సందీప్ కిషన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా సందీప్ కిషన్ 30వ చిత్రంగా తెరకెక్కింది మజాకా. ఈ సినిమాలో రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అన్షు కీలక పాత్రలలో నటించారు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత డైరెక్టర్ త్రినాధ రావు డైరెక్ట్ చేసిన సినిమా కావడం, ప్రమోషనల్ కంటెంట్ కాస్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ప్రమోషన్స్ చేసింది సినిమా టీం. ఈ క్రమంలో ప్రేక్షకులు అంచనాలను ఈ సినిమా అందుకుందా ? ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనే వివరాలు తెలియాలంటే రివ్యూ చూసేయండి ఇంకెందుకు ఆలస్యం.
మజాకా కథ:
వెంకటరమణ (రావు రమేష్) ఒక ట్రావెల్ కంపెనీలో పని చేసే ప్రైవేటు ఉద్యోగి. భార్య ప్రసవం జరిగినప్పుడే చనిపోవడంతో తన ఏకైక కుమారుడు కృష్ణ (సందీప్ కిషన్)తో కలిసి బతుకుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ ఏర్పరచుకొని ఆ ఫ్యామిలీ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని ధ్యేయంతో ఈ తండ్రి కొడుకులు అదే పనిలో ఉంటారు. కృష్ణకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ఇద్దరూ మగవాళ్ళే ఉన్న ఇంటికి ఆడపిల్లను ఎలా పంపించాలని పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. దీంతో లేటు వయసులో పెళ్లి చేసుకునేందుకు వెంకటరమణ సిద్ధమవుతాడు. సరిగ్గా అదే సమయంలో యశోద(అన్షు)నీ మొదటి చూపులోనే చూసి ఇష్టపడతాడు. ఆమెతో ఎలా అయినా ఏడు అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తాడు. మరోపక్క కృష్ణ తాను చదివిన కాలేజీలోనే చదువుతున్న మీరా(రీతు వర్మ)ను కూడా మొదటి చూపులోనే ఇష్టపడి ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. ఇలా తండ్రి కొడుకులు ఒకే సమయంలో ప్రేమలో పడి వారి ప్రేమను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వారి ప్రేమలు సఫలమయ్యాయా? వారి ప్రేమ కథలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? చివరికి వీరి ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా కథ ఏమిటి అనే విషయం టీం ముందుగానే చెప్పేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే ఒక ఇంటి ఫ్యామిలీ ఫోటో కోసం తండ్రీకొడుకులు పడే ఆరాటమే ఈ సినిమా కథ అని చెప్పేశారు.. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి తండ్రి కొడుకుల క్యారెక్టర్ లను ప్రేక్షకులలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. పురిట్లో ఉండగానే భార్య చనిపోతే ఆ కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం కోసం పడే ఇబ్బందులను ఎమోషనల్ గా కాకుండా ఎంటర్టైనింగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయంలో కాస్త ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే తెరమీద పాత్రలు కుటుంబం కోసం పరితపిస్తుంటే ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదో కుర్రవాడిలా తండ్రి కొడుకుతోపాటు తాను కూడా ఓ అమ్మాయి వెంట పడుతూ ఉండడం రియాలిటీకి కాస్త దూరంగానే ఉంటుంది. నిజానికి సెకండ్ హాఫ్ లో ఆ విషయానికి అన్ని రకాల క్లారిటీలు ఇచ్చారు కానీ ముందు నుంచి పూర్తిస్థాయి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం నవ్విస్తూనే సాగింది. అయితే కొన్నిచోట్ల ఆర్గానిక్ గానే నవ్వు పుట్టినా సరే కొన్నిచోట్ల ఎందుకో కామెడీ సరిగా పండలేదు. సెకండ్ హాఫ్ వరకు ప్రేక్షకులను నవ్విస్తూ తీసుకువెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఆ నవ్వులకు బ్రేకు లేసి ఎమోషనల్ యాంగిల్ లో సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు. సినిమాలో కొంతవరకు ఊహకు అందకుండా ఉన్నా తర్వాత ఏం జరగబోతుందో సగటు ప్రేక్షకుడు కూడా అర్థం చేసుకోగలగడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశమే. నిజానికి ఈ కథ కొత్తది కూడా కాదు. ఎప్పుడో మా నాన్నకు పెళ్లి లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూసేసారు కానీ ఇప్పటి ట్రెండ్ కి తగినట్లుగా దాన్ని మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు ఎంటర్టైనింగ్ వారిని నవ్వించడంలో కొంత తడబడినా కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం నవ్విస్తూ సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో ఏడిపిస్తూ ఆలోచింపచేస్తూ సినిమా సాగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో వెంకటరమణ అనే పాత్రలో రావు రమేష్ పరకాయ ప్రవేశం చేశాడు. నిజంగానే రావు రమేష్ ఇలాంటి ఒక పాత్ర చేయగలుగుతాడా? అని ఊహించడమే ఇక్కడ మేకర్స్ మొదటి విజయం అని చెప్పొచ్చు. అంతలా మనోడు ఆ పాత్రలో ఇమిడిపోయాడు. తర్వాత సందీప్ కిషన్ కూడా తనకి బాగా అలవాటైన కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. రీతు వర్మకు పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు కానీ అన్షు ఉన్నంతలో మెప్పించింది. మురళీ శర్మకు కూడా బాగా అలవాటైన పాత్ర కావడంతో ఆడేసుకున్నాడు. ఇక శ్రీనివాసరెడ్డి, హైపర్ ఆది వంటి వాళ్ళు ఉన్నా పూర్తిగా కామెడీకి వాడుకోలేదు. ఉన్న కొద్ది సీన్లలో వారి చేత నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రధారులు పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ చాలా వరకు క్యాచీగా ఉండడమే కాదు నవ్వు తెప్పించే ఎలా ఉన్నాయి. ఎమోషనల్ డైలాగ్స్ కూడా పేజీలు పేజీలు లేకుండా చాలా క్రిస్పీగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసుకోవడంలో టీం సక్సెస్ అయ్యింది..సినిమాలో సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మంచి కలర్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. పాటలు ఒకటి రెండు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎందుకో సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. ఎడిటింగ్ టేబుల్ మీద గట్టిగానే వర్క్ చేసినట్లు కనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా : మజాకా, లిమిటెడ్ ఫన్ విత్ ఎమోషన్స్