ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వచ్చిన 60వ చిత్రం ‘సీతారామం’. సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మహానటి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతారామం’తో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ‘యుద్థం రాసిన ప్రేమలేఖ’ అనే కాప్షన్ తో హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ ఎలా ఉందో తెలుసుకుందాం.
రామ్ (దుల్కర్ సల్మాన్) ఒక ఒక అనాథ. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కశ్మీర్ లో ఓ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా రామ్ ఇంటర్వ్యూ రేడియోలో ప్రసారమవుతుంది. అందులో రామ్ అనాథ అనే విషయం తెలిసిన అనేకమంది అతనికి లేఖలు రాస్తుంటారు. వాటిలో సీత (మృణాల్ ఠాగూర్) అనే అమ్మాయి రాసిన ఉత్తరం కూడా ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ లేని ఆ వుత్తరంలోని వాక్యాలు రామ్ ను ఆకట్టుకుంటాయి. సీత ఎవరో తెలుసుకోవాలని, ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని రామ్ ఆశ పడతాడు. మొత్తానికీ రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమా చిగురిస్తుంది. అయితే… వారి ప్రేమకు సినిమా కష్టాలు ఎదురవుతాయి. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం పీఓకే (పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్) లోకి వెళ్ళిన రామ్ చివరిసారిగా సీతకు ఓ ఉత్తరం రాస్తాడు. అది సీతకు అందిందా లేదా? అన్నదే ఈ చిత్ర కథ. అయితే… సినిమా మాత్రం ఇంత సింపుల్ గా ఉండదు. నిజానికి రామ్ రాసిన ఉత్తరాన్ని ఇరవై యేళ్ళ తర్వాత సీతకు అందించే బాధ్యతను ఇండియాను ద్వేషించే అఫ్రీన్ (రశ్మికా మందణ్ణ) అనే పాకిస్తానీ అమ్మాయి స్వీకరించాల్సి వస్తుంది. ఇండియాలోని బాలాజీ (తరుణ్ భాస్కర్)తో కలసి ఆమె సీత కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. సీత ఆచూకీ దొరక్క పోవడంతో రామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చివరకు అఫ్రీన్… రామ్ రాసిన ఉత్తరాన్ని సీతకు అందించిందా? సీక్రెట్ ఆపరేషన్ కోసం పీఓకే కు వెళ్ళిన రామ్ అక్కడ నుండి తిరిగి వచ్చాడా లేదా? రామ్ – సీత ఎడబాటులో బ్రిగేడియర్ విష్ణుశర్మ (సుమంత్) పాత్ర ఏమిటీ? అనేదే ‘సీతారామం’ సినిమా!
1964లో మొదలైన ఈ కథ… 1985లో ముగుస్తుంది. లెఫ్టినెంట్ రామ్ మిలిటరీ ఆపరేషన్స్, సీతతో అతని ప్రణయం, దాని పర్యవసానం, వారి ఎడబాటు… ఓ కథ అయితే, ఇరవై ఏళ్ళ తర్వాత రామ్ రాసిన ఉత్తరాన్ని సీతకు అందించడం కోసం లండన్ నుండి పాకిస్తానీ అమ్మాయి అఫ్రీన్ అన్వేషణ సాగించడం మరో కథ. సీతారామ్ ల అన్వేషణను, వారి ప్రేమాయణాన్ని దర్శకుడు… అఫ్రీన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా పోకడ ఇదే సంస్థ ఆ మధ్య నిర్మించిన ‘మహానటి’ మూవీని జ్ఞప్తికి తెస్తుంది. అందులో జర్నలిస్ట్ మధురవాణి (సమంత) తన స్నేహితుడు విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ) సాయంతో సావిత్రి జీవితం గురించిన వివరాలు రాబట్టినట్టే… ఇందులో అఫ్రీన్, బాలాజీ సాయంతో సీత, రామ్ ల గురించి వివరాలు సేకరిస్తుంటుంది. ‘మహానటి’ కథ 1942 నుండి 1980 మధ్య జరిగితే… ఇది 1964 నుండి 1985 మధ్య జరుగుతుంది. దాంతో చాలా సన్నివేశాలలో సామీప్యం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సీత నేపథ్యం, రామ్ ను ఆమె తొలిసారి కలిసిన సన్నివేశాలు, కుటుంబం నుండి ఆమెకు ఎదురయ్యే చేదు అనుభవాలు… ఇవన్నీ సినిమాటిక్ గానూ, వీక్ గానూ ఉన్నాయి. దాంతో సీత – రామ్ మధ్య చిగురించిన ప్రేమలోని గాఢతను ప్రేక్షకులు ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. అలానే బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్రలోనూ డెప్త్ లేకుండా పోయింది. ఇండియాను ద్వేషించే అఫ్రీన్… సీత, రామ్ ల గురించి జరిపే అన్వేషణను ఆసక్తికరంగా తీయలేకపోయారు. తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఎక్కడా కలగలేదు. పైగా సినిమా అయిపోయిందనుకుంటున్న తరుణంలో మరి కొంత సేపు సాగదీయడంతో గ్రాఫ్ పడిపోయింది. కొసమెరుపు సైతం ఊహకందేదిగానే ఉంది!
