తెలుగు సినిమా ప్రేక్షకులకు సప్తగిరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే గతంలో కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన తరువాత హీరోగా కూడా మారి కొన్ని సినిమాలు చేశారు. అయితే అలా హీరోగా గ్యాప్ ఇచ్చిన ఆయన చాలా కాలం తరువాత పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. సినిమా చూసి దిల్ రాజు సంస్థ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21, 2025న థియేటర్లలో విడుదలైంది. కానీ ఒకరోజు ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించడంలో ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం.
కథ ఏంటంటే?
ప్రసాద్(సప్తగిరి) మలేసియాలో ఒక హోటల్ లో పని చేస్తాడు. పెళ్లి విషయంలో కుటుంబ సంప్రదాయాలను పాటించాలని, కట్నం తీసుకోవాలని గట్టిగా నమ్మే ప్రసాద్ తండ్రి (మురళీధర్) మాట దాటి ఏమీ చేయడు. 38 ఏళ్ళు దాటుతున్నా 2 కోట్లు కట్నం ఇచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగా అదే సమయంలో ప్రియా(హీరోయిన్ ప్రియాంక శర్మ) కుటుంబం తమ కూతురికి విదేశాలకు వెళ్లే అవకాశం కల్పించే పెళ్లికొడుకుతోనే పెళ్లి చేయాలని, వారితో తాము కూడా వెళ్లిపోవాలని భవిస్తూ ఉంటుంది. ప్రసాద్ సంగతి తెలిసి అతన్ని ట్రాప్ చేసి ప్రియా పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి జరిగిన మొదటి రాస్తే ప్రసాద్ కి నిజం తెలుస్తుంది. ఆ నిజం ప్రియకు తెలిశాక విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అవుతుంది. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి జీవితం ఏమైంది? విదేశాలకు వెళ్లేందుకు ఏకంగా ఎకరం పొలం అమ్మేసిన చరిత్ర ఉన్న ప్రియా ఫ్యామిలీ, రెండు కోట్ల కట్నం కోసం అమ్మాయి అయితే చాలు అని పెళ్ళికి సిద్ధమయ్యే ప్రసాద్ ఫ్యామిలీ చివరికి ఎం చేశాయి? చివరకు ఈ జంట ఒక్కటవుతుందా? అనేది సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
పెళ్లి కాని ప్రసాద్ ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ అని ముందు నుంచి ప్రమోషన్స్ లో చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయింది. సప్తగిరి తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో మొదటి భాగంలో నవ్వులు పూయిస్తాడు. పెళ్లి కోసం ఆయన పడే ఆరాటం, కుటుంబ సభ్యులతో జరిగే సంభాషణలు హాస్యాస్పదంగా ఉంటాయి. రెండో భాగంలో కథ కాస్త సీరియస్‌గా మారినప్పటికీ, సప్తగిరి టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నడిపిస్తాయి. అయితే నిజానికి ఈ కథలో కొత్తదనం లేదు. ఎప్పుడో ఈవీవీ, జంధ్యాల సినిమాల సమయంలో వచ్చిన లాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇది పెళ్లి చుట్టూ తిరిగే కథ కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉంది. ఎందుకంటే వయసు పైబడుతున్నా కట్నం కోసం చూసే అబ్బాయి తరపు కుటుంబాలను, మింగ మెతుకు లేకున్నా ఫారెన్ సంబంధాల కోసం వెంటాడే అమ్మాయి తరపు కుటుంబాల ఫారెన్ మోజును కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అయితే లైన్ గా చూసుకున్నపుడు ఈ కథ బాగుంది. కానీ దాన్ని తెరమీదకు తీసుకొచ్చే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడు. ఫస్టాఫ్ కట్నం పేరుతో చేసే కామెడీ కాసేపు నవ్విస్తుంది. దానికి తోడు ప్రసాద్ ను హీరోయిన్ ఫ్యామిలీ ట్రాప్ చేసే వ్యవహారం ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ కు వెళ్ళాక కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సప్తగిరి చేసే కామెడీ నవ్విస్తున్నా, అసలు కథ ఏమీ కదులుతున్న ఫీలింగ్ ఉండదు. సెకండాఫ్ లో సాగతీత ఎక్కువైపోయిన ఫీలింగ్ రాకుండా బాగా రాసుకుని ఉంటే ఖచ్చితంగా నెక్ట్స్ లెవిల్ స్క్రిప్టు అయ్యేదనిపిస్తుంది. సప్తగిరి కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ సినిమా అయ్యేది.
సప్తగిరిది ఈ సినిమాలో వన్ మ్యాన్ షో. కొన్ని సీన్స్ లో బాగా నవ్వించాడు కూడా. మురళీధర్ గౌడ్ కి మళ్ళీ మంచి రోల్ పడింది. హీరోయిన్ ప్రియాంక్ శర్మ జస్ట్ ఓకే. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా, సప్తగిరితో ఆమె కెమిస్ట్రీ బాగుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ బాగా రాసుకున్నారు, అది తేరా మీద కూడా బాగా రాబట్టుకున్నారు. మీసాల లక్ష్మణ్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్, జెన్ని, నాగ మహేశ్ వంటి వారు తమ పాత్రలను బాగానే చేసుకుంటూ వెళ్లారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడు మంచి కామెడీ సీన్స్ రాసుకున్నాడు. కొన్ని డైలాగులు బాగా పేలాయి. దానికి తోడు మీమ్ కంటెంట్ ని బాగానే వాడటం ప్లస్ పాయింట్. సిట్యువేషనల్ కామెడీ కూడా పండింది. సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కామెడీ తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ : కథ లేదా కొత్తదనం ఆశించకుండా నవ్వులతో రిలాక్స్ కావాలనుకునే వారికి వన్ టైం వాచబుల్ మూవీ