Oru Thekkan Thallu Case Movie Telugu Review
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
నటీనటులు: బిజు మీనన్, నిమిషా సజయన్, పద్మప్రియ, రోషన్ మాథ్యూ, అశ్వత్ లాల్, అఖిల్ కవలయూర్, రేజు శివదాస్, అరుణ్ శంకరన్, ప్రశాంత్ మురళి
కెమెరా: మధు నీలకంఠన్
సంగీతం: జస్టిన్ వర్గీస్
దర్శకత్వం: శ్రీజిత్. ఎన్
‘ఖతర్నాక్’, ‘రణం’ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన మలయాళ నటుడు బిజుమీనన్, రోషన్ మాథ్యూతో కలసి నటించిన తాజా చిత్రం ‘ఒరు తెక్కన్ తల్లు కేస్’. పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేసినపపుడు ఒరిజినల్ ఎలా ఉంటుందో అని ఓటీటీలో వెతికి మరీ ఈ సినిమా చూశారు తెలుగువారు. అలాంటి బీజు నటించిన మరో హ్యూమన్ ఎమోషన్ సినిమా ‘ఒరు తెక్కన్ తల్లు కేస్’ సెప్టెంబర్ 8న ఆడియన్స్ ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్ల్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
జి.ఆర్. ఇందుగోపన్ రాసిన ‘అమ్మిని పిళ్ళై వెట్టు కేసు’ ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ఒరు తెక్కన్ తల్లు కేస్’. కథ విషయానికి వస్తే అమ్మిని పిళ్ళై కేరళ తీర ప్రాంతంలో ఓ చిన్న పట్టణంలో లైట్‌హౌస్ కీపర్‌గా పనిచేస్తుంటాడు. పొరుగున ఉండే వాసంతి (నిమిషా సజయన్) అమ్మిని భార్య రుక్మిణి (పద్మప్రియ)తో సన్నిహితంగా ఉంటుంది. పొడియన్ (రోషన్ మాథ్యూ) వాసంతి లవర్. ఓ రోజు రాత్రి పొడియన్, వాసంతి తన ఇంటి సమీపంలో సన్నిహితంగా ఉండటం చూసి మందలిస్తాడు అమ్మిని. మాట మాట పెరిగి పొడియన్ పై చేయి చేసుకుంటాడు అమ్మిని. దాంతో పాటు పొడియన్ స్నేహితులు రెచ్చ గొట్టడంతో పథకం ప్రకారం అమ్మినిపై దాడి చేసి గాయపరుస్తారు. ప్రతీకారంగా పొడియన్, అతని సహచరులపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు అమ్మని. మరి అమ్మని అన్నమాట నెరవేర్చుకుంటాడా? వాసంతి, పొడియన్ పెళ్ళి జరుగుతుందా? అన్నదే ఈ సినిమా.
నటీనటుల విషయానికి వస్తే బిజుమీనన్ మరోసారి పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మలయాళ సినిమాలో కనిపించిన పద్మప్రియ, వాసంతిగా నటించిన నిమిషా సజయన్, పొడియన్ గా నటించిన రోషన్ మ్యాథ్యూ దీటైన ప్రదర్శన కనబరిచారు. ప్రత్యేకించి నిమిషా తన కళ్ళతో వ్యక్తం చేసే హావభావాలను మరువలేము. మధు నీలకంఠన్ కెమెరా గ్రామీణ వాతారవరణాన్ని చక్కగా క్యాప్చర్ చేసింది. జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. అయితే స్లో నెరేషన్ ఈ సినిమాకు అతి పెద్ద మైనస్. చిన్న పాయింట్ బేస్ చేసుకుని రెండున్నర గంటలకు పైగా సినిమా తీయటంతో ఆడియన్స్ అంతగా ఇన్ వాల్వ్ కాలేరు.
ప్లస్ పాయింట్స్
బిజుమీనన్, నిమిషా నటన
పద్మప్రియ రీ ఎంట్రీ
అందరికీ తెలిసన కథ కావటం
మైనస్ పాయింట్స్
స్లో నెరేషన్
కాన్ ఫ్లిక్ట్ పండకపోవడం
రేటింగ్: 2.25
ట్యాగ్ లైన్: అహం బ్రహ్మాస్మి