NTV Telugu Site icon

Tenth Class Diaries Review: టెన్త్ క్లాస్ డైరీస్‌

10th Class Diaries Min

10th Class Diaries Min

స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ రీ-యూనియన్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ చిత్రాలు వచ్చాయి. వాటిల్లో ‘ఆటోగ్రాఫ్’, ’96’ వంటి సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. బట్ తమిళంలోని మేజిక్ ను ఇక్కడ సృష్టించలేకపోయాయి. అయినా కానీ రీ-యూనియన్ తాలుకూ స్వీట్ మెమొరీస్ ను ఆడియెన్స్ కు అందించే ప్రయత్నం మన దర్శకనిర్మాతలు మానలేదు. ఆ కోవలో వచ్చిందే ‘టెన్త్ క్లాస్ డైరీస్’! అచ్యుత రామారావు, రవితేజ నిర్మించిన ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

సోమయాజి (శ్రీరామ్)ని అందరూ ముద్దుగా సోము అని పిలుస్తుంటారు. స్కూల్ డేస్ లోనే చాందిని (అవికాగోర్‌)తో అతనికి క్రష్ ఏర్పడుతుంది. చాందిని తండ్రి (నాజర్)కి విషయం తెలియడంతో సోమూను చితక్కొడతాడు. తర్వాత అతని కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోతుంది. సోము పెరిగి పెద్దవాడై, విదేశాలలో బిజినెస్ మాగ్నట్ గా స్థిరపడతాడు. చేసుకున్న పెళ్ళి పెటాకులైపోతుంది. ఆ సమయంలో సోముకు చాందిని మదిలో మెదులుతుంది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఏం చేస్తోంది? ఒకసారి కలిస్తే బాగుంటుందేమో!? అనే ఆలోచనలు కలుగుతాయి. చాందిని ని కలవడం కోసం ఇండియాకు వచ్చిన సోము, తన పాత మిత్రులతో మాట్లాడి, స్కూల్ క్లాస్ మేట్స్ రీ-యూనియన్ కు ప్లాన్ చేస్తాడు. చాందినిని కలవడమే ధ్యేయంగా సోమూ చేసిన ఈ ప్రయత్నం ఏమేరకు సఫలీకృతం అయ్యింది? ఆమెను కలిసే ప్రయత్నంలో సోముకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? అన్నదే ఈ చిత్ర కథ.

నటుడు, నిర్మాత అచ్యుత రామారావు గతంలో హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘రోజ్ విల్లా’, వినోద ప్రధానంగా ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు మాత్రం వినోదంతో పాటు బోలెడంత సెంటిమెంట్ ను మిక్స్ చేసి, రీ-యూనియన్ తో పాటు ట్రావెల్ మూవీగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను తీశారు. విశేషం ఏమంటే ఈ సినిమాకు ఆయనే కథకుడు. అయితే స్కూల్ క్లాస్ మేట్స్ రీ-యూనియన్ అనేది ప్రథమార్ధంతోనే పూర్తయిపోతుంది. అక్కడ వరకూ సినిమా ఫుల్ ఫన్ తో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ను ఆకట్టుకునేలా సాగింది. హాస్యం పేరుతో, సిట్యుయేషన్ డిమాండ్ చేసిందనే నెపంతో కొన్ని చోట్ల డైలాగ్స్ తో పాటు సన్నివేశాలూ హద్దులు మీరాయి. ద్వితీయార్థంకు వచ్చే సరికీ కథ చాందినిని వెతికి పట్టుకోవడం టార్గెట్ గా సాగింది. అక్కడే బిగువు సడలిపోయింది. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంత వెతికిన చందంగా మారిపోయింది. ఫస్ట్ హాఫ్ – సెకండ్ హాఫ్‌ మధ్య చాలా వేరియేషన్ ఉండటంతో ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఈ కథతో కనెక్ట్ కాలేని పరిస్థితి. పెళ్ళి అయిన తర్వాత ఉత్తి పుణ్యానికి ఆమె భర్తను వదిలి వెళ్ళిపోవడం, మానసిక ప్రశాంతత కోసం హిల్ స్టేషన్స్ కు వెళ్ళడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు… ఇవేవీ కన్వెన్సింగ్ గా లేవు. కథను నడపడం కోసం బలవంతంగా రాసుకున్న సన్నివేశాలని అర్థమైపోతూనే ఉంటుంది. ఆమె చేసే ప్రయాణానికి ఎలాంటి అర్థవంతమైన కారణం దర్శకుడు చూపించలేకపోయాడు. దాంతో ప్రథమార్థంలోని కామెడీని చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు ద్వితీయార్థం బోర్ కొడుతుంది. ద్వితీయార్థంలోకి కథతో కనెక్ట్ అయిన వారికి ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ అతిగా అనిపిస్తుంది. చాందిని అనే పాత స్నేహితురాలిని కలవడం కోసం సోము రీ-యూనియన్ అని ఇంత డ్రామా చేయాలా అనే డౌట్ వస్తుంది.

