నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా సుందరకాండ. నిజానికి ఇదే సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు, కానీ సినిమా కాస్త లేట్ అవ్వడంతో ప్రతినిధి2తో పాటు భైరవం సినిమాలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉంచితే, ఈ సుందరకాండ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసింది. చాలాకాలం తర్వాత రోహిత్ హీరోగా వస్తూ ఉండడం, శ్రీదేవి చాలా కాలం తర్వాత మరోసారి నటిస్తూ ఉండడంతో పాటు, పాటలు కూడా హిట్ అవడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా రిలీస్ చేస్తూ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్నప్పుడే స్కూల్లో తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి)ని ప్రేమించి, అనుకోకుండా ఆమెకు దూరం అవుతాడు. అయితే, ఆమెలో చూసిన ఐదు లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని భావించి, అలాంటి ఐదు లక్షణాలు ఉన్న అమ్మాయి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక రోజు అనుకోకుండా ఎయిర్పోర్టులో ఐరా (వృతి వాగాని)లో ఆ ఐదు లక్షణాలు ఉన్నాయని అర్థమై, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ముందు ఒప్పుకోకపోయినా, తర్వాత ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే, ఐరా ఇంట్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సిద్ధార్థ్‌కు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. సిద్ధార్థ్‌కు తెలిసిన ఆ షాకింగ్ విషయం ఏమిటి? ఐరాను సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎప్పుడో స్కూల్లో లవ్ చేసిన వైష్ణవి సిద్ధార్థ్ జీవితంలోకి మళ్లీ వచ్చిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్. డీల్ చేయడంలో ఏమాత్రం తేడా పడినా మొదటికే మోసం వచ్చి ఉండేది, కానీ ఎంత చక్కగా వల్గారిటీ లేకుండా రాసుకున్న దర్శకుడు, అంతే చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. నిజానికి దర్శకుడికి తన రైటింగ్ చాలా ప్లస్ పాయింట్. చాలా క్రిటికల్ పాయింట్‌ని చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్లు అనిపించింది. నిజానికి ఇలాంటి పాయింట్ వింటేనే ముందు కంగారుపడతారు, కానీ ఇలాంటి పాయింట్‌తో సినిమా చేసేందుకు ముందుకు రావడమే నారా రోహిత్ మొదటి విజయం అనిపిస్తుంది. నిజానికి నారా రోహిత్‌కి ఇలాంటి ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ బాగా వర్కౌట్ అవుతాయి. సోలో సినిమా అందుకే మొదటి సినిమా అయినా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా తన హోమ్ గ్రౌండ్‌కి వచ్చి ఆడిన నారా రోహిత్ ఆట బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమాలో సత్య ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయింది. మనోడు నోటి వెంట వచ్చిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక సిద్ధార్థ్ ప్రేమ తర్వాత జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి కొన్నిచోట్ల తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం అర్థం అయిపోయేలాగానే ఉన్నా, కొన్నిచోట్ల మాత్రం చాలా తెలివిగా ఊహలకు అందకుండా రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంది. రొటీన్ క్లైమాక్స్ ఇస్తాడేమో అనుకుంటే, అలా ఇవ్వకుండా తనదైన శైలిలో సినిమాని ముగించాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే, నారా రోహిత్ తన హోమ్ గ్రౌండ్‌లో అదరగొట్టాడు. తనకు బాగా అలవాటు అయిన తరహా పాత్రలో మెరిశాడు. బాడీ విషయంలో కూడా అభినందించాల్సిందే, చాలా బాగా మెయింటైన్ చేశాడు. డైలాగ్ డెలివరీతో పాటు ఫైట్స్ కూడా ఇరగదీసాడు. చాలాకాలం తర్వాత నారా రోహిత్‌కి సరైన హిట్ పడింది అనిపించేలా చేసుకున్నాడు. హీరోయిన్‌గా వృతి వాగాని చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక శ్రీదేవి కూడా చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించి, చాలా ఈజ్‌తో నటించింది. సత్య పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సునయన, అభినవ గోమటం, నరేష్, విటీవీ గణేష్ సహా మిగతా పాత్రధారులు అందరూ ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాలో మ్యూజిక్ ప్లస్ పాయింట్. కొన్ని ట్యూన్స్ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగినా సరే, సినిమా మొత్తాన్ని ప్లెజెంట్ ఫీలింగ్‌తో తీసుకువెళ్లడానికి ట్యూన్స్ బాగా ఉపయోగపడ్డాయి. అలాగే, డైరెక్టర్ రైటింగ్ కూడా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా ఉంది. నిడివి విషయంలో ఇంకా కొంచెం తగ్గించి ఉండవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ, ఈ సుందరకాండ కామెడీ, డ్రామా, ఎమోషన్స్ కలగలిపిన ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.