NTV Telugu Site icon

Salaar Review: ప్రభాస్ ‘సలార్‌’ మూవీ రివ్యూ!

Salaar Review

Salaar Review

Prabhas Salaar Movie Review: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. నిజానికి కేజీఎఫ్ సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే సినిమా మీద అనూహ్యంగా అంచానాలు ఏర్పడ్డాయి. అయితే సరైన అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ డేట్లు మారుస్తూ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో ఆ అంచానాలు తగ్గించే ప్రయత్నం చేసినా రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను రెట్టింపు చేసింది.. హోంబాలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సలార్ సినిమా శుక్రవారము నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. అమెరికా ప్రీమియర్స్ సహా హైదరాబాద్ లో కూడా ఒంటిగంట షోలు పడ్డాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
అమెరికాలోని పుట్టి పెరిగిన ఆద్య ( శ్రుతి హాసన్) తన తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది. ఇండియా వచ్చిన వెంటనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని భావించి అస్సాం బర్మా బోర్డర్ లో ఉన్న ఒక బొగ్గు గనిలో పనిచేసే దేవరథ అలియాస్ దేవ( ప్రభాస్) వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ దేవా బొగ్గు గనుల్లో పని చేస్తుంటే… అతని తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. హింస అంటే చాలా భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? వరద రాజమన్నార్(పృథ్వీ రాజ్ సుకుమారన్) ప్రాణాల మీదకు వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవా వెళ్లి అతని కాపాడాడా? ప్రాణ స్నేహితులు ఇద్దరూ బద్ద విరోధులుగా ఎందుకు మారతారు? అజ్ఞాతంలోకి వెళ్ళిన దేవా ఏమయ్యాడు? అతన్ని రప్పించడానికి రాధా రమ( శ్రేయా రెడ్డి) ఏం చేసింది? ఈ కథలో ఖాన్సార్ అధినేత రాజ మన్నార్ (జగపతి బాబు) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్ కి కేరాఫ్ అడ్రస్. కేజీఎఫ్ సినిమాలు చూసి, వాటిలో వచ్చే ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రశాంత్ నీల్ – ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రశాంత్ నీల్ తన 100 పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాడు. నిజానికి కేజిఎఫ్ సినిమా విషయానికి వస్తే అందులో ఒక కథ, దానికోసం బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సలార్ విషయంలో మాత్రం కొంచెం తడబడినట్లు అనిపించింది. సినిమా రెండు భాగాలుగా చేస్తున్నట్లు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టుగానే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పచ్చో చెప్పి మిగతాదంతా సస్పెన్స్ లో ఉంచేశాడు. నిజానికి కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి ఏదో లింకు ఉందని అందరూ భావిస్తూ వచ్చారు, కానీ సినిమాలో అలాంటి లింక్ ఏమీ లేదు. కానీ చాలా సిమిలర్ పాయింట్స్ కనిపించాయి. కే జి ఎఫ్ వన్, టు కుర్చీ కోసమే జరిగాయి. సలార్ సినిమా కూడా దాదాపు అలాగే జరుగుతుంది, కానీ కేజిఎఫ్ లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ పోరాడితే ఇక్కడ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ యుద్ధానికి దిగుతాడు. సలార్లో ప్రభాస్ ఎలివేషన్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు కానీ ఎందుకో ప్రశాంత్ ఈ సినిమా కథ మీద కానీ కథనం మీద కానీ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు అనిపించలేదు. సెకండ్ హాఫ్ కి వెళ్లే వరకు అంతా సస్పెన్స్ గా ఏం జరుగుతుందో అర్థం కాకుండా నడిపించిన ఆయన సెకండ్ హాఫ్ కి వెళ్ళాక అసలు కథ చెప్పడంతో ప్రేక్షకులలో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. కాకపోతే ప్రభాస్ అభిమానులకు ఆ ఎలివేషన్ షాట్స్ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సాధారణ ప్రేక్షకులకు సైతం కొన్ని కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ప్రశాంత్ మేకింగ్ ఉంది. కథ – కథనం విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే ఎక్కడా వంక పెట్టే అవసరం లేకుండా ఉండేది. అంతేకాదు సినిమా కథ సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి.

వన్ మ్యాన్ షో:

నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా అనిపించింది. మరి ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ కళ్ళతోనే నటించి భళా అనిపించాడు. ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరో ఆప్షన్ ఆలోచించలేము అనే అంతలా ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఇరగదీసాడని చెప్పొచ్చు. ఒక్కమాటలో ప్రభాస్ తన మాట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాడు. ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు పృథ్వీరాజ్, ఆయన కూడా ప్రభాస్ తో కొన్ని సీన్స్ లో పోటాపోటీగా నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈశ్వరి రావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించింది. శృతిహాసన్ కి తగ్గ రోల్ కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, ఝాన్సీ , శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, సప్తగిరి,  ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్ లాంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ అంతా ప్రశాంత్ నీల్ ఫార్మాట్లోనే అనిపించింది కాస్త కలర్ పేలేట్స్ ఎక్కువగా ఉపయోగించి ఉంటే బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అర్పించారు కానీ పాటల్లో మాత్రం పెద్దగా గుర్తుంచుకో తగినవి ఏమీ లేవు. ఎడిటింగ్ కూడా కాస్త క్రిస్పీగా కట్ చేయొచ్చు నిడివి విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్లీ: ‘సలార్’ లో ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ & యాక్షన్ అదుర్స్.