ఉదయభాను పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
నిజానికి సినిమా టైటిల్ చూసినా, ట్రైలర్ చూసినా ఇదేదో సోషియో ఫాంటసీ, డ్రామా అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ, సినిమా చూసిన తర్వాత మాత్రం అదేమీ లేదని అర్థం అయిపోతుంది. నిజానికి బార్బరికుడి అంశాన్ని సినిమాలో ఒక రివెంజ్ కోసం వాడుకున్నారు అంతే. బార్బరికుడి మూడు బాణాల అంశంతో దాన్ని ముడిపెట్టిన తీరు మాత్రం అభినందనీయం. నిజానికి సినిమా దర్శకుడి ప్రతిభ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంలోను, ట్రైలర్ కట్ చేయడంలోనే ఉందనిపించింది. ఎందుకంటే ఒక సాధారణ రివెంజ్ డ్రామాని బార్బరికుడితో ముడిపెట్టి ఇదేదో సోషియో ఫాంటసీ సినిమా అని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేసి థియేటర్లకు రప్పిద్దామనుకునే ఆలోచన, మార్కెటింగ్ స్ట్రాటజీ ఆకట్టుకుంది. అయితే అదే ఉద్దేశంలో థియేటర్ లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడు నిరాశకు లోనవుతాడు. అలాగే ఈ రివెంజ్ డ్రామా కూడా కొత్తదేమీ కాదు. మనవరాలిని చెరిపి చంపిన దుండగులను ఓ తాత వేటాడి, తాను చంపకుండా చంపించడమే ఈ సినిమా కథ. చెప్పుకోవడానికి సింపుల్‌గానే ఉన్నా, దర్శకుడు ఆకట్టుకునే విధంగా తెరమీదకు తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా సత్యరాజు మనవరాలు మిస్ అవ్వడం, వశిష్ట అతని స్నేహితుడి పాత్రల పరిచయంతోనే సమయం గడిచిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఇచ్చిన దర్శకుడు, సెకండ్ హాఫ్‌లోకి తీసుకువెళ్ళాక మాత్రం కథను అక్కడక్కడ తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ సాగదీసిన తరువాత క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అక్కడ ఒక షాకర్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
నటీనటుల విషయానికి వస్తే, వశిష్ట తనకు బాగా అలవాటైన పాత్రలో జీవించాడు. అతని స్నేహితుడి పాత్రలో నటించిన వ్యక్తి కూడా ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ కూడా అతనికి ఇలాంటి తరహా పాత్రలు కొత్తవి కాదు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపించాడు. మేఘనా సునీల్, కార్తికేయ, ప్రభావతి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, దర్శకుడు స్వయంగా సంగీతం కూడా అందించడంతో సినిమాకి ఎక్కడెక్కడ ఏ హై కావాలో ఆ హై ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కలిసి వచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ, ఈ త్రిబాణధారి బార్బరిక్ రివెంజ్ డ్రామా విత్ ధర్మ.