విక్రాంత్ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్‌గా సంజీవరెడ్డి దర్శకత్వంలో సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా రూపొందింది. టైటిల్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో అందరిలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఐవీఎఫ్ (IVF) ఫెర్టిలిటీ సెంటర్ల గురించి సినిమాలో ఉంటుందని ప్రమోషన్స్ చేయడంతో, అసలు ఏంటి సినిమా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. మరి, ఈ సినిమా ఎట్టకేలకు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: చైతన్య (విక్రాంత్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన స్నేహితుడు (అభినవ్ గోమటం)తో గ్రూప్ వన్ పరీక్ష రాయించేందుకు వెళ్లగా, అతనికి కళ్యాణి (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ అతను ఎట్టకేలకు ఆమెను కూడా ప్రేమలో పడేస్తాడు. అయితే, ఈ విషయం ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్)కు ఏ మాత్రం నచ్చదు. కానీ, జాక్ (తరుణ్ భాస్కర్) సాయంతో కళ్యాణిని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు చైతన్య.
కొన్నాళ్ళకు అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మామ మురళీధర్ గౌడ్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. ఎలా అయినా వీరిద్దరి మధ్య దూరం పెంచి తన కుమార్తెను మళ్ళీ వెనక్కి తీసుకువెళ్లాలని మురళీధర్ గౌడ్ భావిస్తాడు. ఈ క్రమంలో అందుకోసం ఆయన ఏం చేశాడు? చైతన్య, కళ్యాణి మధ్య దూరం పెరిగిందా? చైతన్య మీద కళ్యాణి ఎందుకు కోపం పెంచుకుంది? కళ్యాణిని దూరం చేసుకోవడం కోసం చైతన్య ఏం చేశాడు? దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ మొత్తానికి అసలు టైటిల్‌తో సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: గతంలో ‘ఏబీసీడీ’ లాంటి సినిమా డైరెక్ట్ చేసిన సంజీవరెడ్డి మీద ప్రేక్షకులలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, ప్రమోషనల్ స్టఫ్ బాగుండడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా మాత్రం ప్రారంభం నుంచి చివరి వరకు లైటర్ వేలోనే సాగింది. చాలా సీరియస్ సబ్జెక్ట్‌ను హద్దులు దాటకుండా, సింపుల్‌గా, ఎవరినీ నొప్పించని విధంగా నడిపించారు.
వాస్తవానికి, ఐవీఎఫ్ సెంటర్ల గురించి సినిమాలో ఉంటుందని అందరూ భావించారు. కానీ, అది కేవలం ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. అది కూడా ఒక పక్క ఐవీఎఫ్ సెంటర్ల దోపిడీని చూపిస్తూనే, మరోపక్క దానివల్లే సంతానం కలిగినట్లు చూపించడం కోసమేమో. వాస్తవానికి ఇప్పటి రోజుల్లో స్ట్రెస్ కారణంగా, ఇతర కారణాల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మొదలు చాలామందికి సంతానం కలగడం లేదు. ఆ సంతానం కోసం భార్యాభర్తలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నా, ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. ఈ క్రమంలోనే దాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ఒక లవ్ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్ల పరిచయం, వారి మధ్య ప్రేమ లాంటి సన్నివేశాలతో రాసుకున్నాడు. అవి ఒక పక్క నవ్విస్తూనే లైటర్ వేలో సాగిపోతాయి. సెకండ్ హాఫ్‌కి వచ్చాక అసలైన ఎమోషనల్ పార్ట్ అంతా రాసుకున్నాడు దర్శకుడు. ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క ఎమోషన్స్‌తో సినిమా నడిపించే ప్రయత్నం చేసి చాలావరకు సక్సెస్ అయ్యాడు. ప్రధానంగా లవ్ స్టోరీ మీదే ఫోకస్ చేసి కథ నడిపించాడు దర్శకుడు. దీంతో సినిమా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న దాపరికాలు ఎంత దూరానికి దారితీస్తున్నాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపే ప్రయత్నం చేశాడు.
నటీనటులు, సాంకేతిక వర్గం: నటీనటుల విషయానికి వస్తే, విక్రాంత్ చైతన్య అనే పాత్రలో ఒదిగిపోయాడు. ఒక సాఫ్ట్‌వేర్ కుర్రాడిగా ఆకట్టుకునేలా నటించాడు. చాందినీ చౌదరికి ఈ తరహా పాత్ర కొత్తేమీ కాదు, కానీ చాలా ఈజ్‌తో నటించేసింది. సాంగ్స్‌లో కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఆయన పాత్ర అద్యంతం నవ్విస్తూ సాగుతుంది. ఇక అభినవ గోమటం, జీవన్ వంటి వాళ్ళ చమక్కులు అక్కడక్కడ కనిపించాయి.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. కానీ, స్క్రీన్ మీద మాత్రం హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా కట్ చేసుకుని ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ మంచి ప్రజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పెద్దగా లొకేషన్స్ ఖర్చు లేకుండా సింపుల్‌గా మూవీ ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫైనల్లీ: ఈ సంతాన ప్రాప్తిరస్తు సరదాగా ఓసారి నవ్వుకోవడానికి చూడొచ్చు.