పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఓ.జి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, నిజానికి అనౌన్స్ చేసిన నాటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే ఉంది. దానికి తోడు, ఈ సినిమా ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ హాజరై చేసిన హడావుడితో ఒక్కసారిగా ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చూడాలని ఆసక్తి కలిగింది. అయితే, ఈ సినిమా 25వ తేదీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
1980లలో సత్య దాదా(ప్రకాష్ రాజు) బొంబాయిలో ఒక పోర్టు నడుపుతూ ఉంటాడు. అయితే, ఆ పోర్టులో ఒక ఆర్డిఎక్స్ కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో, ఒకప్పటి సత్య దాదా పార్ట్నర్ కొడుకు ఓమి(ఇమ్రాన్ హష్మీ), రంగంలోకి దిగి సత్య కుమారుడిని చంపిస్తాడు . అయితే, అప్పటికే సత్య దాదాకి దూరమై, అజ్ఞాతంలో తన భార్య కన్మణి(ప్రియాంక మోహన్)తో, ఓజస్ గంభీర(పవన్ కళ్యాణ్) రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే, సత్య దాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు? సత్య దాదా కుటుంబానికి ఆపద ఎదురైన నేపథ్యంలో, తిరిగి వస్తానన్న ఓజి తిరిగి వచ్చాడా? ఓమి కంటైనర్‌లో అసలేముంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
పవన్ కళ్యాణ్ ఓ.జి అనే సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, హంగ్రీ చీతా అంటూ తమన్ ఇచ్చిన సంగీతం సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది. అయితే, సినిమా మొదలైన తర్వాత ఇది రొటీన్ ఫార్ములాతోనే రాసుకున్న కథ అనే విషయం కొద్ది సేపటికి అర్థం అయిపోతుంది. కానీ, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కోసం రాసుకున్న ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ ఎలివేషన్స్‌కి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొన్నేళ్ల ఆకలి తీరిపోయే ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా. నిజానికి, ఒక గ్యాంగ్‌స్టర్ అనుకోకుండా గ్యాంగ్‌కి దూరమైపోయి, మళ్లీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే, వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంత ఎందుకు, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమా కూడా దాదాపుగా ఇదే లైన్‌తో రూపొందింది. ఈ సినిమా కూడా దాదాపుగా అలాగే అనిపిస్తుంది. కానీ, కేవలం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌తోనే చాలా సీన్స్ పండాయి. ముఖ్యంగా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూపులతోనే సాగిపోతుంది. అయితే, ఒక్కసారి వచ్చాక ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కదా, ఊహకు అందేలానే రాసుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ ఇవ్వలేకపోయింది. నిజానికి, ఇది ఫ్యాన్స్‌కు మాత్రమే కిక్ ఇచ్చేలాగా దర్శకుడు రాసుకున్న సినిమా అని కూడా చెప్పొచ్చు. అయితే, ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయంలో పెట్టిన శ్రద్ధ, ఎందుకో కథ మీద కానీ, ఎమోషన్స్ మీద కానీ పెట్టలేదనిపిస్తుంది. అలాగే కథలో ఎన్నో ప్రదేశాలు ఎంతోమంది మనుషులు వస్తూపోతూ ఉంటారు అది కూడా చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, ఇది పవన్ కళ్యాణ్ ప్యూర్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కోసం సుజిత్ చెప్పినట్టు చేస్తూ, వారికి ఫుల్ మీల్స్ కాదు, అంతకుమించి అనేలా పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రియాంక మోహన్ పాత్ర చిన్నదే, ఉన్నంతలో మెప్పించింది. శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పోషించారు. ఇమ్రాన్ హష్మీ కూడా పవన్‌కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేసి, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మిగతా నటీనటుల గురించి చెప్పాలంటే, ఆ లిస్టు చాలా పెద్దది. అందరూ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే, ఈ సినిమా కథ, కథనం విషయంలో కాస్త వీక్ అనే ఫీలింగ్ కలిగినా, టెక్నికల్ విషయాలు మాత్రం టాప్ నాట్చ్‌గా ఉన్నాయి. ఎక్కువగా ఎలివేషన్స్ మీదే ఫోకస్ చేసిన క్రమంలో, తమన్ గట్టిగానే డ్యూటీ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిజానికి, ఈ సినిమాకి చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. కానీ, అది ప్రేక్షకులకు విఎఫ్ఎక్స్ అని అనిపించకుండా ఫైన్ ట్యూన్ చేయడంలో సుజిత్ అండ్ టీం పడిన కష్టం కనిపిస్తుంది. కథ అంతా 80లలో జరుగుతుంది కాబట్టి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కష్టం కూడా దాదాపు చాలా ఫ్రేమ్స్‌లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా సెట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతం. దానయ్య ఖర్చు పెట్టిన కోట్లన్నీ తెరమీద అద్భుతంగా కనిపించాయి.
ఫైనల్లీ, ఈ ఓ.జి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఏళ్ల ఆకలి తీర్చిన ఫుల్ మీల్స్. కామన్ ఆడియన్స్‌కి గ్యాంగ్‌స్టర్ డ్రామా విత్ పవన్ మార్క్ బ్లడ్ బాత్.