డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో సుహాస్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. జో ఫేమ్ మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ..
రామ్(సుహాస్) తల్లి (అనితా హంసానందిని) ఓ క్లాసికల్ డ్యాన్సర్. భర్త చేసిన మోసం తట్టుకోలేక చిన్నప్పుడే కొడుకుని తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోవడంతో మేనమామ(అలీ) రామ్‌ని పెంచి పెద్ద చేస్తాడు. రామ్‌కి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్లాలనుకుంటాడు. అయితే ఓ సారి అనుకోకుండా జరిగిన కారు ప్రమాదం కారణంగా సత్యభామ(మాళవిక మనోజ్)తో పరిచయం ఏర్పడుతుంది. రామ్ వ్యక్తిత్వం నచ్చి.. సత్య అతన్ని ప్రేమిస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతం చేసి స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ చేస్తుంది. కొన్నాళ్ల తర్వాత రామ్‌ని సడెన్‌గా దూరం పెడుతుంది. మూడేళ్ల వరకు తనను కలువొద్దని కండీషన్ పెడుతుంది. ఉన్నఫలంగా రామ్‌ని సత్య ఎందుకు దూరం పెట్టింది? సినిమాలు చూడడానికే ఇష్టపడని రామ్‌ని దర్శకుడిగా చేయాలని ఎందుకు ప్రయత్నించింది? అసలు రామ్ నేపథ్యం ఏంటి? అతని తండ్రి ఎవరు? మూడేళ్ల తర్వాత రామ్, సత్యభామలు కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కథల ఎంపిక విషయంలో సుహాస్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన సినిమాల్లో కథే హీరోగా కనిపిస్తుంది. అందుకే సుహాస్ సినిమా అంటే..ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుందని అంతా భావిస్తారు. కానీ ఓ భామ అయ్యో రామ విషయంలో సుహాస్ తప్పుటడుగు వేశాడనిపిస్తుంది. డిఫరెంట్ కథ పక్కకి పెట్టు.. అసలు కథేలేని ఈ సినిమాను సుహాస్ ఎలా ఒప్పుకున్నాడనేది ప్రశ్న సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్రేక్షకుడి మదిలో మొదలవుతుంది. రొటీన్ లవ్‌స్టోరీకి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి కాస్త ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించారు. అయితే మదర్ సెంటిమెంట్ ఆకట్టకున్నా.. లవ్‌ట్రాక్ మాత్రం కాస్త బోరింగానే సాగుతుంది.
ఒక ఎమోషనల్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయం వరకు స్లోగానే సాగుతుంది. కారు ప్రమాదం నుంచి హీరోయిన్‌ని హీరో కాపాడడం.. అతని వ్యక్తిత్వం నచ్చి.. హీరోయిన్ ఇష్టపడడం.. ఇదంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోని బయటకు తీసుకెళ్లి సినిమా కథ చెప్పడం.. దాన్ని తెరపై చూపించిన విధానం కొంతవరకు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అయితే ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ కావడం చిరాకు తెప్పిస్తుంది. స్మశానం సీన్‌తో పాటు ఒకటిరెండు కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ సోసోగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో వచ్చే మదర్ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ను రొటీన్‌గా కాకుండా.. ఓ చిన్న ట్విస్ట్‌తో డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. ఎలాంటి అంచానాలు లేకుండా, కొత్తదనం ఆశించకుండా వెళితే.. ఓ భామ అయ్యోరామ కొంతవరకు అలరిసుంది.
నటీనటుల విషయానికి వస్తే రామ్ పాత్రలో సుహాస్ సెటిల్డ్‌గా కనిపించారు. సత్యభామగా మాళవిక పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్‌నిచ్చిన పాత్ర ఆమెది మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుహాస్ తల్లిగా అనిత కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. హీరో మేనమామ పాత్రలో అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక దర్శకులు మారుతి, హరీశ్ శంకర్‌ల అతిథి పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. రథన్ సంగీతం, మణికందన్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
ఫైనల్లీ : ఓ భామ అయ్యో రామ రొమాంటిక్ కామెడీ విత్ సమ్ ఎంగేజింగ్ మూమెంట్స్