Thank You Movie Review :
ఊహించని విధంగా ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి… తన పరుగును కొద్దిసేపు ఆపి, జీవితంలోని వివిధ దశల్లో తనకు సాయం చేసిన వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలనుకోవడమనేది ఓ స్వీట్ థింగ్! అయితే ఏ సందర్భంలో అతను వెనక్కి తిరిగి చూసుకున్నాడు? ఏ రకంగా ఆయా వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాడన్నది కూడా ప్రధానమే! ఈ అంశాల చుట్టూ రూపుదిద్దుకున్నదే ‘థ్యాంక్స్’ చిత్రం.
అక్కినేని నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ ‘దిల్’ రాజు అప్పుడెప్పుడో ‘జోష్’మూవీ నిర్మించారు. అది పరాజయంపాలైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇన్నేళ్ళకు మళ్ళీ ‘థ్యాంక్యూ’ మూవీ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ మూవీ ‘మనం’ను మెమొరబుల్ ఫిల్మ్ గా మలిచిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఆ తర్వాత ఇప్పుడు నాగచైతన్యతో చేసిన సినిమా కూడా ఇదే! సో… నాగచైతన్య, దిల్ రాజు, విక్రమ్ కుమార్ కాంబోలో మూవీ అనగానే సహజంగానే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. దాంతో కొద్దిపాటి అంచనాలూ ఏర్పడతాయి. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చింది ‘థ్యాంక్యూ’ మూవీ!
ఉద్యోగం వెతుక్కుంటూ అమెరికా వెళ్ళిన అభిరామ్ (నాగచైతన్య)కు కన్సలెంట్ రావ్ (ప్రకాశ్ రాజ్) ద్వారా ఆయన కూతురులాంటి ప్రియ (రాశీఖన్నా)తో పరిచయం ఏర్పడుతుంది. అభిరామ్ కు ఓ మంచి ఉద్యోగం చూడాలని రావ్ అనుకుంటే… సొంతంగా యాప్ ను డెవలప్ చేయాలని అతను భావిస్తాడు. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ప్రియ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. దాంతో ఆమెకు మరింత చేరువైన రామ్ చివరకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలు పెడతాడు. యాప్ సక్సెస్ కావడంతో అందరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన రామ్ లో అహంకారం పెరుగుతుంది. తన స్వశక్తి కారణంగా ఈ పొజిషన్ కు ఎదిగాననే గర్వమూ కలుగుతుంది. అదే సమయంలో అతని జీవితంలో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది. ప్రియా అతనికి దూరమౌతుంది. ఆ ఇన్సిడెంట్ తో రియలైజ్ అయిన రామ్ ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. తన జీవితంలో కీలక సమయాల్లో తారసపడి సాయం చేసిన వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలని ఇండియాకు బయలు దేరతాడు. ఈ జర్నీ నుండి లెసన్స్ నేర్చుకుని తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడన్నదే మిగతా కథ.
గడిచిన జీవితంలో తారసపడిన వ్యక్తులను తలుచుకునే సినిమా అనగానే ముందు తరాల వాళ్ళకు ఠక్కున ‘మేరా నామ్ జోకర్’ గుర్తొస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్’ మూవీ మదిలో మెదులుతుంది. ‘థ్యాంక్స్’ సినిమా చూస్తున్నప్పుడు ఆ రెండు సినిమాలతో పాటు మొన్నా మధ్య వచ్చిన మహేశ్ బాబు ‘మహర్షి’ కూడా బుర్రలో తడుతుంది. అయితే… హీరోని అతని అంతరాత్మ ప్రశ్నించడం, దాంతో రియలైజ్ అయ్యి అతను ఇండియాకు హుటాహుటిన బైలుదేరడం కాస్తంత కామెడీగా ఉంది. హీరో తన గత జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలోనూ అవతలి వాళ్ళను దోషులుగానే భావిస్తాడు. కానీ అది కరెక్ట్ కాదని అతని అంతరాత్మ చెబుతుంది. సో… మనసుకు నిజం తెలిసి కూడా అతను సెల్ఫిష్ గా తయారైనట్టు చూపడంలో అర్థం లేదు. ఒకవేళ వాస్తవం ఏమిటనేది అతనికి ఇండియా వచ్చిన తర్వాత తెలిసినట్టు చూపి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. బీవీయస్ రవి రాసిన కథను, విక్రమ్ కుమార్ డైజెస్ట్ చేసుకుని తెరకెక్కించడంలో ఎక్కడో లింక్ తెగిపోయిందనిపిస్తోంది. అలానే చాలా సన్నివేశాలలో కంటిన్యుటీ లేదు. సినిమా నిడివిని నియంత్రించే క్రమంలో వాటిని ఎడిట్ చేశారేమో తెలియదు. బట్… హీరో రియలైజేషన్ని క్లయిమాక్స్ లో చక్కగా చూపించారు. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని చెప్పడం బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే… నాగచైతన్య మూడు స్టేజెస్ లోని వేరియేషన్స్ ను బాగా చూపించాడు. చిన్నప్పటి గెటప్ లో అతని చూస్తుంటే ‘ప్రేమమ్’లో చేసిన పాత్ర గుర్తొస్తుంది. ఇక కాలేజీ స్టూడెంట్ గెటప్ చాలా సినిమాల్లో చూసిందే. బిజినెస్ మాగ్నెట్ గా కాస్తంత కొత్తగానూ, హుందాగానూ కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని కంటే రాశీఖన్నా పెద్దగా అనిపించింది. మాళవిక నాయర్ మేకోవర్ బాగుంది. ప్రకాశ్ రాజ్, ఈశ్వరీరావు, తులసి, సంపత్ రాజ్, రాజేశ్వరి నాయర్, భరత్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, మిర్చి హేమంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతినాయకుడిగా, పొలిటీషియన్ గా సాయి సుశాంత్ రెడ్డి ఆకట్టుకున్నాడు. అతని చెల్లిగా అవికా గోర్ నటన బాగుంది. ప్రథమార్ధం ఆసక్తికరంగా సాగినా, ద్వితీయార్థంకు వచ్చే సరికీ కథ ట్రాక్ తప్పింది. మరీ రెండు సంఘటనలతో కథను సాగతీయడం బాలేదు. ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా… దాన్ని ప్రోపర్ గా డెలివరీ చేయలేకపోయారు. తమన్ ట్యూన్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెరుగ్గా ఉంది. పీ. సీ. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ ఎక్కడా రాజీ పడలేదన్న విషయం మూవీ చూస్తుంటే అర్థమౌతోంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ కూడా ఈ మూవీకి నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ను థియేటర్ల లో కంటే ఓటీటీలో చూసినప్పుడే జనం ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ
తమన్ నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
కన్వెన్సింగ్ లా లేని సీన్స్
పండని సెంటిమెంట్
నిరాశకు గురిచేసే ద్వితీయార్థం
ట్యాగ్ లైన్: నో మెన్షన్!