గతంలో సినిమా బండి, శుభం అనే సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో పరదా అనే సినిమా రూపొందింది. అనుపమ పరమేశ్వరం, సంగీత, దర్శన ప్రధాన పాత్రలలో రూపొందించబడిన ఈ సినిమాని విజయ్ డొంకాడతో కలిసి మరో ఇద్దరు నిర్మాతలు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలతో పాటు ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద అంచనాలు పెంచేలా చేసింది. దానికి తోడు, దర్శకుడు “రివ్యూ చూసే మా సినిమాకి రండి” అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాని ఒక రెండు రోజులు ముందుగానే ప్రివ్యూ సదస్సులో చూపించారు. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
*పరదా కథ* : అది ఆంధ్రప్రదేశ్‌లోని పడతి అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఓ ఆడబిడ్డ పేరు జ్వాల. స్వాతంత్ర్య పోరాటం సమయంలో ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు మృగాళ్ల కామ వాంఛకు బలవుతుంది. అయినా సరే, ఆమె వెనక్కి తగ్గకుండా వారందరినీ మట్టుపెట్టి తాను మరణిస్తుంది. దీంతో ఆ ఊరి వాళ్లంతా ఆమెను తమ గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. అయితే, ఆమె మరణించిన తర్వాత ఊరిలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉండడంతో, ఆమెకు ఒక గుడి కట్టి పూజించాలని భావిస్తారు. అలాంటి సమయంలోనే పరదా వచ్చి ఆ విగ్రహం మీద పడడంతో, అప్పటినుంచి ఆడపిల్లలకు పరదా ఉంటే రక్షణ ఉంటుందని భావించి, అదేవిధంగా ఆ ఊరి ఆడపిల్లలు ఎవ్వరూ పరదా లేకుండా బయటకు వెళ్లకుండా ఓ నియమం పెట్టుకుంటారు. అయితే, అనుకోకుండా సుబ్బు (అనుపమ) పరదా లేకుండా ఉన్న ఒక క్షణంలో ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కి, ఒక పెద్ద మ్యాగజైన్‌లో కనిపిస్తుంది. దీంతో ఆ ఊరి వాళ్లంతా ఆచారం ప్రకారం ఆమెను ఆత్మహత్య చేసుకోమని కోరుతారు. లేదంటే, ఆ కెమెరా వ్యక్తిని తీసుకువచ్చి, అది తనకు సంబంధం లేకుండా తీసిన ఫోటో అని చెప్పించమంటారు. అతను నార్త్ ఇండియాలోని ధర్మశాలలో ఉన్నాడని తెలుసుకొని, సుబ్బు తన అత్త సంగీతతో కలిసి ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ ప్రయాణం ఎటు సాగింది, చివరికి ఏం జరిగింది, పరదా అనే ఈ ఆచారాన్ని అనుపమ తొలగించడానికి ఏం చేసింది అనేది సినిమా కథ.
విశ్లేషణ:
కథగా చూస్తే, ఇది చాలా సింపుల్. పరదా అనే ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న గ్రామానికి చెందిన ఓ యువతి, ఆ పరదా తమను కాపాడలేదని విషయం తెలిసి, ఆ విషయాన్ని గ్రామస్తులకు ఎలా ప్రూవ్ చేసింది అనేది లైన్. నిజానికి, ఈ పరదా టైటిల్ పెట్టినప్పటి నుంచి, బురఖా వ్యవస్థ మీద ఎందుకు చేయలేదు లాంటి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, దర్శకుడు కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా, తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు. నిజానికి, మనం ఎన్నో విషయాలను నమ్ముతూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంతెందుకు, మనం బయటికి బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే, కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్లమంటూ ఉంటారు. ఒక రకంగా చూస్తే అది మూఢనమ్మకం, మరో రకంగా చూస్తే అందులో కొంత సైన్స్ దాగి ఉందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే, ఏ మతంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఒక నమ్మకం ఏర్పడడానికి కారణం అప్పట్లో జరిగిన పరిస్థితులు. అప్పటి జనం లాజికల్ థింకింగ్ లేకుండా, పెద్దగా వాటిని కన్సిడర్ చేయకుండా, ఒక రకమైన నమ్మకానికి రావడమే. తుమ్ము రావడం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఎన్నో నమ్మకాలు మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం. కానీ, అవి ఎందుకు మొదలయ్యాయి, మొదలైన తర్వాత వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదా ఉపయోగం జరిగాయి లాంటి విషయాలను బేరీజు