రాజ్ తరుణ్ ఒకప్పుడు ప్రామిసింగ్ హీరోగా ఉండేవాడు. వరుస హిట్లు అందుకున్న అతను తర్వాతి కాలంలో ఎందుకో ఏమో సరైన హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో వివాదాల్లో ఎక్కువగా వినిపించిన రాజ్ తరుణ్, ఇప్పుడు పాంచ్ మినార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కచ్చితంగా హిట్ కొడతానని నమ్మకం వ్యక్తం చేయడంతో, ఆయన అభిమానులు కూడా సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా ఎదురు చూశారు. మరి, కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? రాజ్ తరుణ్ నమ్మకం నిలబడిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
కిట్టు (రాజ్ తరుణ్) ఒక నిరుద్యోగి. అతని గర్ల్ ఫ్రెండ్ ఖ్యాతి(రాశి సింగ్), ఎలా అయినా అతను ఒక ఉద్యోగంలో చేరితే తన తండ్రికి చెప్పి పెళ్లి చేసుకోవచ్చని భావిస్తూ, అతని ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈజీగా డబ్బు సంపాదించాలనే మైండ్‌సెట్‌తో ఉన్న కిట్టు, ఒక స్కామ్‌లో మోసపోయి, తన స్నేహితుడికి సంబంధించిన ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు. అలా ఓ రోజు కిరాయికి వెళ్లిన సమయంలో అతని కళ్ళముందే ఓ హత్య జరుగుతుంది. చెవిటివాడిగా నటిస్తూ ఉన్న అతను, అనుకోకుండా అదే రోజు కోట్లు సంపాదిస్తాడు.
అలా ఎలా సాధ్యమైంది? అసలు అతను కిరాయికి ఎక్కించుకుని వెళ్ళింది ఎవరిని? కోట్లు వచ్చాక కిట్టు జీవితం ఎన్ని మలుపులకు లోనైంది? చివరికి ఏం జరిగింది? అసలు పాంచ్ మినార్ అంటే ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమాలందు క్రైమ్ కామెడీ సినిమాలు వేరయా అన్నట్టుగా సాగిపోతోంది ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితి. ఎందుకంటే, క్రైమ్ కామెడీ పేరుతో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవేవీ ఒక పట్టాన వర్కౌట్ కావడం లేదు. కొత్త దర్శకుడు, రాజ్ తరుణ్ లాంటి స్ట్రగులింగ్ హీరోతో క్రైమ్ కామెడీ చేశాడు అనగానే, అసలు ఎలా ఉంటుందా అని థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకు కాస్త రిఫ్రెషింగ్‌గానే సినిమా అనిపించింది. రొటీన్‌గా ప్రారంభమైన కథ, ఆసక్తికరంగా ఒక క్రైమ్ కామెడీగా మారిన తీరు ఆకట్టుకుంటుంది.
ఓ సాదాసీదా కుర్రాడు, ప్రియురాలు దెబ్బకు ఎలా అయినా ఉద్యోగం చేయాలనే ప్రయత్నాల్లో ఉండగా, ఒక స్కామ్‌లో ఇరుక్కుంటాడు. దానివల్ల అయిన అప్పులను తీర్చుకునేందుకు క్యాబ్ నడుపుకుంటూ ఉన్న సమయంలో, అనుకోకుండా కోట్లు వచ్చి పడతాయి. కోట్లు ఊరికే వస్తాయా? వెనుక సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యల నుంచి తప్పించుకుని కోట్ల రూపాయలతో ఎలా డీల్ చేశాడు? చివరికి ఎలా బయటపడ్డాడు? అనే లైన్‌తో సినిమా రాసుకున్నాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కాస్త లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఫైనల్‌గా మాత్రం సినిమా ఆకట్టుకునేలా సాగింది అని చెప్పక తప్పదు.
నిజానికి, ఈ మధ్యకాలంలో వస్తున్న రాజ్ తరుణ్ సినిమాలలో ఇది చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాదు, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా కూడా ఉంది. ఒకప్పటి రాజ్ తరుణ్ మార్క్ కామెడీ ఈ సినిమాలో కనిపించింది. సినిమా మొత్తం చిన్న చిన్న ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన విధానం బావుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది.
నటీనటులు, సాంకేతిక అంశాలు:
ఇక నటీనటుల విషయానికి వస్తే, కిట్టు అనే పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. అతనికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఒకరకంగా చెప్పాలంటే కామెడీ విషయంలో రాజ్ తరుణ్ ఈజ్ బ్యాక్ అనేలా రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ ఉంది. రాశి సింగ్ ఒకపక్క అందాలు ఆరబోస్తూనే, మరోపక్క క్యూట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక అజయ్ ఘోష్, మీసాల లక్ష్మణ్, నితిన్ ప్రసన్న వంటి వాళ్లు కనిపించినంతసేపు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ మంచి ప్రజెంట్ ఫీల్ తీసుకువచ్చింది. శేఖర్ చంద్ర పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు, కానీ నేపథ్య సంగీతం సినిమాకి కరెక్ట్‌గా సెట్ అయింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి.
ఫైనల్లీ: ఈ పాంచ్ మినార్ – ఎంగేజింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.