ప్రియదర్శి చివరి సినిమా మిత్రమండలి వర్కౌట్ కాలేదు. అయినా ఆయన హీరోగా ప్రేమంటే అనే సినిమా ఈ వరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ ఈ సినిమాను మొదటి సారి నిర్మించడం, ప్రియదర్శి, ఆనంది జంటగా నటించడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు, ఈ శుక్రవారం ‘ప్రేమంటే’ విడుదలయ్యింది. మరి ఈ చిత్రం అందరి అంచనాలను చేరుకుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, ముందుగా దాని రివ్యూ చూసేయండి మరి.
కథ : రమ్య (ఆనంది) భిన్న అభిప్రాయాల కారణంగా వివాహ బంధానికి దూరంగా ఉండే యువతి. మదన్‌మోహన్ అలియాస్ మది (ప్రియదర్శి): వ్యక్తిగత సమస్యల వల్ల పెళ్లి వద్దనుకునే యువకుడు. ఒక వివాహ వేడుకలో ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు. వారి పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లికి దారితీస్తుంది. వారి వైవాహిక జీవితం తొలి నెల రోజులు ఎంతో సంతోషంగా సాగుతుంది. ఆ తరువాతే కష్టాలు చుట్టుముడతాయి. బాధ్యతల కారణంగా రమ్య ఆఫీసు పనిలో నిమగ్నం కాగా, సమస్యల కారణంగా మది వ్యాపారంలోకి అడుగుపెడతాడు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మదిది సీసీ కెమెరాలు, లాక్‌లకు సంబంధించిన వ్యాపారం. ఆ పని ఎక్కువగా రాత్రిపూటనే ఉంటుంది. ఫలితంగా, రమ్య ఇంటికి వచ్చే సమయానికి మది తన ఆఫీస్‌కి వెళ్లడం, మది ఇంటికి వచ్చే సమయానికి రమ్య ఆఫీసుకు వెళ్లడం జరుగుతుంది. ఈ అస్తవ్యస్తమైన సమయపాలన వారి దాంపత్య జీవితంలో అసంతృప్తిని నింపుతుంది. ఒక రోజు వారిద్దరి మధ్య జరిగిన గొడవలో, మది తన వ్యాపార రహస్యాన్ని బయటపెడతాడు. ఆ నిజం రమ్యను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అసలు మది చేస్తున్న వ్యాపారం ఏంటి? రమ్య ఎందుకు అంత షాక్ అయింది? ఆ తర్వాత వారి వైవాహిక జీవితం ఏ మలుపు తీసుకుంది? చివరకు ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా మొదలైంది ఒక లవ్ స్టోరీలా అయినా ముగిసేది మాత్రం ఒక క్రైమ్ స్టోరీలా. చెడు పనులు చేసే భర్తతో భార్యలు వారిని మార్చే భార్యలు, మంచి మార్గంలో నడిచే భర్తకు తోడుగా ఉండే మంచి భార్యల కథలు మనం చూశాం. అయితే, ఇందులో హీరోయిన్ పాత్ర ప్రత్యేకం. సాధారణంగా, సమస్యల వల్ల భర్త దొంగగా మారితే, ఏ భార్య అయినా అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ భార్య భిన్నంగా ఆలోచిస్తుంది. భర్త దొంగ అని తెలిసినా, అతని సమస్యలను అర్థం చేసుకుని, అతనికి సహాయంగా తాను కూడా దొంగలా మారుతుంది. ఈ పాయింట్ కొత్తగా ఉంది. ఒకవైపు ఈ ఆసక్తికరమైన కథాంశాన్ని వినోదాత్మకంగా చూపుతూనే, మరోవైపు ఆ భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్య ప్రేమను, అనుబంధాన్ని తెరపై దర్శకుడు చక్కగా చూపించారు. ప్రియదర్శి, ఆనంది మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే, ప్రియదర్శి, అతని స్నేహితుల కలయికలో వచ్చే సీన్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
నటీనటుల విషయానికి వస్తే కనుక మది పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచారు. సంఘర్షణతో కూడిన పాత్రను ఆయన సమర్థవంతంగా పోషించారు. ఆనంది రమ్య పాత్రలో తెరపై అద్భుతంగా కనిపించింది. ఇక సుమ, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తమ పాత్రలను ఎప్పటిలాగే సహజంగా పోషించి మెప్పించారు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే దర్శకుడు రాసుకున్న కథాంశం కొత్తగా, కథనం ఆకర్షణీయంగా ఉంది. అయితే, ఫ్రెండ్స్ ట్రాక్, సుమ, వెన్నెల కిశోర్ ట్రాక్‌ల విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. విశ్వనాథరెడ్డి అందించిన విజువల్స్ బాగున్నాయి. జేమ్స్ లియోన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే.
ఫైనల్లీ : ప్రేమంటే ఏమిటంటే.. అనేది దర్శకుడి వెర్షన్లో చూపించారు.. నవ్వుకోడానికి ఓ సారి చూడొచ్చు.