ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘శారీ’. ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించగా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించిన ‘శారీ’ సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఆరాధ్య దేవి సోషల్ మీడియాలో చేసిన అందాల విందుతో అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.
శారీ కథ:
ఆరాధ్య దేవి(ఆరాధ్య దేవి) ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చీర కట్టు అంటే విపరీతమైన మక్కువ ఉన్న ఆమె అనునిత్యం చీరలోనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలకు బ్యాడ్ కామెంట్స్ కామన్. అయితే అది ఆమె అన్న రాజ్ (సాహిల్)కు, అమ్మ(కల్పలత)కు ఏ మాత్రం నచ్చదు. తండ్రి(అప్పాజీ అంబరీష) మాత్రం ఆమె ప్యాషన్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక చోట కిట్టు(సత్య యాదు) అనే ఫోటో గ్రాఫర్ ఆరాధ్యను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె మీద పిచ్చి ప్రేమను పెంచుకుని ఆమెకు టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించి సఫలమవుతాడు. వీరిద్దరూ కలుసుకున్న క్రమంలో రాజ్ కిట్టుకు వార్నింగ్ ఇస్తాడు. ఆరాధ్య కూడా కిట్టు బిహేవియర్ చూసి దూరం పెడుతుంది. అయితే ఆరాధ్య ప్రేమ కోసం సైకోలా మారిన కిట్టు ఏం చేశాడు? ఆరాధ్య ప్రేమను కిట్టు దక్కించుకున్నాడా? ఆరాధ్య కిట్టు విషయంలో ఏం చేసింది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ: గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది చదువు, ఉద్యోగాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు. అలాంటివారిని ఆధారంగా చేసుకుని రాసుకున్న కథగా ఈ సినిమా కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా ఒక వృత్తిగా భావిస్తూ ముందుకు వెళుతున్న ఈ రోజుల్లో అలాంటి పనుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఇప్పటికీ మనం అనునిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికి ఒక దృశ్య రూపంగా ఈ సినిమా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఒక అమ్మాయికి ఒక ఫోటోగ్రాఫర్ టచ్ లోకి వస్తాడు. కేవలం ఫోటోషూట్ కోసం ఆమె ఆసక్తి చూపించి కలిస్తే అతను మాత్రం తనను ప్రేమిస్తుంది అనుకుని బ్రమ పడతాడు. ఈ క్రమంలో సదరు అమ్మాయి అన్న అడ్డుపడితే అతని చంపేందుకు కూడా వెనుకాడని పరిస్థితికి వెళతాడు. ఈ విషయం తెలిసి అతని దూరం పెట్టిన సదరు అమ్మాయికి ఆ సైకో చుక్కలు చూపించడం ప్రారంభిస్తాడు. నిజానికి ఇది ఒక ప్రేమోన్మాది బయోపిక్ లా అనిపిస్తుంది. చీర కట్టుకు ఫ్లాట్ అయినా సదరు ప్రేమోన్మాది ఆమె మీద పెంచుకున్నది మోహమో, కామమో ప్రేమమో తెలియకుండా ఆమెను దక్కించుకునే ప్రయత్నం చేసి అతని అన్నను చంపి ఆమె చేతిలో తాను హతమవుతాడు. అయితే ఇదంతా ఒక లైన్ గా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు. సినిమాలో ఎన్నో అనవసరమైన సీన్స్ కనిపిస్తాయి. సదరు ఆరాధ్య దేవిని ఒక ఆట బొమ్మగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆమె చేత అందాల ఆరబోత చేయించి టికెట్లు తెంపుదాము అనుకున్నారో ఏమో తెలియదు కానీ అవసరమైన చోట, అవసరం లేని చోట కూడా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఫైనల్ గా ఇది వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా లాగా ఏమాత్రం అనిపించలేదు. ఒకప్పుడు వర్మ కాంపౌండ్ నుంచి ట్రెండ్ సెట్టర్ సినిమాలు వస్తే ఇప్పుడు తలనొప్పి సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో వర్మ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనిపించొచ్చు. అయితే ఈ సినిమాకి ఆరాధ్య దేవి అందాన్ని ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఆమె కేవలం ఇన్స్టా రీల్స్ ద్వారా హైలైట్ అయి వచ్చిన అమ్మాయి అనే విషయం మర్చిపోయారు. ఆమె నుంచి నటన రాబట్టుకునే విషయంలో టీం పూర్తిగా విఫలమైంది. సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేంటంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోత ప్రాణాలకు హానికరం అని. నిజంగా సినిమా ధియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన రీల్స్ వర్మ కంట పడకుండా ఉంటే ఆ అమ్మాయిని హీరోయిన్గా మన ముందుకు తీసుకువచ్చి ఉండేవాడు కాదు కదా. అలా ఆమె చేసిన రీల్స్ మన ప్రాణాలకు హానికరం అనేలా ఫెయిల్ అయిన అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో లీడ్ పాత్రలో నటించిన ఆరాధ్య దేవి కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైంది. ఆమె అందాలు స్క్రీన్ మీద అత్యద్భుతంగా కనిపించాయి కానీ నటన విషయంలో ఆమె ఏమాత్రం ఆకట్టుకోలేదు. నటిగా ఆమెకు ఇది మొదటి సినిమా అనే విషయం చాలా ఫ్రేమ్స్ లో ఈజీగా అర్థమయిపోతుంది.. దానికి తోడు ఆమెకు డబ్బింగ్ సింక్ కూడా సెట్ అవ్వలేదు. ఇక సత్య యాదు కిట్టు అని ఒక ప్రేమోన్మాది పాత్రలో సరిగ్గా సెట్ అయ్యాడు. అరాచకం సృష్టించేలా చాలా సీన్స్ లో కనిపించాడు. ఇక సాహిల్, అప్పాజీ అంబరీష, కల్ప లత పాత్రలు పరిమితమైనా ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే చాలా కాలం తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేసిన శశి ప్రీతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆయన అందించిన పాటలు గాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. ఒక థ్రిల్లర్ సినిమాకి హారర్ తరహా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో ప్రేక్షకులకు ఆ ఫీల్ ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోతోంది. సినిమాటోగ్రఫీ మాత్రం పర్వాలేదు. శబరి అందించిన కొన్ని ఫ్రేమ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గిరి కృష్ణ కమల్ రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో మాత్రం తడబడ్డాడు.. అతను చెప్పాలనుకున్న పాయింట్ కథనంతో ఆకట్టుకునేలా ప్రేక్షకులు ముందుకు తీసుకు రాలేకపోయాడు. వర్మ నిర్మాణ విలువలు అయితే సినిమాకి తగ్గట్టున్నాయి.
ఫైనల్లీ: ఈ శారీ.. సారీ