NTV Telugu Site icon

Ramanna Youth Review: రామన్న యూత్ రివ్యూ

Ramanna Youth Review

Ramanna Youth Review

Ramanna Youth Review in Telugu: ఈ మధ్య తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు ఆడియన్స్ కి నచ్చేస్తున్నాయి. ‘బలగం’ తర్వాత ఈ తరహా సినిమాలకు క్రేజ్ పెరగగా ఇప్పుడు అదే నేపథ్యంలో తెరకెక్కిన ‘రామన్న యూత్’ సినిమా విలేజ్ పొలిటికల్ డ్రామాగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నటుడు అభయ్ నవీన్(బేతిగంటి) దర్శకుడిగా పరిచయం కావడం, ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేయడంతో సినిమా చూసేందుకు యూత్ ఇంట్రెస్ట్ చూపించారు. మరి అలాంటి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన అంక్షాపూర్ అనే గ్రామానికి చెందిన రాజు (అభయ్ నవీన్) స్థానిక ఎమ్మెల్యే రామన్న(శ్రీకాంత్ అయ్యంగార్)కి వీరాభిమాని. రాజకీయనాయకులకు ఉన్న గౌరవం చూసి ఎలా అయినా వారిలా అవ్వాలని భావించి లోకల్ యూత్ లీడర్ అనిల్(తాగుబోతు రమేష్) వెంట తిరుగుతూ ఉంటాడు. ఇక రాజు తన ముగ్గురు దోస్తులు చందు(జగన్‌ యోగిబాబు), రమేశ్‌(బన్నీ అభిరామ్‌), బాలు(అనిల్‌ గీలా)తో కలిసి రామన్న యూత్ అసోసియేషన్ పెట్టి ఒక బ్యానర్ కడతాడు. ఆ బ్యానర్ వలన రాజు, బాలు తమ్ముడు మహిపాల్(విష్ణు)ల మధ్య గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా ఎమ్మెల్యేని ఒక్కరోజులో కలవాలని బెట్ వేసుకుంటారు. ఈ క్రమంలో ఊరి నుంచి సిద్దిపేటలో ఎమ్మెల్యేని కలవడానికి వెళ్లిన రాజు ఎమ్మెల్యేని కలిశాడా లేదా? రాజు, మహిపాల్ మధ్య అసలు గొడవ ఎందుకు జరిగింది? రాజు పాలిటిక్స్ లో అడుగుపెట్టాడా లేదా? అనే విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి నేటి యూత్ ను ఆధారంగా చేసుకునే అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాను కూడా అలాగే రాసుకున్నాడు దర్శకుడు కం హీరో అభయ్. ఈ రామన్న యూత్.. సమాజంలో రెగ్యులర్ గా కనిపించే అంశాలను ప్రస్తావిస్తూ ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క ఆలోచింప చేసే ప్రయత్నం చేశాడు. ఈరోజుల్లో యువతలో ఎక్కువ మంది అయితే హీరోల మీద అభిమానం అనుకుంటూ లేదంటే పొలిటికల్ లీడర్ల మీద అభిమానం అనుకుంటూ వారి వెనుక తిరుగుతూ సమయం గడిపేస్తున్నారు. సినిమాలో ప్రధానంగా దానినే పాయింట్ గా ఎంచుకుని పొలిటికల్ లీడర్స్ వెనుక జెండాలు మోసుకుంటూ తిరిగే విషయాలను చూపించడానికి ట్రై చేశారు. అలాగే రాజకీయ నాయకులు అవసరాల నిమిత్తం యువకులను ఎలా వాడుకుంటున్నారు? వాళ్లకు ఈ కుర్రకారు ఎందుకు కావాలి? తమతో పెట్టుకుంటే వాళ్ళని ఏం చేయడానికి అయినా వెనుకాడరు అనే విషయాలను చర్చించారు. ఈ సినిమా కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే అమాయకపు గ్రామస్తుల మధ్యనే సాగుతుంది.

ఎవరెలా చేశారంటే?
ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికి.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో కొంత తడబడ్డాడు. స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైమ్ తీసుకున్నా ఒకసారి పాత్రల పరిచయం అయ్యాక మాత్రం సినిమా ఊపందుకుంది. అయితే కొత్త డైరెక్టర్ అయినా ఒక్కో సీన్లో ఎక్కడా అలా అనిపించకుండా తీశాడు. అలాగే సినిమా కథ వాస్తవికతకు దగ్గరగా ఉన్నా ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్ సీరియస్ గా సాగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే అభయ్ నవీన్ హీరోగా అతని స్నేహితులుగా అనిల్ జీల, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, విష్ణు ఎవరికీ వారు ఆకట్టుకునేలా నటించారు. ఇక తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, కూడా తమ పరిధిమేర మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడిగా అభయ్ కి మొదటి సినిమానే అయినా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక కథాపరంగా బాగున్నా ట్రీట్మెంట్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ బాగుండేది. ఇక కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి మరింత అందం తీసుకొచ్చింది. ఫాహద్ అబ్దుల్ మజీద్ కెమెరా పనితనం కొన్ని ఫ్రేమ్స్ లో బాగా కనిపించింది. ఇక ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ రామన్న యూత్.. అభిమానం పేరుతో టైం వేస్ట్ చేస్తున్న ప్రతి కుర్రాడు చూసి తీరాల్సిన సినిమా.