సాత్విక్ వర్మ హీరోగా, ప్రీతి నేహా హీరోయిన్గా, “ప్రేమిస్తున్నా” అనే సినిమా రూపొందింది. ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల ప్రభావం, ఈ సినిమా మీద ఎక్కువగా కనిపించింది. అలా ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. భాను డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపద్యంలో, నవంబర్ 7వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ప్రేమిస్తున్నా కథ:
శారద రైల్వేలో ఓ చిన్న ఉద్యోగిణి. భర్త చనిపోవడంతో, కొడుకు (సాత్విక్ వర్మ)కు అన్నీ తానై పెంచుతుంది. ఎప్పటికైనా తన కొడుకు మంచి ఉద్యోగం చేసి, గట్టిగా డబ్బులు సంపాదిస్తాడని ఆమె ఆశ. ఆమె బదీలీ కావడంతో, సొంతూరు నుంచి ఘట్కేసర్‌లోని రైల్వే కాలనీకి షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) సహాయం చేసేందుకు వస్తుంది. ఆమెను చూసి తొలిచూపులో ప్రేమలో పడిపోతాడు సాత్విక్. తొలి పరిచయంలోనే ‘నీతో రొమాన్స్ చేయాలని ఉంది’ అని ఆమెకు చెప్పగా, ఆ అమ్మాయి మాత్రం ఆ ప్రపోజల్‌ని సిల్లీగా తీసిపడేసి, స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుంది. సాత్విక్ టైమ్ టేబుల్ వేసుకొని మరీ, ఆమెను ఫాలో అవుతుంటాడు. నాన్నకు తెలిస్తే ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందోనని భయపడి, సాత్విక్ అడిగినట్లుగా రొమాన్స్‌కి ఓకే చెబుతుంది, కానీ ఒక కండీషన్ పెడుతుంది ఆమె. ఆ కండిషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన సాత్విక్‌ని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? చాలా మంది అమ్మాయిలు ఉన్నా, సాత్విక్ ప్రీతీని మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాడు? వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ప్రీతి రాకతో సాత్విక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అమ్మాయి కోసం అతను పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? తనది లస్ట్ కాదని నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకు ఏం చేశాడు? కొడుకుని కాపాడుకునేందుకు తల్లి శారద ఏం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ మధ్యకాలంలో, జస్ట్ ప్రేమకథలు అంటే పెద్దగా ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఆ ప్రేమ కథకు బోల్డ్ నెస్ యాడ్ చేస్తేనే, అవి వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ సినిమాలో కూడా ప్రేమ అంటే కేవలం లవ్ మాత్రమే కాదు, లస్ట్ కూడా ఉంటుందని బల్ల గుద్ది చెప్పాలా కథ రాసుకున్నాడు దర్శకుడు. సినిమా మొదలైన వెంటనే, హీరోది లవ్ కాదు లస్ట్ అని అనుకుంటాం. అతని ప్రవర్తన చూసి, ఒక్కోసారి కోపం, అసహ్యం కూడా వేస్తుంది. కానీ రాను రాను ఇది కూడా ప్రేమలో ఒక భాగమే కదా, తప్పేముందిలే అనే ఫీలింగ్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అతను రాసుకున్న పాయింట్, దాని చుట్టూ రాసుకున్న సీన్లు, డైలాగ్స్ బాగున్నాయి. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే, సినిమా మీద ఆసక్తి పెంచింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ విధంగా రాసుకుంటే, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. ప్రేమ కథను బోల్డ్గా చెప్పడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కుర్ర కారుతో పాటు, ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా రాసుకున్నాడు.
నటీనటుల విషయానికి వస్తే:
ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సాత్విక్ వర్మ, ఈ సినిమాలో హీరోగా మారాడు. ప్రేమికుడిగా, ముఖ్యంగా పిచ్చి పట్టి తిరిగే పాత్రలో ఇమిడిపోయాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు, ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకున్నాడు. ఇక అతని ప్రేయసి పాత్రలో ప్రీతి నేహా కూడా పరకాయ ప్రవేశం చేసింది. అందంగా కనిపించడమే కాదు, నటనతో కూడా మాయ చేసింది. మిగిలిన నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా, సినిమా సందర్భాన్ని బట్టి బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి మంచి బలం అయినట్లుంది. సినిమాటోగ్రఫీ, సినిమాకి మంచి ప్లెజెంట్ ఫీల్ తీసుకువచ్చింది. ఎడిటర్ కూడా బాగానే వర్కౌట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ప్రేమిస్తున్నా.. పెయిన్ ఆఫ్ లవ్