NTV Telugu Site icon

Court Movie Review: కోర్టు రివ్యూ.. నాని నమ్మకం నిలబడిందా?

Court

Court

నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నిర్మించిన చిత్రాలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన రిలీజ్ కావలసి ఉండగా రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. ఒకటి సెలబ్రిటీ స్పెషల్ కాగా మరొకటి మీడియా కోసం ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కోర్టు కథ :
విజయవాడ కోర్టులో సీనియర్ లాయర్ మోహన్ రావు(సాయికుమార్) దగ్గర తేజ ప్రియదర్శి జూనియర్గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఒక కేసు తనకు ఇవ్వకపోతాడా అని ఎదురుచూస్తున్న సమయంలో ఒక పోక్సో కేసు మోహన్ రావుని వెతుక్కుంటూ వస్తుంది. విశాఖపట్నంలో ఒక వాచ్మెన్ కొడుకు చందు (రోషన్) అదే ప్రాంతంలో ఒక రైస్ మిల్ ఓనర్ మంగపతి (శివాజీ) కుటుంబానికి చెందిన ఇంటర్ చదివే జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. అయితే అది నచ్చక మంగపతి శ్రీదేవి వయసు అడ్వాంటేజ్ గా తీసుకొని పోక్సో కేసు నమోదు చేస్తాడు. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత మోహన్ రావుని వెతుక్కుంటూ వచ్చిన ఈ కేసుని తేజ ఏం చేశాడు? తేజ కారణంగా చందు బయటకు వచ్చాడా? అసలు పోక్సో కేసు నిజమేనా లేక ఇరికించారా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ :
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు కోర్టు రూమ్ డ్రామా సినిమాలు అలవాటు లేదు. ఆ తరహా సినిమాలో అనగానే వకీల్ సాబ్, తమిళం నుంచి డబ్బింగ్ అయిన జై భీమ్, మలయాళం నుంచి డబ్బింగ్ అయిన నెరు, జనగణమన గుర్తొస్తాయి. ఇక ఈ సినిమాని ఒక పూర్తిస్థాయి కోర్టు రూమ్ డ్రామాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు హీరో నాని. ఆయన నిర్మాతగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆసక్తి మరింత పెరిగింది. ఇక సినిమా ఓపెనింగే పోక్సో కేసులో ముద్దాయికి శిక్ష ఖరారు చేస్తున్నట్లుగా ఉంటుంది. తర్వాత ఆ కేసు నడిపిస్తున్న తీరుతో పాటు కేసు పూర్వపరాలను లాయర్ చదువుతూనే మనకి కళ్ళకు కట్టినట్లు చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. 2013వ సంవత్సరంలో జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఒక టీనేజ్ జంట ప్రేమ కథను అసభ్యతకు తావు ఇవ్వకుండా చాలా క్యూట్ గా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే రొటీన్ సినిమా ఫీలింగ్ కలిగేలా మంగపతి అనే క్యారెక్టర్ తో ఎంటర్ అయిన శివాజీ డబ్బు కులం జాఢ్యంతో తప్పుడు పోక్సో కేసు పెట్టించి అరెస్టు చేయించిన తీరు పైకి సాధారణంగానే కనిపించినా అక్కడ కుల, ఆర్థిక, సామాజిక అసమానతలను ప్రస్తావించిన తీరు అభినందించకుండా ఉండలేము. అయితే ప్రేమ కథ సాగిపోతున్న సమయంలో రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ కేసులో ఎప్పుడైతే ప్రియదర్శి తేజ పాత్రతో ఎంటర్ అవుతాడో అప్పుడు నుంచి అసలు కథ మొదలవుతుంది. కేసులో ప్రియదర్శి వాదించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాని ఎక్కడా ఇది అతనికి ఫస్ట్ సినిమా అని అనిపించకుండా తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు పనితీరుని నేర్చుకోవాలి. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్స్ కి దూరంగా ఉంటాయి. కాకపోతే ఒక మంచి కథ చెప్పాలనుకునే ప్రయత్నంలో దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ లిబర్టీగా వాటిని ఫీల్ అవ్వచ్చు. ఇక ఇప్పటి మన పరిభాషలో చెప్పాలంటే నిబ్బ నిబ్బీల ప్రేమ కథను సీరియస్ గా తీసుకుని అందులో కుర్రాడిని జీవితాంతం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఒక లాయర్ ఆ జీవితాన్ని ఎలా కాపాడాడు అనే లైన్ ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ క్రమంలో పోక్సో అనే చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? అనే విషయాన్ని కూడా చర్చించే ప్రయత్నం చేశారు. నిజానికి మన దేశంలో ఆ చట్టం అనే కాదు డబ్బున్న వారికి చట్టం చుట్టం అనేలా ఎన్నో సందర్భాలలో ఎన్నో కేసులలో చట్టాలను చుట్టాలుగా వాడుకొని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మాత్రం పోక్సో కేసు మీద కాస్త అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాక చదువుకునే రోజుల్లోనే చట్టాల గురించి కూడా చెప్పేలా ఏదైనా రూల్ తీసుకొస్తే బాగుంటుందనే పాయింట్ కాస్త ఆచరణకు కష్టమే అయినా నిజమే కదా అనిపించేలా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కొందరికి లాజిక్ లెస్ అనిపించవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా మీద నాని నమ్మకం నిలబడిందా? అని అడిగితే నిలబడిందని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శివాజీ నటన గురించి. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన శివాజీ ఈ సినిమాతో ఒక సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. అందరూ ప్రియదర్శి నటన కోసం ప్రిపేర్ అయి వెళితే అవుట్ ఆఫ్ సిలబస్ గా వచ్చిన శివాజీ అరిపించాడు. శివాజీ నటనకు విజిల్స్ తో పాటు చప్పట్లు కూడా వినిపించాయి. ఇక ఆ తరువాత ప్రియదర్శి కూడా తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక యువ ప్రేమ జంట రోషన్ శ్రీదేవి కూడా చాలా క్యూట్ గా కనిపించారు. శుభలేఖ సుధాకర్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయం గురించి మాట్లాడాలంటే ముందుగా డైలాగు రైటర్ గురించి ప్రస్తావించాలి. ఎన్నో ఆలోచింపజేసే డైలాగ్స్ ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేసేలా ఉంది. ముఖ్యంగా ఎడిటింగ్ కూడా సినిమాని ఎలివేట్ చేసేలా ఉంది. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సాంగ్స్ తో పాటు నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం తీసుకొచ్చింది.

ఫైనల్లీ కోర్ట్ తెలుగులో ఎంగేజింగ్ కోర్టు రూం డ్రామా..