Veekshanam Movie Review and Rating: ఈ మధ్య కాలంలో టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన సినిమాలలో ‘వీక్షణం’ కూడా ఒకటి. రామ్ కార్తిక్ హీరోగా, బాలనటి కశ్వీ హీరోయిన్ గా మారి చేస్తున్న ఈ సినిమా మీద ఒక్కసారిగా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. దానికి తోడు టీం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. సాయి సమర్ధ్ గొల్లపూడి సంగీతం అందించిన ఈ సినిమా ఒక కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కింది. సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే సినిమాకి చిత్ర యూనిట్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది. ఆ ప్రీమియర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అర్విన్ (రామ్ కార్తీక్) ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు. దీంతో పక్క ఇళ్లల్లో ఏం జరుగుతుందో అనేది బైనాకులర్స్ తో చూడడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటాడు. తన స్నేహితుడు చిచీతో కలిసి ఎప్పటికప్పుడు పక్క ఇళ్లలో ఏం జరుగుతోంది అనే విషయం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో తన పక్కింట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన నేహా(కశ్వి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేసేందుకు అనేక ప్రయత్నాలు చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే తనను మోసం చేసి ప్రేమలో పడేశాడని తెలుసుకొని ఆమె దూరం పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో అదే గేటెడ్ కమ్యూనిటీలో మరో ఇంట్లోకి ప్రతిరోజు ఒక అమ్మాయి(బిందు నూతక్కి) వేరువేరు వ్యక్తులను తీసుకురావడం గమనిస్తాడు. ఆ వ్యక్తులందరూ మిస్సింగ్ అని తెలిసి ఆమెను పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే అసలు ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలిసి మరింత షాక్ అవుతాడు. అయితే చనిపోయిన అమ్మాయి హత్యలు ఎలా చేస్తోంది? అసలు ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? చనిపోయిన వారందరినీ ఏం చేస్తున్నారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఇండియాలో మన పని కన్నా పక్క వారి పని మీద ఆసక్తి చూపించే మనస్తత్వం ఎక్కువ. ఒకరకంగా మన దగ్గర బిగ్ బాస్ లాంటి షోస్ కూడా సూపర్ హిట్ కావడానికి అదే కారణం అని కూడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అలాగే పక్క వారి పనుల మీద కాన్సెంట్రేట్ చేసి తన జీవితాన్ని ఎలా ఒక యువకుడు ఇబ్బందులు పాలు చేసుకున్నాడు అనే లైన్ మీద ఈ సినిమా రాసుకున్నాడు డైరెక్టర్. హ్యాపీ లైఫ్, కష్టపడాల్సిన పనిలేదు తిని కూర్చోకుండా పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించే హీరో అనుకోకుండా కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ షాకింగ్ విషయాలు తెలుసుకున్న తర్వాత తన ద్వారా వాటిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తాడు. అయితే కళ్ళముందే హత్యలు జరగటం ఆ హత్యలు చేసే అమ్మాయిని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయింది అని తెలుసుకోవడం హీరోకే కాదు ప్రేక్షకులకు కూడా ఒక షాకింగ్ ఎలిమెంట్. సాధారణంగా అది చూసిన వెంటనే దెయ్యమే చేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ అది చేసేది ఎవరు అనేది క్లైమాక్స్ లో రివిల్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలు అనే కాదు దాదాపుగా అన్ని జానర్ల సినిమాల్లో తర్వాత ఏం జరగబోతుంది అనేది సగటు ప్రేక్షకులు ఈజీగా ఊహించగలిగేలా ఉంటున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా ఊహకు అందకుండా రాసుకున్నాడు డైరెక్టర్.
నటీనటుల విషయానికి వస్తే:
రామ్ కార్తిక్ ఒక సగటు కుర్రాడు పాత్రలో ఇమిడిపోయాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే మనస్తత్వం ఉన్న కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. నటన విషయంలోనే కాదు ఫైట్స్ విషయంలో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కశ్వి హీరోయిన్గా చేసిన మొదటి సినిమాలోని అందాలు వలకబోసింది. అభినయం విషయంలో కూడా అదరగొట్టింది. ఇక ఒక కీలకపాత్రలో నటించిన బిందు నూతక్కి కనిపించింది కొద్దిసేపు అయినా తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది. ఇక ఒక సర్ప్రైజింగ్ పాత్రలో మెరిసిన నటుడు కూడా కనిపించినంత సేపు నటనతో కట్టిపడేసాడు. సమ్మెట గాంధీ, చిత్రం శీను, నాగమహేష్ వంటి వాళ్లు కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. ఇక సంగీత దర్శకుడు విషయానికి వస్తే అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిన సమర్థ్ గొల్లపూడి తన రెండో సినిమాతో మరోసారి అదరగొట్టాడు. ఇలాంటి సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోరే కీలకం అలాంటి కీలకమైన విషయాన్ని చాలా సునాయాసంగా ప్రేక్షకులు ఆకట్టుకునేలా ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు సమర్థ్ గొల్లపూడి. సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కాస్త భిన్నంగా ఉంది. ఫైట్ డిజైనింగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసుకుని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినట్టు అనిపించింది. ఇప్పటికీ పట్టిపీడిస్తున్న ఒక సమస్యను ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా రాసుకున్నారు. సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ:
వీక్షణం మూవీ ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్.. ఏ సర్టిఫికెట్ కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది.