ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్ కీలక నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ ఇది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సిరీస్ కి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి త్రీ రోజెస్ సీజన్ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ :’3 రోజెస్’ మొదటి సీజన్ మంచి విజయం సాధించిన తరువాత, దాదాపు ఐదేళ్ల గ్యాప్‌తో మేకర్స్ ఇప్పుడు సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి ప్రధానంగా ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది. మొదటి సీజన్ హీరోయిన్లలో ఈషా రెబ్బా (రీతూ) మాత్రమే కొనసాగగా, రాశి సింగ్ (మేఘన) మరియు కుషిత కల్లపు (సృష్టి) కొత్తగా యాడ్ అయ్యారు. ఈ ముగ్గురు స్నేహితులు నగరంలో ఒకే ఇంట్లో ఉంటారు. రీతూ బ్రేకప్ బాధలో కెరీర్‌పై దృష్టి పెడితే, మేఘన తన విడాకుల రహస్యాన్ని దాచిపెడుతూ ఉంటుంది. కొరియన్ డ్రామాలకు ఫ్యాన్ అయిన సృష్టి మాత్రం డేటింగ్ కోసం ఉవ్విళ్లూరుతుంది. వీరు ముగ్గురు కలిసి ఒక యాడ్ ఏజెన్సీని మొదలుపెట్టి కష్టాలు పడుతుండగా, రీతూ గతంలో పెళ్లికి నిరాకరించిన ప్రసాద్ (హర్ష చెముడు) ఒక గోల్డ్ జ్యువెలరీ యాడ్ ప్రాజెక్టుతో వారి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ ఎంట్రీ తరువాత ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? తమ స్వేచ్ఛను అడ్డుకుని, వాడుకోవాలని చూసే వారి నుంచి ఈ స్నేహితులు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సీజన్ కథాంశం.
విశ్లేషణ:
ఈ సీజన్ ప్రధానంగా పూర్తిస్థాయి కామెడీని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముంబై జీవనశైలికి తగ్గట్టుగా కథను బోల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. మూడు మహిళా పాత్రల స్వేచ్ఛాయుతమైన జీవితం, వారు ఎదుర్కొనే సమస్యలను కన్విన్సింగ్‌గా చూపించారు. కేవలం నాలుగు ఎపిసోడ్స్, మొత్తం రెండు గంటల నిడివితో సిరీస్‌ను చకచకా ముగించేశారు. వెబ్ సిరీస్‌లలో ఉండే సాగదీత లేకుండా, ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్గా అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. కథనం రొటీన్‌గా ఉంది. ముగింపు ఎలా ఉంటుందో ప్రేక్షకులు సులభంగా ఊహించవచ్చు. కొత్తదనం ఏమీ లేదు. ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు ఇంకాస్త బలమైన, లోతైన క్యారెక్టర్ ఆర్క్‌లు రాసుకుంటే బాగుండేది. నాలుగో ఎపిసోడ్‌లో కథను పూర్తి చేయకుండా, ఇంకా కంటిన్యూ అయ్యేలా వదిలేశారు. కేవలం హాస్యాన్ని పంచుతూనే, ప్రేమ, మోసం, ఆకర్షణ వంటి అంశాలను యువతకు అర్థమయ్యేలా రూపొందించారు.
నటీనటుల విషయానికి వస్తే ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు తమ గ్లామర్‌తో పాటు, కామెడీ టైమింగ్‌తో కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కుషిత కల్లపు తన బోల్డ్ సీన్స్, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. హర్ష చెముడు, ప్రభాస్ శ్రీను పాత్రలు కూడా బాగా కుదిరాయి. కమెడియన్ సత్య తన పాత్రతో సిరీస్‌కు కొత్త ఊపు తెచ్చారు. ఆయన డార్క్ కామెడీ హైలైట్‌గా నిలిచి, ప్రేక్షకులను నెక్స్ట్ లెవల్‌కు నవ్వించింది. సాంకేతికత విషయానికి వస్తే విజువల్స్, బీజీఎం (అజయ్ అరసాడ) బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
చివరిగా: నవ్వులు, గ్లామర్, మరియు జీవిత పాఠాలు నేర్పే ఉద్దేశంతో సరదాగా సాగిపోయే ఈ రొమాంటిక్ ఫన్ రైడ్‌ను ఒకసారి చూడవచ్చు.