సరైన హిట్ కోసం ఆది సాయి కుమార్ చేయని ప్రయత్నమే లేదు. అందులో భాగంగా ఈసారి ఒక డివోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన సినిమా ‘షణ్ముఖ’. తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణంలో షణ్ముగం సప్పని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, కృష్ణుడు, పండు మాస్టర్, మనోజ్ నందం, చిత్రం శ్రీను వంటి వారు పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. షణ్ముఖ సినిమా నేడు మార్చ్ 21న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
అడవిలో గిరిజనుడైన విరాండా(చిరాగ్ జానీ)కి ఆరు ముఖాలతో వికృత రూపంలో ఉన్న కొడుకు పుట్టడంతో షణ్ముఖ అని పేరు పెడతాడు. షణ్ముఖని చూసి అందరూ భయపడి ఎవరూ దగ్గరికి రారు. విరాండా తన కొడుకుకి ఒక ముఖం వచ్చేలా చేయాలని క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. తన కొడుకుని మాములుగా చేయాలంటే ఆరుగురు కన్నెపిల్లల రక్తతర్పణం చేయాలని చెప్పడంతో ఆ పనిలో ఉంటాడు. మరోపక్క కార్తీ వల్లభన్(ఆది సాయి కుమార్) ఓ పోలీసాఫీసర్. తన గన్ పోవడంతో ఇబ్బందుల్లో ఉన్న అతనికి మాజీ ప్రేయసి సారా(అవికా గోర్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పీజీలో ఓ అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించి ప్రాజెక్టు కోసం మళ్ళీ ఎదురు పడుతుంది. అమ్మాయిలు మిస్ అయిన కొన్ని రోజులకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుంటున్నారని సుమారు ఐదుగురు అమ్మాయిల విషయంలో ఇదే జరిగిందని తాను చేసిన రీసెర్చ్ చూపించడంతో మొదట నమ్మకపోయినా నమ్మకం కుదిరాక ఆ కేసు టేకప్ చేస్తాడు. అయితే మిస్ అయిన ఆ అమ్మాయిలు ఎవరు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? షణ్ముఖని మామూలు మనిషి చేయడానికి విరాండా చేసిన ప్రయత్నం ఫలించిందా? అసలు చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
జీవజాలంలో అన్ని జంతువుల లాగే పుట్టిన మనిషి ఆ తరువాత ప్రయోగాలు అని మొదలుపెట్టి ప్రకృతిని, ఇతర జీవ జాలన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు? దాని వలన మనిషి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయనేది చెబుతూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇదేదో గట్టి ప్రయత్నమే అనిపించేలా సినిమా మొదలు అవుతుంది. అయితే దానికి తోడు ఆరు ముఖాలతో షణ్ముఖ జననంతో సినిమాలో ఏదో కొత్త విషయం చెబుతారేమో అనే అభిప్రాయాన్నే కలిగించినా హీరో ఎంట్రీ మొదలు రొటీన్ క్రైమ్ సీన్స్ తో అదేదీ నిజం కాదని తేలిపోతుంది. నిజానికి ఇక్కడ రెండు భిన్నమైన అంశాలు. ఆ రెండిటికీ ఒక లింక్. ఆ లింక్ ఏమిటో ప్రేక్షకులకు సినిమా మొదలైన కొద్దిసేపటికే అర్ధమైపోయినా కథలో మాత్రం అడవిలో కథకీ, ఇటు ఊళ్లో జరిగే క్రైమ్ కధకు సంబంధమేమీ లేనట్టు గందరగోళం ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి దర్శకుడు షణ్ముగం సప్పాని తాను చెప్పాలనుకున్న కథ బాగున్నా.. దాన్ని తెరకెక్కించే విధానంలో తడబడ్డాడు. వింత ఆకారంలో పుడుతున్న సంఘటనలు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలాంటి అంశాన్ని బేస్ చేసుకొని దానికి నక్షత్రాలు, రాశుల ప్రకారం కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలను బలి ఇచ్చి వికృతంగా వింతగా పుట్టిన షణ్ముఖుడిని మామూలు మనిషి చేయాలని తండ్రి పడే తాపత్రయం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఇతరులకు హాని కలిగిస్తూ సుఖాపడాలనుకోవడం ఎప్పటికైనా మంచిది కాదు. అదే విషయాన్ని ఈ సినిమాలో కూడా డిస్కస్ చేశారు. సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తే దర్శకుడు మరి అంత సిల్లీగా ఎలా తెరకెక్కించాడని అనే అనుమానాలు కలిగినా హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో అలవాటైన విధంగా ఒదిగిపోయాడు. ఇక అవిక గోర్ గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయింది. చిరాగ్ జానీ, ఆదిత్య ఓం, పండు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకే పరిమితమయ్యారు. మరోపక్క టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఆర్ఆర్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. చివరిలో వచ్చే ఏఐ సాంగ్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఓకే.
ఫైనల్లీ ‘షణ్ముఖ’ డివోషనల్ ఎలిమెంట్స్ బ్లెండెడ్ విత్ క్రైమ్.. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఎంజాయ్ చేయచ్చు!