NTV Telugu Site icon

Amaran Review: శివ కార్తికేయన్ అమరన్ రివ్యూ

Amaran Sk

Amaran Sk

శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా అమరన్ అనే సినిమా తెరకెక్కింది. రాజ్ కుమార్ పెరియ సామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ సినిమాస్ బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా తమిళ సహా తెలుగు రాష్ట్రాలలో రెండు భాషల్లో రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ కట్స్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఇద్దరికీ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో టికెట్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

అమరన్ కథ:
నిజానికి ఇది కథ కాదు నిజంగా జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని చేసిన సినిమా. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముకుంద్ వరదరాజన్ 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్ గా వ్యవహరిస్తూ మృత్యువాత పడ్డారు. ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ తమ పరిచయం నుంచి అశోక చక్ర గ్యాలరీ అవార్డు అందుకునే వరకు జరిగిన కథను ప్రేక్షకులకు వివరించేలా ఈ సినిమా తెరకెక్కించారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, ఇందు పాత్రలో సాయి పల్లవి నటించారు. 2004లో వీరి పరిచయం ఎలా జరిగింది? ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమలో పడిన తర్వాత వివాహం చేసుకునేందుకు పెద్దలను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు? ముకుంద్ చీతా వింగ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి విజయాలు సాధించాడు? కాశ్మీర్లో అల్తాఫ్ బాబా, ఆసిఫ్ ఘని వంటి వాళ్లను ఎలా అరికట్టగలిగాడు? చివరికి ఎలా పోరాడుతూ మృత్యువాత పడ్డాడు లాంటి విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

అమరన్ విశ్లేషణ:
నిజానికి ఇది ఒక కథ కాదు. ముందుగా చెప్పుకున్నట్టుగానే ఒక నిజమైన సంఘటనను ఆధారంగా చేసుకుని రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. నిజానికి ఒక మిలిటరీ సోల్జర్ బయోపిక్ అని చెప్పొచ్చు. కానీ దేశభక్తి మీద ప్రధానంగా ఫోకస్ చేయకుండా అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎంత మిలిటరీ సోల్జర్ అయినా సరే అతను కూడా ఒక మనిషి. అతనికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, తల్లి తండ్రులు అలాగే తోడ పుట్టిన వారు వారి బాధ్యతలు భార్య, పిల్లలు ఉంటారు. దేశం మీద ప్రేమతో సరిహద్దులలో కంటికి కనిపించే కనిపించని శత్రువులతో పోరాడుతూ ఎలాంటి ఇబ్బందులు పడతారు? కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఎంత మనోవేదన అనుభవిస్తారు? లాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు ప్రేక్షకుల మనసులను మెలిపెట్టే విధంగా స్క్రీన్ మీద చూపెట్టారు. ఒక రొటీన్ వార్ డ్రామాలా కాకుండా ఈ సినిమాలు చాలా న్యాచురల్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అతిశయోక్తితో కూడిన హీరోయిజాన్ని చూపించే కంటే సైనికులు ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందికరమైన అనుభవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సినిమాను ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ లా కాకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ను ఏమాత్రం పక్కదారి పట్టకుండా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు మెలోడ్రామా ముఖ్యం కానీ ఈ సినిమాలో ఆ మెలో డ్రామా లేకుండానే ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా కొన్ని సీన్స్ రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, ఇందు వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించ లేదు జీవించారు. చాలా సన్నివేశాలలో ఇద్దరు కంటతడి పెట్టించేలా నటించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ పాత్రలకు వీరు మాత్రమే న్యాయం చేయగలరు వీరు కాకుండా ఇంకెవరు ఉన్నా సినిమా ఇంత ఇంపాక్ట్ ఫుల్ గా రాదేమో అనిపించేలా నటించారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ ఎవరికి వారే తమ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలరో అంతవరకు న్యాయం చేశారు. ఇది నిజ జీవిత గాధ కావడంతో క్యాస్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లయితే అనిపించింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు జీవి ప్రకాష్ కుమార్. అవసరమైన చోట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూనే కొన్ని సన్నివేశాలలో అసలు ఏమీ ఇవ్వకుండానే ప్రేక్షకులందరినీ ఒక రకమైన నిశ్శబ్దానికి లోనయ్యేలా చేశాడు. దానికి తోడు ఆయన అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టరయ్యాయి. కాశ్మీర్ అందాలను అందంగా చూపిస్తూనే మరోపక్క యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. అలాగే ఎన్కౌంటర్ సన్నివేశాలు డిజైన్ చేసిన తీరు చాలా సహజంగా అనిపించింది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది లీనియర్ స్క్రీన్ ప్లే కావడంతో ప్రేక్షకులు పెద్దగా బుర్రలకు పదును పెట్టాల్సిన అవసరం కూడా లేదు

ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా? అవును నిరభ్యంతరంగా కుటుంబాలతో కలిసి ఇంటిల్లిపాది చూడవచ్చు.

ఫైనల్ గా: ఇది ఒక అమరుడి కథ.. కన్నీళ్లు పెట్టించ కుండా బయటకు రాలేనంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్.