కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు చాలా ఏళ్ళ నుంచీ సరైన సక్సెస్ లేదు. చెప్పాలంటే 2017లో సల్మాన్ హీరోగా రూపొందిన ‘టైగర్ జిందా హై’ తరువాత ఆ స్థాయి విజయం ఆయన ఖాతాలో పడలేదు. ఆ తరువాత సల్మాన్ హీరోగా వచ్చిన ‘దబంగ్-3’ పరవాలేదనిపించింది. రెండేళ్ళ క్రితం వెలుగు చూసిన “రాధే, అంతిమ్” చిత్రాలు సైతం నిరాశ కలిగించాయి. ఆయన ప్రత్యేక పాత్రల్లో నటించిన చిత్రాలు కూడా సో సో గానే సాగాయి. ఈ యేడాది వచ్చిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లో అతిథిగా కనిపించి అలరించారు సల్మాన్. ఈ చిత్రం బాలీవుడ్ కే ఊపిరి పోసిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రావడం అభిమానులకు ఆనందం పంచింది. సల్మాన్ ఖాన్ కు సక్సెస్ లేని సమయంలో సౌత్ రీమేక్స్ ఊపిరి పోశాయి. ఈ సినిమా కూడా అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వీరం’ ఆధారంగా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో ‘కాటమరాయుడు’గా రూపొందింది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’కు కొన్ని మార్పులు చేశారు.ఇందులో తెలుగువారయిన వెంకటేశ్,జగపతిబాబు కీలక పాత్రలు పోషించడం విశేషం. అంతేకాదు, కొన్ని పాటల్లోనూ, సీన్స్ లోనూ తెలుగు పదాలు వినిపించడం మరింత విశేషం! “ఏంటమ్మా…” అంటూ సాగే పాటలో మన తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ అప్పియరెన్స్ కూడా విశేషమనే చెప్పాలి.
ఇక ఈ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కథ విషయానికి వస్తే – పెళ్ళికాని భాయిజాన్ తన తమ్ముళ్ళతో కలసి ఆనందంగా జీవిస్తుంటాడు. అన్నకు పెళ్ళికాకపోవడంతో తమ్ముళ్ళూ బ్రహ్మచారులుగానే ఉంటారు.అనుకోకుండా భాయిజాన్ జీవితంలోకి ఓ తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి వస్తుంది. ఆమెపై భాయిజాన్ మనసు పారేసుకుంటాడు. తరువాత ఆమె ప్రేమను అందుకుంటాడు. ఆపై వారి ఊరికీ వెళతాడు. అక్కడే భాగ్యలక్ష్మి అన్నయ్య గండమనేనికి ప్రత్యర్థి అయిన ఓ వ్యక్తి ఈ అమ్మాయిని చంపాలని చూస్తుంటాడు. భాగ్యలక్ష్మి అన్నయ్యతో భాయిజాన్ పరిచయం చేసుకోవడం ఆ తరువాత వారి బంధం బలపడడం జరుగుతుంది.కానీ, భాయిజాన్ ఎవరో ఏమిటో తెలుసుకున్నాక అన్నయ్య అతడిని దూరం పెడతాడు. అప్పుడే అన్నయ్య ప్రత్యర్థి వారి కుటుంబాన్ని అంతం చేయాలని వస్తాడు. అప్పుడు భాయిజాన్ రంగంలోకి దిగడం ప్రత్యర్థులను చిత్తుచేయడం, తరువాత కోరుకున్న అమ్మాయి కుటుంబం ప్రేమను మళ్ళీ సంపాదించడం జరిగిపోతాయి.
ఒరిజినల్ లో ఉన్న తండ్రీకూతుళ్ళ పాత్రలను ఇందులో అన్నాచెల్లెళ్ళుగా మార్చారు. మిగతా కథ అంతా ‘వీరమ్’నే ఫాలో అయ్యారు. తెలుగు ‘కాటమరాయుడు’, తమిళ ‘వీరమ్’ చూసిన వారికి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కొత్తదనం ఏమీ కనిపించదు. ప్రతి సీన్ ను భారీగా రూపొందించడంలోనే దర్శకుడు ఫఠాడ్ సమ్జీ సక్సెస్ అయ్యారు తప్ప అంతకు మించి ఆయన చేసిందేమీ లేదనిపిస్తుంది. ఇక ఎనిమిది పాటలు ఉన్నాయి. ఏడు మంది సంగీత దర్శకులు పనిచేయడం విశేషం! సుఖ్ బిర్ రెండు పాటలకు స్వరాలు సమకూర్చగా, మిగిలిన ఆరు పాటలను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సాంగ్ కంపోజ్ చేశారు. పాటల్లో రవి బస్రూర్ రూపొందించిన “బతుకమ్మ…” పాట, పాయల్ దేవ్ కంపోజ్ చేసిన “ఏంటమ్మా…” పాటలో “ఈ రోజు వేడుకగా ఉంటుంది ఉంటుంది…” అనే తెలుగు పదాలు చోటు చేసుకున్నాయి. మన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో “లెట్స్ డాన్స్ చోటు మోటు…” పాట రూపొందింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. అయితే కథనం అంతగా పట్టుతో సాగలేదు. సల్మాన్ ఖాన్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. సల్మాన్ అభిమానులకు కావలసిన అన్ని హంగులు ఇందులో దట్టించారు. గుండమనేని అన్నయ్య పాత్రలో వెంకటేశ్ తనదైన రీతిలో నటించారు. మొన్న ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’తో వచ్చిన బ్యాడ్ నేమ్ ఈ సినిమాతో కొంతయినా చెరిగిపోతుందని చెప్పవచ్చు. జగపతిబాబు విలన్ గా తనదైన పంథాలో పయనించారు. పూజా హెగ్డే గ్లామర్ డాల్ గానే కనిపించింది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
– సల్మాన్, వెంకటేశ్ కలసి నటించడం
– భారీగా రూపొందడం
– కొన్ని పాటలు, నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
– కొత్తదనం లేని కథ
– కథనంలో పట్టు లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉన్న కామెడీ
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: ‘భాయిజాన్’ హంగామా!