NTV Telugu Site icon

Ramayana: The Legend Of Prince Rama Review: రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రివ్యూ

Ramanaya

Ramanaya

హిందువులకు పవిత్ర గ్రంథాలలో అతి ముఖ్యమైనది రామాయణం. శ్రీరాముడి జన్మ వృత్తాంతం మొదలుకొని ఆ అవతార పరిసమాప్తి వరకు ఒక మహా గ్రంథంగా మలిచారు వాల్మీకి. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలువురు రామాయణాలను రచించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు కూడా చేశారు. అయితే జపాన్ వాసుల కోసం సిద్ధం చేసిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే సినిమాని 1993లోనే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో 2025 లో రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా జపాన్ యానిమే ఫార్మాట్లో సిద్ధం చేసిన ఒక కార్టూన్ సినిమా. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

కథ:
తెలుగు ప్రేక్షకులకు రామాయణ మహా గాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రావణుడు అనే ఒక రాక్షస రాజుని అంత మొందించేందుకు శ్రీరాముడి అవతారం ఎత్తిన శ్రీ విష్ణు జననం ఆ తర్వాత వశిష్ట మహాముని వద్ద విద్యాభ్యాసం, మిథిలా నగరంలో సీతా పరిణయం వంటి విషయాలను ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక పంచవటిలో సీతారామ లక్ష్మణుల వనవాసం సూర్పనక కారణంగా రావణాసురుడు చేత సీతాపహరణం, రామ, రావణ యుద్ధం, లంకలో అశోకవనంలో సీతకు విముక్తి లాంటి అంశాలతో ఈ సినిమాను కార్టూన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

విశ్లేషణ:
భారతీయులకు ముఖ్యంగా హిందువులకు రామాయణం ఒక డిక్షనరీ. ఆదర్శవంతమైన జీవితం గడపడం ఎలా అన్యోన్యంగా ఉండాలి అంటూ ఎన్నో విషయాలలో రాముడిని, సీతని, రామలక్ష్మణ సోదర భావాలను ఇలా ఆదర్శంగా చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాను జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం అక్కడి రచయిత ఒకరు అక్కడ వారికి ఆసక్తికరంగా ఉండేలా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా కోసం సుమారు 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను సిద్ధం చేశారు అంటే ఎంత కష్టపడి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రచించిన రామచరిత మానస్, కంబన్ రామావతారం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందించారని అర్ధం అవుతుంది. కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమా, అత్యద్భుతంగా తీర్చిదిద్దారనే ఫీలింగ్ కలుగుతుంది. రామాయణాన్ని మరోసారి యానిమేషన్‌లో కొత్తగా తీసుకొచ్చారు. నిజానికి ఈ సినిమాను 31 ఏళ్ల తర్వాత చూసే అదృష్టం మన ఇండియన్స్ కి దక్కింది. సినిమా అంతా యానిమేషన్‌లో ఉన్నప్పటికీ కథలోని ఎమోషన్‌ ఎక్కడా మిస్‌ అవ్వకుండా తెరమీదకు తీసుకు రావడం అభినందనీయం. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ ఈజీగా పిల్లలకు సైతం అర్ధమయ్యేలా ఉన్నాయి. ఇక పాటలు వరకు హిందీ వెర్షన్‌వి ఉంచేశారు కానీ తెలుగుకు సపరేట్ గా సిద్ధం చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అయితే క్వాలిటీపరంగా మంచి అవుట్‌పుట్ తీసుకు రావడంలో వారి కృషి అభినందనీయం. ఇక టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా, రిచ్‌గా 4K టెక్నాలజీలో అందించడం అభినందనీయం. క్వాలిటీ పరంగా భారీగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫీల్‌ను అందించారనే చెప్పాలి.

ఫైనల్లీ రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ ఇప్పటి పిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా.