Radha Madhavam Movie Review: విలేజ్ లవ్ స్టోరీలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీగా రాధా మాధవం అనే సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. ఇక ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 1న విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
రాధ (అపర్ణ దేవి) చాలా మంచి అమ్మాయి. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మే ఆమె మాధవ (వినాయక్ దేశాయ్) పేరు మీద మాధవ కేర్ సెంటర్‌ను ఒకటి స్థాపిస్తుంది. అది స్థాపించి, పనీ పాట లేకుండా తాగుడుకు బానిసైన వాళ్ళని, అనాథ పిల్లలను, వృద్దులను చేరదీసి మళ్ళీ కొత్త జీవితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చాక కష్టపడి పని చేసుకోవాలనే ఆలోచన వస్తే స్వయం ఉపాధి కూడా కల్పిస్తుంటారు. ఈ క్రమంలో జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) కూడా ఆ సంస్థను ఆశ్రయిస్తాడు. వచ్చాక తన కూతురే ఈ సంస్థ నడుపుతోంది అని తెలుసుకుంటాడు. అయితే అసలు వీరభద్రం ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఈ తండ్రీ కూతుళ్ళ మధ్య ఏం జరిగింది? రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్‌ను ఎందుకు ప్రారంభించింది? అసలు రాధా మాధవం కథ ఏంటి? అనేది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్య కాలం అనేకాదు ఎప్పటి నుంచో పరువు హత్యలు, ప్రేమకు కులాల అడ్డంకులు అనే పాయింట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, అయితే వాటిలో కొన్ని మెప్పిస్తే కొన్ని నొప్పించాయి. ఇక ఈ సినిమా కేసుల పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఇప్పుడు జరిగిన కథగా కాకుండా పీరియాడిక్ టచ్ ఇవ్వడంతో కొంచెం రియలిస్టిక్ అనిపనిచేలా ఉంది. ఈ పాయింట్‌తో ఎన్నో చిత్రాలు చూసినట్టుగా అనిపించినా.. రాధా మాధవం విషయంలో బోర్ కొట్టకుండా చేయడానికి ప్రయత్నించి దర్శకుడు ఇస్సాకు చాలా వరకు ప్రయత్నించి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైనప్పుడే మాధవ కేర్ సెంటర్, అక్కడి ఫన్నీ సీన్లతో సరదా సరదాగా సాగుతుండగా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. పల్లెటూరు, అక్కడి వాతావరణం, కుల వివక్ష ఇలా దాదాపుగా అన్ని విషయాలను టచ్ చేస్తూ సాగుతుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఎక్కువగా ఎమోషనల్‌గా సాగుతుంది సినిమా. ప్రేమ జంట ఒక వైపు ఉంటే పరువు, పగతో రగిలిపోయే ఊరి పెద్దలు మరో వైపు ఉండగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను మరింత ఎమోషనల్ అయ్యేలా తెరకెక్కించారు. కులాల మీద రాసిన డైలాగ్స్, ప్రస్తావించే సీన్స్ బాగుండడమే కాదు ఆలోచింపజేస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే వినాయక్ దేశాయ్ మాధవ అనే పాత్రలో
సూట్ అయ్యాడు. చదువుకున్న గ్రామీణ యువకుడిగా కనిపిస్తూ తన ప్రేమను, లక్ష్యాన్ని సాధించుకునే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా అపర్ణా దేవీ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందనే చెప్పాలి. రాధగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది. మేక రామకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. ఊరి పెద్దయిన సర్పంచ్ వీర భద్రంగా మేక రామకృష్ణకి మంచి పాత్ర పడింది. మిగిలిన పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు తెరపైఅందంగా ఉన్నాయి. ఇక కెమెరా పనితనం వలన విజువల్స్ చాల సహజంగా అనిపిస్తాయి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా ఆలోచింప చేసే రాధా మాధవం