Mahaveerudu Telugu Movie Review: గత కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన శివకార్తికేయన్ మావీరన్ అనే సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు గాను మహావీరుడు ప్రమోషన్స్‌ను గట్టిగానే చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ బైలింగ్వల్ మూవీకి మడోన్నే అశ్విన్ దర్శకత్వం వహించగా స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఇక దానికి తోడు మహావీరుడు సినిమాలో సునీల్, యోగిబాబు కీలక పాత్రలను పోషించడం సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మహావీరుడు సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేసింది, మరి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయిన మహావీరుడు సినిమా ఎలా ఉందనేది సినిమా రివ్యూలో చూద్దాం.
మహావీరుడు సినిమా కథ ఏమిటంటే?
నగరంలోని ఒక స్లమ్ ఏరియాలో తన తల్లి(సవిత) చెల్లితో కలిసి నివసించే సత్య (శివ కార్తికేయన్) ఒక కార్టూనిస్ట్. ఎందుకో కానీ అన్నిటికీ సర్దుకుపోయే మెంటాలిటీతో అందరిలో మహా భయస్తుడులా బతికేస్తూ ఉంటాడు. ‘మాహావీరుడు’ పేరుతో సుబ్బారావు అనే కార్టూనిస్ట్ కి ఘోస్ట్ కార్టూనిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక ఒకానొక సమయంలో అసలు బొమ్మలు వేసేది సత్య అని తెలుసుకున్న చంద్ర(అదితి) శంకర్ అతని ఉద్యోగం పీకి సత్యకి ఇస్తుంది. ఇక కంటెంట్ పాతది అవుతోంది కొత్త కంటెంట్ ఇమ్మంటే తన చుట్టూ ఉన్న సమస్యలను మహా వీరుడు రక్షించినట్టు కంటెంట్ ఇస్తాడు. ఇక అదే సమయంలో మురికివాడలో ప్రజలు అందర్నీ మంత్రి జయసూర్య (మిస్కిన్) ఖాళీ చేయించి, తాను కట్టించిన ప్రజా భవనం అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ఇవ్వడంతో అక్కడ జరిగిన ఒక అవమానానికి కుంగిపోయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు సత్య. అయితే ఆ సమయంలో మహావీరుడు సత్యనే అని ఓకే ఆకాశ వాణి అతనికి మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇక తానే మహావీరుడిగా మారి సత్య ఏం చేశాడు? రహస్య వాణి విని సత్య ఏమేం చేశాడు? ఇందులో మంత్రి పీఏ(సునీల్) పాత్ర ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ:
ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు ఎందుకంటే తన చుట్టూ ఉండే వారి కోసం పోరాడి హీరో అయ్యే సినిమాలు మనం చూశాం. అలాగే ముందు పిరికివాడిగా ఉంటూ చివరికి అందర్నీ కాపాడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయ్. కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏమిటంటే ప్రజలకు ఏమైనా చేయాలని ఉన్నా చేయలేక చనివాపోవడానికి రెడీ అయిన ఒక మనిషికి అనుకోకుండా ఒక ఆకాశ వాణి సహాయం చేయడం ఆ సాయంతో చేసే అన్ని పనులు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఆ ఆకాశ వాణి రావడానికి లాజిక్ లేదు కానీ ఆ ఆకాశ వానితో మాత్రం కామెడీ పండించారు. శివ కార్తికేయన్, యోగిబాబు కాంబినేషన్లో ఉన్న దాదాపు అన్ని సీన్లు ప్రేక్షకులను సీట్లలో పడీపడీ దొర్లేలా చేశాయి సినిమాలో మంచి కామెడీతో, ఆసక్తికరమైన పాయింట్ ఉన్నా ఎందుకో సినిమాలో తరువాత ఏమిటి అనే అంశం మీద ఇంట్రెస్ట్ పెంచడంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాకి ప్రధాన బలం శివ కార్తికేయన్, ఆయన ఈ సినిమా మొత్తాన్ని భుజాల మీద నడిపించే ప్రయత్నం చేశాడు. అదితి శంకర్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సవిత మాత్రం ఎక్కడా తగ్గకుండా నటించింది. సునీల్ పాత్రను ఎందుకు పెట్టారో తెలియదు. మిస్కిన్ మాత్రం అదరకొట్టాడు. ఇక యోగిబాబు మార్క్ కామెడీతో అదరకొట్టాడు. టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే మడోన్ అశ్విన్ కథలో విషయం ఉంది దాన్ని మరీ వివరంగా చెప్పాలని ప్రయత్నించడంతో నిడివి ఎక్కువై ఒకానొక సమయంలో బోర్ అనిపిస్తుంది. సంగీతం తమిళం సంగతి ఏమో కానీ తెలుగులో గుర్తు పెట్టుకోదగ్గ పాటలు లేవు కెమెరా వర్క్ బాగుంది కాయి వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్
కథ
కామెడీ
యోగిబాబు
మైనస్ పాయింట్స్
నిడివి
సంగీతం
బాటమ్ లైన్:
లాజిక్స్ వెతక్కుండా ఒకసారి యోగిబాబు కామెడీ కోసం చూసేయచ్చు.