శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా ‘హాష్ ట్యాగ్ సింగిల్’ అనే సినిమా రూపొందింది. తమిళంలో పలు సినిమాలు చేసి, తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన కార్తిక రాజు అనే తమిళ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. విద్యా కొప్పునీడి, భాను ప్రతాప్, రియాజ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో అంచనాలు పెంచింది. కామెడీ సినిమాగా ముందు నుంచి ప్రమోట్ చేస్తూ సినిమా టీం రావడంతో సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
#సింగిల్ కథ:
విజయ్ (శ్రీ విష్ణు) ఒక బ్యాంకులో ఇన్సూరెన్స్ సెక్షన్‌లో పనిచేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్)తో సింగిల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అయితే, మెట్రోలో చూసిన పూర్వ (కేతిక శర్మ)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెకు నేరుగా ప్రపోజ్ చేస్తే ఎక్కడ కాదంటుందో అనే భయంతో, ఆమె పనిచేసే కార్ షోరూమ్‌కి కారు కొనే వంకతో వెళ్తాడు. రెండు వారాల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయగా, ఆమె మోసం చేసినట్లు ఫీల్ అయి, చీ కొట్టి వెళ్ళిపోతుంది. మరోపక్క, అనుకోకుండా కలిసిన హరిణి (ఇవానా) శ్రీ విష్ణుపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఒకపక్క హరిణికి విజయ్ అంటే ఇష్టం, విజయ్‌కి పూర్వ అంటే ఇష్టం. ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎటు దారితీసింది? చివరికి విజయ్, పూర్వ కలిశారా? లేక విజయ్, హరిణి కలిశారా? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే అర్థమైపోయింది. హీరో ఒక హీరోయిన్‌ని ప్రేమిస్తాడు, మరో హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది. చివరికి హీరో ఈ హీరోయిన్‌లలో ఎవరితో సెటిల్ అయ్యాడు అనేది సినిమా లైన్ అని అందరం అనుకుంటాం. కానీ, అక్కడే ఈ సినిమా దర్శకుడు కాస్త తెలివి చూపించి, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు ఆసక్తికరమైన క్లైమాక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ సినిమా కథ లైన్‌గా చెప్పుకోవడానికి చాలా బాగుంది. కానీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చే సమయంలో బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఈ సినిమా మొత్తం శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, వన్‌లైనర్స్‌తోనే కడుపుబ్బా నవ్వించేలా రాసుకున్నారు. దర్శకుడు రాసుకున్న కథకు తెలుగు రైటర్లైన నందు, భాను రాసిన డైలాగులకు శ్రీ విష్ణు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. నిజానికి సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కడా పెద్దగా సాగదీయకుండా కథలోకి తీసుకెళ్లిపోతారు. హీరో మెట్రో రైల్లో ఒక హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆమె ప్రేమను దక్కించుకునే ప్రయత్నంలో పడటం ఆసక్తి రేకెత్తిస్తుంది. అదే సమయంలో, మరో హీరోయిన్ హీరోని వెంటపడుతూ నవ్వులు పోయిస్తుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగిపోయినా, సెకండ్ హాఫ్‌లో కాస్త రైటింగ్ లోపించి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీకి స్కోప్ ఉంది, చాలా చోట్ల నవ్వించారు కూడా, కానీ ఒక ఎమోషనల్ యాంగిల్‌ని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాకి శ్రీ విష్ణు ఒక్కడే హీరో కాదు. శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ కూడా సమానంగా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరి కామిక్ టైమింగ్, వన్‌లైనర్స్‌తో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. హరిణిగా ఇవానా అద్భుతంగా నటించింది, ఆమె నటనలో పరిణతి కనిపించింది. ఇక కేతిక శర్మ కూడా పూర్వ అనే క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. అయితే, వారి క్యారెక్టర్‌లను పూర్తిస్థాయిలో ఎక్స్ప్లోర్ చేయకుండా పైపైనే నడిపించడంతో వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. టెక్నికల్ విషయానికి వస్తే, డైలాగ్స్ రాసిన నందు, భాను ఇద్దరికీ సినిమా సక్సెస్‌లో సింహభాగం దక్కాలి. ఎందుకంటే, వారు లేకపోతే ఈ సినిమా ఎటో వెళ్లిపోయేది అనిపించక మానదు. ఇక సంగీతం బాగానే ఉన్నా, ఇంకా బెటర్‌గా ఉండి ఉంటే ప్రేక్షకుల్లోకి బాగా చొచ్చుకువెళ్లడానికి పనికొచ్చి ఉండేది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగుంది. హైదరాబాద్‌ను బాగా ఎక్స్ప్లోర్ చేయడంలో కూడా సినిమాటోగ్రఫీ సక్సెస్ అయింది. సినిమా క్రిస్పీగానే ఉంది, సెకండ్ హాఫ్ విషయంలో మరింత క్రిస్పీనెస్ తోడై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.
ఫైనల్లీ, ఈ సింగిల్ గాడు కడుపుబ్బా నవ్వించి బయటకు పంపిస్తాడు.