వేసుకొని చూస్తే, అది మూఢనమ్మకమా లేక ఒక మంచి కారణం కోసం పూర్వీకులు ఏర్పరిచిన ఒక నియంత్రణ రేఖనా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో కూడా దాదాపుగా అలాంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. మనం అనునిత్యం చూస్తూనే ఉంటాం, ఆరేళ్ల పసిపాపలను కూడా వదలకుండా రేప్ చేస్తున్న మృగాళ్లు ఉన్న సమాజం మనది. ఒకానొక సమయంలో రేపులు ఎక్కువగా జరుగుతున్నాయన్నప్పుడు, అమ్మాయిల వస్త్రధారణ గురించి కామెంట్స్ వినిపించేవి. అమ్మాయిలు వస్త్రధారణ సరిగ్గా ఉంటే ఇలాంటి అఘాయిత్యాలకు తావుండదు కదా అని. నిజానికి, అఘాయిత్యం చేయాలనుకున్న వాడికి వావి వరసలు ఉండవు, వయసు భేదాలు ఉండవు. కామా తురాణం నభయం నలజ్జ అన్న చందాన తెగబడుతూ ఉంటారు. సినిమాలో ఒక సీన్ ద్వారా దాన్ని ఎంతో రియలిస్టిక్ గా చెప్పే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. పరదా కప్పుకున్న అమ్మాయిని కూడా, ఆమె ముఖం ఎలా ఉంటుందో తెలియదు, అంగాంగ ప్రదర్శన అంతకన్నా లేదు, కానీ ఆమె మీద మనసు పడి రేప్ చేయడానికి సిద్ధమవుతారు, కారణం ఆమె అమ్మాయి కావడమే. ఇలా ఒకటి కాదు, ఎన్నో అంశాలను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. కాకపోతే, తీసుకున్న లైన్ బాగుంది, కానీ సినిమా చూస్తున్న సమయంలో హై మూమెంట్స్ ఇవ్వడంలో ప్రవీణ్ వెనుకబడ్డాడు. సినిమా కథ బాగుంది, కథనం బాగుంది, కానీ ఇంకా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. అనుపమ లాంటి హీరోయిన్ ఇలాంటి కథ ఒప్పుకోవడమే సినిమాకి ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. గుడ్డిగా పెద్దలు చెప్పింది నమ్మడం కాదు, దాని వెనుక ఉన్న లాజిక్స్ గురించి కూడా ఆలోచించి ముందుకు వెళ్లాలని చెబుతూ సాగే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, కానీ స్త్రీ శక్తిని సపోర్ట్ చేసే వారికి, వారు ఎప్పటికైనా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకునే వారికి సినిమా బాగా నచ్చుతుంది. ఆడదంటే కేవలం ఇంట్లో ఉండి వంట పనులు చేసుకునే మనిషి కాదు, అలాగే పురుషులతో సమానంగా పనిచేస్తూ కూడా వారి కన్నా తక్కువ జీతం తీసుకునే లాంటి స్థాయిలోనూ ఉండకూడదు. అలాంటి స్థాయిలో ఉండడం కన్నా, స్వేచ్ఛగా విహరించడం మిన్న అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమా ఆలోచింపచేస్తుంది. మీకు సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ సినిమా చూశాక ఆలోచిస్తూ బయటకు వెళ్తారు.
నటీనటుల విషయానికి వస్తే, అనుపమ పరమేశ్వరన్ సుబ్బలక్ష్మి అనే పాత్రలో ఇమిడిపోయింది. ప్రపంచానికి సంబంధంలేని ఓ ఊరిలో, ఆ ఆచారాలను గుడ్డిగా ఫాలో అవుతూ, తనకు తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమైన ఓ యువతి, ఆచారాన్ని తప్పని ఎలా ప్రూవ్ చేసింది అనే పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. దర్శనకు ఇందులో ఉన్న పాత్ర పరిమితమే అయినా, సుబ్బుని ప్రభావితం చేసే పాత్రలో ఆమె ది బెస్ట్‌గా నటించింది. సంగీత కూడా తనదైన శైలిలో స్క్రీన్ ప్రజెంట్‌తో ఆకట్టుకుంది. రాగ్‌మయూర్ కనిపించేది కొద్దిసేపైనా, తన పాత్ర మీద జాలి కలిగేలా నటించాడు. గౌతమ్ మీనన్ పాత్ర కనిపించేది రెండు మూడు సార్లు అయినా, సినిమా మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాకి ది బెస్ట్ ఇస్తూ ప్రాణం పెట్టేశాడు గోపి సుందర్. ఆయన అందించిన పాటలు కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లాయి. సినిమాటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉంది. ఇదేదో తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగకుండా, కొత్త ప్రయోగాలతో ఆసక్తికరంగా ప్రేక్షకులను అలరించాడు. సినిమాలోని చాలా డైలాగ్స్ ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా రాసుకున్నాడు డైరెక్టర్. సినిమా నిడివి కూడా వంకలు పెట్టడానికి లేకుండా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ఈ పరదా ఆలోచింపచేసే ఓ మంచి ప్రయత్నం.