నటీనటుల్లో శ్రీరామ్ ఇంకా అదే ఫిజిక్ ను మెయిన్ టైన్ చేయడం గ్రేట్. ‘రోజాపూలు’ సినిమా టైమ్ లో ఎలా ఉన్నాడో దాదాపుగా అలానే ఉన్నాడు. అవికాగోర్ సినిమాలో కనిపించేది ద్వితీయార్థంలోనే! ఆమె పాత్రలో ఫన్ కంటే పెయిన్ ఎక్కువ ఉంది. జాలీ మూమెంట్స్ కొన్నే ఉన్నాయి. అక్కడ కాస్తంత హుషారుగా చేసింది. బట్ ఇదివరకటి ఛామ్ ఆమెలో మిస్ అయ్యింది. సోమూ స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి, అచ్యుత రామారావు అదరగొట్టారు. వీళ్ళ కామెడీ టైమింగ్ సూపర్. ఇతర ప్రధాన పాత్రలను హిమజా, అర్చన, నాజర్, రాజశ్రీ నాయర్, సంజయ్ స్వరూప్, శివాజీరాజా, నిత్య, కేశ, రాహుల్ తదితరులు పోషించారు. శివబాలాజీ, మధుమిత భార్యభర్తలుగా నటించారు. మధుమితది ఓ రకంగా గెస్ట్ అప్పీయరెన్సే! జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు మరికొందరు రీ-యూనియన్ బ్యాచ్ లో వినోదం పంచే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి తన శాఖను తానే నిర్వర్తించారు. అందువల్ల ప్రతి ఫ్రేమ్ ముఖ్యంగా ద్వితీయార్థంలో హిల్ స్టేషన్స్ సీన్స్ బ్యూటిఫుల్ గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. చిన్నా నేపథ్య సంగీతం ఏమంత గొప్పగాలేదు. అలానే సురేశ్‌ బొబ్బిలి స్వరపరిచిన ఐటమ్ సాంగ్ తో సహా ఏ ట్యూన్ ఆకట్టుకోలేదు. పాటల ద్వారా ఏదో భావాన్ని ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం జరిగింది కానీ అది వాళ్ళకు సరిగా రీచ్ కాలేదు. ఓవర్ ఆల్ గా మిక్స్డ్ మెమురీస్ అండ్ ఎక్స్ పీరియన్స్ నూ అందించే చిత్రంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మిగిలిపోయింది.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
ప్రథమార్ధంలోని వినోదం
ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని ట్రావెలింగ్ ఎపిసోడ్స్
రొటీన్ గా రీ యూనియన్ సీన్స్
మెప్పించని సంగీతం

ట్యాగ్‌ లైన్‌: మిక్స్‌డ్‌ మెమొరీస్

రేటింగ్: 2.5 / 5

Show comments