NTV Telugu Site icon

Maruthi Nagar Subramanyam Review: మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ

Maruthi Nagar Review

Maruthi Nagar Review

Rao Ramesh Starrer Maruthi Nagar Subramanyam Review: రావు రమేష్ ప్రధాన పాత్రలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. నిహారిక, సుమంత్ అశ్విన్లతో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేసిన దర్శకుడు లక్ష్మణ్ రెండో సినిమాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనౌన్స్ చేశారు. ముందు నుంచి భిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ రావడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. దానికి తోడు సుకుమార్ భార్య ఈ సినిమాని సమర్పిస్తూ ఉండడం సినిమా మీద మరింత ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది.. దానికి తోడు సినిమా ఈవెంట్ కి సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఇంతమంది సపోర్ట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

మారుతినగర్ సుబ్రహ్మణ్యం కథ:
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి పట్టణంలోని మారుతీ నగర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే సుబ్రహ్మణ్యం(రావు రమేష్) చిన్నప్పుడు ఒక సోది చెప్పే ఆమె చెప్పిన మాటలు విని చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని బలంగా ఫిక్స్ అవుతాడు. రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత టీచర్గా పోస్టింగ్ కూడా వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆ పోస్టింగ్ హోల్డ్ లో పడుతుంది. అప్పటినుంచి చేస్తే ఆ ఉద్యోగమే చేయాలని భావించి ఇంట్లో ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి(ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులోనే క్లర్క్ గా పని చేస్తూ ఉంటుంది.ఆమె జీతం మీదనే ఇల్లు మొత్తం గడుస్తూ ఉంటుంది. వీరి కుమారుడు అర్జున్(అంకిత్ కొయ్య) తాను అల్లు కుటుంబానికి చెందిన వాడినని చిన్నప్పుడు పెంచడానికి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారని భావిస్తూ నాన్న అని కూడా పిలవకుండా సుబ్రహ్మణ్యం అనే పిలుస్తూ ఉంటాడు. అలాంటి అర్జున్ కాంచన(రమ్య పసుపులేటి)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తండ్రితో కలిసి వెళ్లి ఆమె ఇంట్లో మాట్లాడగా ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇస్తారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కళారాణి తీర్థయాత్రలకు బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత సుబ్రహ్మణ్యం జీవితంలో అనేక షాకింగ్ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఆ షాకింగ్ సంఘటనలు ఏమిటి? సుబ్రహ్మణ్యం జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందా? అర్జున్-కాంచన ఒక్కటయ్యారా? వీరికి కాంచన పేరెంట్స్ ఇచ్చిన షాక్ ఏంటి? లాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా పూర్తిగా కామెడీ మీద ఆధారంగా చేసుకుని తెరకెక్కించినట్లు ప్రమోషన్స్ లోనే సినిమా టీం చెబుతూ వచ్చింది. వాళ్ళు చెప్పినట్టుగానే సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కామెడీ ప్రధానంగానే సాగుతూ వచ్చింది. ఓపెనింగ్ లోనే సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ ను ఎలాంటి అనుమానాలు లేకుండా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసేశాడు డైరెక్టర్. ఆ తర్వాత అతని భార్య, కుమారుడు అంటూ సుబ్రహ్మణ్యం లోకంలోకి తీసుకొచ్చాడు. డైరెక్టర్ నెమ్మదిగా కథలోకి తీసుకు వెళుతూనే ఇరికించినట్టు కాకుండా సిచువేషనల్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో రాసుకున్న కొన్ని సీన్లు లాజికల్గా కనెక్ట్ అయ్యేలా లేవు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎవరైనా ఇంటికి వెళ్లి చెబితే వాళ్ల రియాక్షన్ మామూలుగా అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. అవసరమైతే కొట్టడానికి కూడా వస్తారు కానీ సినిమాలోకి మాత్రం కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని సీన్లు పక్కన పెడితే మనం రోజు వార్తలలో చూసే విషయాలన్ని సినిమాగా మలిచిన తీరు మాత్రం ఆసక్తికరం.. ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడినట్టు మనం వార్తలలో చూస్తూనే ఉంటాం. దానినే ప్రధాన అంశంగా చేసుకొని ఈ కథ మొత్తం అల్లుకున్నారు. ఎలాంటి పని చేయకుండా కేవలం భార్య సంపాదన మీద ఆధారపడి బతికే సుబ్రహ్మణ్యానికి ఒక్కసారిగా లక్షలు వచ్చి పడితే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది? అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ఇలాంటి విషయాలను చాలా లాజికల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తరం జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చెప్పే ప్రయత్నం గా కొన్ని సీన్స్ పెట్టినా సరే అవి వాస్తవికతకు కాస్త దూరం అనిపిస్తుంది. అయినా సరే సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసిన దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కథ ఊహించగలిగేలా ఉన్నా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆసక్తికరంగా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా విషయంలో కమర్షియల్ లెక్కలు వేసుకుని తెరకెక్కించినట్లే అనిపించింది. ఒక ఫైట్ విషయం పక్కన పెడితే కామెడీ కాస్త రొమాన్స్ అనుకుంటూ కొంత ఎమోషన్స్ కూడా కలుపుతూ సినిమాని తీసుకువెళ్లను విధానం ఆసక్తికరమే. అయితే కొన్ని సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అనిపించింది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో రావు రమేష్ ని తప్పించి ఇంకా ఎవరిని ఊహించుకోలేము. ఆ రేంజ్ లో రావు రమేష్ సుబ్రహ్మణ్యం అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నిజంగానే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడో అతని మనస్తత్వం ఎలా ఉంటుందో బాగా అవపోసన పట్టిన వాడిలాగా ఆయన జీవించేశాడు. ఆయన భార్య పాత్రలో ఇంద్రజ కనిపించింది తక్కువ సమయమే అయినా ఉన్నంతలో ఆమె తన సీనియారిటీతో ఆకట్టుకుంది. ఇక అర్జున్ అనే పాత్రలో అంకిత్ కి మరొక మంచి పాత్ర పడింది. చిన్నప్పటినుంచి తాను ఇంకెవరి బిడ్డనో అనుకుంటూ పెరిగే మనస్తత్వం ఉన్న కుర్రాడిగా సరిగ్గా సూట్ అయ్యాడు. ఇక సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే ఇంకా మైనారిటీ కూడా తీరని నిబ్బి పాత్రలో రమ్య కరెక్ట్ గా సెట్ అయింది. ఈ రోజుల్లో టీనేజ్ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఆమె కూడా చాలా కరెక్ట్ గా క్యాచ్ చేసి జీవించేసింది. ఇక హర్షవర్ధన్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది కానీ నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. బిందు చంద్రమౌళి ఉన్నంతలో పర్వాలేదు అనిపించుకుంది. మిగతా పాత్రలలో నటించిన ప్రవీణ్, అజయ్, అప్పాజీ, వాసు ఇంటూరి వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కథ ఎంత పగడ్బందీగా రెడీ చేసుకున్నారో డైలాగ్స్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నట్లు అనిపించింది. కథకుడిగా ఆకట్టుకున్న లక్ష్మణ్ డైరెక్టర్ కూడా చాలా వరకు అలరించే ప్రయత్నం చేశాడు. ఇక ఒకటి రెండు టీనేజ్ జోక్స్ మినహాయించి మిగతా అన్ని డైలాగ్స్ సెట్ అయ్యేలా రాసుకున్నారు. సిచువేషనల్ కామెడీ పుట్టించడంతో పెద్దగా ఇబ్బంది పడకుండానే నవ్వించేశారు. అయితే సినిమా మొత్తాన్ని కలర్ ఫుల్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయినట్టు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. పాటలు వినడానికి కాదు చూడడానికి కూడా బాగున్నాయి. ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి సినిమాను క్రిస్పీగా కట్ చేశారు. ఆయన అనుభవం కూడా సినిమాకి ప్లస్ అయింది. అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో, షూట్ లొకేషన్స్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ : మారుతీనగర్ సుబ్రహ్మణ్యం కామెడీ ఎంటర్టైనర్.. అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే ఎంజాయ్ చేయచ్చు బట్ కండిషన్స్ అప్లై