నటీనటుల విషయానికి వస్తే… బిగ్రేడియర్ రామ్ గా దుల్కర్ సల్మాన్ చక్కగా నటించాడు. ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం కష్టమే. చిన్న చిన్న మూమెంట్స్ సైతం హృదయానికి హత్తకునేలా ఉన్నాయి. సీతగా మృణాల్ ఠాగూర్ అంతగా మెప్పించలేకపోయింది. ఆమె నటనానుభవం ఆ పాత్రకు సరిపోలేదనిపిస్తుంది. రశ్మిక మందణ్ణ ఈ పాత్రను అంగీకరించడం విశేషం! అయితే ఆ పాత్రలోని వైరుధ్యాన్ని మరింత ప్రభావవంతంగా తెరకెక్కించాల్సింది. భారతదేశాన్ని ద్వేషించే ఆమె… రామ్ కథను తెలుసుకున్న తర్వాత తన తప్పుకు సిగ్గుపడి, ఈ దేశానికి, ఇక్కడి జవాన్లకు రుణపడినట్టు చూపించాల్సింది. దర్శకుడు ఆ అంశం మీద ఫోకస్ పెట్టలేదు. సుమంత్ తనకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేశాడు. దాంతో అది పేలవంగా మారిపోయింది. ఈ సినిమాలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి పాత్రకూ గుర్తింపు ఉన్న నటీనటులనే తీసుకున్నారు. సచిన్ ఖేడేకర్, గౌతమ్ మీనన్, మురళీశర్మ, ప్రకాశ్ రాజ్, భూమిక, టీనూ ఆనంద్, గీతా భాస్కర్, రుక్మిణీ విజయ్ కుమార్, శత్రు, మనోజ్ నందం, మహేశ్ ఆచంట, ప్రియదర్శి, అభినయ, జిషు సేన్ గుప్తా, అనిశ్ కురువిల్లా, రోహిణి… ఇలా పెద్ద జాబితానే ఉంది. వీరితో పాటు నట, దర్శకుడు సందీప్ రాజ్ లాంటి వారు అతిథి పాత్రల్లో మెరిశారు. నాటకాల పిచ్చోడిగా ‘వెన్నెల’ కిశోర్, రైల్వే టీసీగా సునీల్ తో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు కానీ అది పండలేదు.
హను రాఘవపూడి, జయకృష్ణ, రాజ్ కుమార్ కందమూడి రాసిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాటలతో ఈ కథ మొత్తం నడిచిందని అనుకోవచ్చు. బట్ ఎంత రుచికరమైన పిండివంట అయినా మరీ ఎక్కువగా వడ్డిస్తే ఆస్వాదించడం కష్టం. ఈ సినిమా పాటల విషయంలో అదే జరిగింది. వాటి చిత్రీకరణ అద్భుతంగా ఉంది. స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కృష్ణకాంత్ తదితరులు రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ ను ఓ పెయింటింగ్ లా ఆయన సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. అశ్వినీదత్ ఈ కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా తీశారు. ఏ సన్నివేశానికి అది బాగున్నా… ఓవర్ ఆల్ గా ఫీల్ మిస్ అయ్యింది!
ప్లస్ పాయింట్స్
వింటేజ్ లవ్ స్టోరీ కావడం
దుల్కర్ సల్మాన్ నటన
సాంకేతిక నిపుణుల పనితనం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
మూవీ రన్ టైమ్
ఆసక్తి కలిగించని సీతాన్వేషణ
ఊహకందే ముగింపు
ట్యాగ్ లైన్: క్లాసికల్ సీతారామం