NTV Telugu Site icon

Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి

Ns

Ns

Phalana Abbayi Phalana Ammayi Review: హీరో నాగశౌర్య, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలు వాళ్ళ కాంబోలో వచ్చాయి. ఇక నాగశౌర్య, మాళవిక నాయర్ గతంలో ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో జంటగా నటించి హిట్ కొట్టారు. విశేషం ఏమంటే… ఈ మూడు సినిమాలకు కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ నలుగురి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. టి.జి. విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మరి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం.

వైజాగ్ లో ఇంజనీరింగ్ చేసే సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ (మాళవిక నాయర్) ఓ యేడాది సీనియర్. సంజయ్ హెల్పింగ్ నేచర్ గురించి తెలిసిన అనుపమ అతన్ని ర్యాగింగ్ బ్యాచ్ నుండి కాపాడుతుంది. అలా ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఆ తర్వాత ఎమ్మెస్ చేయడానికి విదేశాలకూ వెళతారు. అక్కడ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండగా ఊహించని ఓ సంఘటనతో బ్రేక్ కప్ అవుతుంది. తిరిగి ఐదేళ్ళ తర్వాత వాళ్ళు ఎక్కడ, ఎలా కలుసుకున్నారు? పాత చేదు ఘటనలను పరిష్కరించుకుని ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. పదేళ్ళ పాటు సాగే ఓ యువజంట జీవితాన్ని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చాప్టర్స్ వైజ్ విభజించి చూపించాడు. 2010లో లండన్ లో మొదలయ్యే కథ ఫ్లాఫ్ బ్యాక్ లో సాగి… తిరిగి ప్రస్తుతానికి వచ్చి ముగుస్తుంది.

కాలేజీ ఫ్రెండ్స్ ప్రేమలో పడటం, విడిపోవడం, తిరిగి ఒక్కటవడం అనేది రొటీన్ స్టోరీ! కొత్త కథలను పాత పద్థతిలో చెప్పాలి. పాత కథలను కొత్తగా చెప్పాలన్నది సినీ పండితులు చెప్పే మాట. బహుశా అందుకే కావచ్చు ఈ పాత కథను అవసరాల శ్రీనివాస్… చాప్టర్స్ గా విభజించి చూపించారు. అంతేకాదు… కథను విదేశాలలో నడిపారు. అంత మాత్రం చేత దీనికి కొత్తదనాన్ని ఆపాదించలేం. బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉన్నా సన్నివేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఐదేళ్ళ పాటు కలిసి చదువుకున్న స్నేహితులు, ఆ పైన ఎమ్మెస్ చేయడానికి విదేశాలకు వెళ్ళి అండర్ స్టాండింగ్ తో జీవిస్తున్న వాళ్ళు విడిపోవడానికి ఎంతో బలమైన కారణం ఉండాలి!? ఇందులో అదే మిస్ అయ్యింది. అలానే టఫ్ సిట్యుయేషన్ లో హీరోయిన్ పక్కన హీరో ఉండలేకపోవడానికి చెప్పిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. వీరి బ్రేకప్ కు, తిరిగి కలవడానికి బలమైన కారణాలను చూపించి ఉంటే… మూవీ ఫలితం మరోలా ఉండేది.

నాగశౌర్య మేకోవర్ బాగుంది. కాలేజీ స్టూడెంట్ గా చక్కగా సెట్ అయ్యాడు. మాళవిక నాయర్ లో పదేళ్ళ ముందుకు తర్వాతకు ఏమంత తేడా కనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయ్యింది. చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. నాగశౌర్య స్నేహితుడు వాలిగా అభిషేక్ మహర్షి చలాకీగా నటించాడు. అతని సిస్టర్ గా సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన హరిణిరావు డైలాగ్ మాడ్యులేషన్ తో నవ్వుల జల్లులు కురిపించింది. అవసరాల శ్రీనివాస్, మేఘ చౌదరి, అశోక్ రావు, శ్రీవిద్య, వారణాసి సౌమ్య, అర్జున్ ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులతో పాటు కళ్యాణీ మాలిక్ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం. హరనాథ్ నటించిన ‘మదన కామరాజు కథ’లోని సూపర్ హిట్ సాంగ్ ‘నీలిమేఘ మాలవో…’ను ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో పాడించారు. ఈ పాటను ఉపయోగించుకున్న తీరు బాగుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘కాఫీఫై’ సాంగ్ సరదాగా సాగింది. భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల, కిట్టు విస్సాప్రగడ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. అవసరాల శ్రీనివాస్ సంభాషణలూ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ సూపర్. కథ, కథనాల లోపం కారణంగా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ తేలిపోయారు. నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లోని వచ్చిన గత చిత్రాలను మనసులోంచి తీసేసి, ఓ సరదా సాయంత్రం తీరికగా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని టీవీ చూస్తే బాగానే అనిపిస్తుంది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్
సక్సెస్ ఫుల్ కాంబో కావడం
నటీనటుల సహజ నటన
ఆకట్టుకునే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్: కథలో కొత్తదనం లేకపోవడం
ఆసక్తి కలిగించని కథనం
ఊహకందే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: రొటీన్ అబ్బాయి రొటీన్ అమ్మాయి!

Show comments