ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్ కెరీర్‌లో మొట్టమొదటిసారి హారర్ జానర్‌లో సినిమా చేస్తున్నాడు అని అందరి దృష్టి సినిమా మీద పడింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని మారుతి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌లో రూపొందించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ది రాజా సాబ్ కథ:
ఆస్తులన్నీ పోగొట్టుకున్న జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్), తన నానమ్మ – అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న గంగమ్మ (జరీనా వాహబ్) తో కలిసి సాదాసీదా జీవితం గడిపేస్తూ ఉంటాడు. అయితే, ఎప్పుడో తన యవ్వనంలో అమ్మవారి నగలు వెతికి తెస్తానని వెళ్లిన తన భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం గంగమ్మ ఇప్పటికీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా తన తాత ఫోటో కనిపించడంతో, రాజా సాబ్ హైదరాబాద్ వచ్చి తాతను వెతికే పనిలో పడతాడు. అలా తాతను వెతికే పనిలో ఉండగానే బ్లెస్సీ (నిధి అగర్వాల్)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ప్రేమను ప్రపోజ్ చేసేలోపే భైరవి (మాళవిక మోహనన్)కి దగ్గరవుతాడు. మరి తన తాతను వెతకడం కోసం హైదరాబాద్ వచ్చిన రాజా సాబ్ తన తాతను కనిపెట్టాడా? అసలు కనకరాజు, గంగరాజు (సముద్రఖని) మధ్య జరిగిన గొడవ ఏంటి? రాజా సాబ్ తన తాతను వెతికి తన నానమ్మ దగ్గరకు తీసుకువెళ్ళగలిగాడా లేదా? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
గతంలో ఒక హారర్ కామెడీ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న మారుతి, మరోసారి అదే జానర్‌లో సినిమా చేస్తున్నాడు; అది కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో అని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు.
ఇక సినిమా మొదలైన తర్వాత, సినిమా చూస్తున్నట్టు కాకుండా వేరే లోకంలోకి తీసుకువెళ్లడానికి మారుతి ప్రయత్నం చేశాడు; అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ముందు అసలు కథలోకి వెళ్లకుండా పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలా ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగిపోతూ, మారుతి మార్క్ కామెడీతో అక్కడక్కడ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తి రేకెత్తిస్తుంది.
సెకండాఫ్ మొదలయ్యాక అసలు కథ మొత్తం రివీల్ అవుతూ వెళ్లాక, వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే సినిమా మొత్తం నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కొత్త కథ అయితే కాదు కానీ, ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. వాస్తవానికి ఇది ఐడియాగా చెప్పడానికి చాలా కష్టమైన విషయం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే కష్టం. ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చినప్పుడు ఎలా అయితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారో, ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
అయినా సరే, మారుతి ధైర్యం చేసి ఈ సినిమా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే, ఒక రకంగా తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు లేని విధమైన ట్రీట్మెంట్‌తో సాగుతుంది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే దెయ్యాల్ని వదిలించే మంత్రగాడిని తీసుకొచ్చి ఏదో ఒక విధమైన ప్రయోగం చేయించి వదిలించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ సైకాలజీతో లింక్ పెట్టి క్లోజ్ చేసిన విధానం కొంచెం కొత్తగా అనిపించింది. అయితే ఎగ్జిక్యూషన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే సినిమా అవుట్ పుట్ మరింత అద్భుతంగా వచ్చి ఉండేదేమో అనిపిస్తుంది. సెకండాఫ్ కొంచెం సేపు మిస్ అయినా కూడా సినిమా అర్థం కాకపోయే అవకాశం ఉంటుంది; అంతలా మైండ్ పెట్టి చూడాల్సిన విధంగా సెకండాఫ్ డిజైన్ చేసిన తీరు అభినందనీయం.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడు. పూర్తిగా ‘రాజా సాబ్’ అనే క్యారెక్టర్‌లో ఒదిగిపోయి, ఒకపక్క కామెడీ చేస్తూ, మరోపక్క రొమాన్స్ చేస్తూ, ఇంకొకపక్క యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇరగదీస్తూ, అంతే స్థాయిలో ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకున్నాడు. అయితే ప్రభాస్ లుక్స్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. వీరిద్దరితో పాటు రిధి కుమార్ కూడా నటించింది కానీ ఆమె పాత్రకు ఉన్న స్కోప్ తక్కువ. వి.టి.వి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, సప్తగిరి, జబర్దస్త్ మహేష్ వంటి వాళ్లు కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. సంజయ్ దత్ కనిపించిన ప్రతిసారి భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు కానీ, అతని పాత్ర డెప్త్ కొంచెం మిస్ అయింది.
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ మరియు ప్రొడక్షన్ గురించి; వాళ్లు పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించింది. అలాగే సీజీ (CG) వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. థమన్ అందించిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. అయితే నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ: ‘ది రాజా సాబ్’.. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్.