నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఊర్వశి రౌతేల మరో కీలక పాత్రలో నటించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ- త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లు కొడుతున్న బాలయ్య నుంచి వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచింది. దానికి తోడు నిర్మాత నాగ వంశీ బాలకృష్ణ గత హిట్ల కంటే ఇది తోపు అంటూ చేసిన ఎలివేషన్స్ నేపథ్యంలో సినిమా చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు మరి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
1996 మదనపల్లెలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతూ ఉంటాడు కృష్ణమూర్తి (సచిన్ కేడ్కర్). అతని మనవరాలు వైష్ణవి (బేబీ వేద అగర్వాల్) అనుకోకుండా లోకల్ ఎమ్మెల్యే (రవి కిషన్), అతని తమ్ముడు మనోహర్ నాయుడు (సందీప్ రాజ్ ) చిక్కుల్లో పడుతుంది.. ఈ విషయం తెలిసి భోపాల్ జైలు నుంచి తీహారు జైలుకు వెళుతున్న ఖైదీ డాకు మహారాజ్ ( బాలకృష్ణ) తప్పించుకొని వస్తాడు. వైష్ణవి ఇంటిలో నానాజీ పేరుతో డ్రైవర్గా చేరతాడు. అయితే ఎమ్మెల్యే వెంట ఉండి కొకైన్ పండిస్తున్న చోటా ఠాకూర్ (రిషి) వైష్ణవి కుటుంబాన్ని అంతమొందించేందుకు హిమాచల్ ప్రదేశ్ నుంచి దిగుతాడు. అయితే అప్పుడు ఏమైంది? అసలు డాకు మహారాజ్ ఎవరు? ఎందుకు వైష్ణవి కోసం పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చి మరీ కాపాడతాడు? సీతారాం డాకు మహారాజ్ ఎలా అయ్యాడు? అలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా కొత్త కథతో రూపొందించింది అయితే కాదు కానీ బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ అన్ని అంశాలను సరిగ్గా తూకానికి వేసినట్లు సెట్ చేసి మరీ రంగంలోకి దించారు. ఫస్ట్ ఆఫ్ మొదట్లోనే నందమూరి బాలకృష్ణ విశ్వరూపాన్ని అభిమానులతో పాటు ప్రేక్షకులకు సైతం చూపించి సినిమా మొత్తాన్ని ఒక రకమైన వైబ్ తో నడిపించారు. నిజానికి ఒక మంచి వ్యక్తి దుష్టులను ఎదిరించేందుకు తాను కూడా మారణ హోమానికి సిద్ధమై ఆ దుష్టులను ఎలా అంతమొందించాడు? అనే కథతో ఎన్నో సినిమాలు చూసాము. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందింది, కానీ నందమూరి బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఒకపక్క ఫైట్లు మరోపక్క డాన్సులు అన్నింటికీ మించి ఎలివేషన్లు ఇలా సరిగ్గా తూకం వేసుకొని మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందు నుంచి ప్రమోషన్స్ లో బాబీ చెప్పినట్టుగానే ఈ సినిమా విషయంలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా డైలాగ్స్, ఫైట్లు, ఎలివేషన్లు ప్లాన్ చేసి మరీ అభిమానులకు విందు భోజనం పెట్టారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం డాకు మహారాజుగా బాలకృష్ణ ఎంట్రీ మొదలు చిన్నారిని కాపాడటం, ఆయన గురించి ఇచ్చే ఎలివేషన్లతో ఒక విందు భోజనంలో సాగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ పెద్దగా ఆసక్తి రేకెత్తించకపోయినా సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని సగటు ప్రేక్షకులకు ఆలోచన రేకెత్తించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే అంత స్పీడ్ గా లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ ఫుల్ కిక్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ అంతగా కిక్ అనిపించకపోవచ్చు. అయితే అభిమానులకు మాత్రం అది కూడా ఒకరకంగా మంచి మీల్స్. నిజానికి సీతారామనే క్యారెక్టర్ డాకు మహారాజుగా ఎలా రూపాంతరం చెందింది అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. దానికి పడ్డ స్ట్రగుల్ కళ్ళకు కనిపించింది కానీ ఎందుకో ఫస్ట్ అఫ్ ఫుల్ మీల్స్ తిన్న తర్వాత ఇది అంత కిక్ ఇవ్వకపోవచ్చు కానీ నందమూరి అభిమానులు కోరుకునేలాంటి ఒక ఫుల్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. చిన్నచిన్న లాజికల్ అంశాలు పక్కన పెడితే సినిమా మాత్రం ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది.
నటీనటుల విషయానికి వస్తే:
డాకు మహారాజుగా మారిన సీతారాం అనే వ్యక్తిగా నందమూరి బాలకృష్ణ రెండు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో నటించాడు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణకి కొట్టినపిండి. ఎప్పటిలాగే ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అలాగే తనదైన సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఈసారి ఆకట్టుకున్నాడు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే లౌడ్ అనిపిస్తాయి కానీ ఈ సినిమాలో ఆయన సెటిల్ పర్ఫామెన్స్ సినిమాకి ప్రధానమైన అసెట్. ఇక సినిమా మొత్తాన్ని ఒక మలుపు తిప్పే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ అదరగొట్టింది. ప్రగ్యా జైస్వాల్ పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో మెప్పించింది. ఎస్సై పాత్రలో ఊర్వశి నటించడం కంటే గ్లామర్ ఆరబోతకే పరిమితమైంది. యానిమల్ తర్వాత బాబీ డియోల్ కి అలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర పడింది. క్రూరమైన వ్యక్తిగా జుగుప్త్స కలిగించేలా నటించాడు. ఇక ఇతర పాత్రలలో నటించిన రిషి, రవి కిషన్, సందీప్ రాజ్, చాందిని చౌదరి, సచిన్ ఖేడ్కర్, వీటివి గణేష్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా సంగీతం గురించి అదే విధంగా సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నందమూరి బాలకృష్ణ సినిమా అంటే కచ్చితంగా బాక్సులు బద్దలవుతాయి అని చెప్పిన తమన్ సినిమాలో మ్యూజిక్ తో కూడా అదే రేంజ్ లో అరుపులు పుట్టించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ అద్భుతంగా ఉంటే స్క్రీన్ మీద వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, నందమూరి బాలకృష్ణ సినిమాకి ఇప్పటివరకు ఎవరు ఇవ్వనంత అద్భుతమైన విజువల్స్ అందించాడు సినిమాటోగ్రాఫర్. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్లు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా రాసుకున్న డైలాగ్స్ సెట్ అయ్యాయి. ఆయన ఎలివేషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. నిడివి సినిమాకి బాగా ఉపయోగపడింది ఎడిటర్ ని ఆ విషయంలో అభినందించాలి.
ఫైనల్లీ:
బాలయ్య మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్.. అభిమానులకు విందు భోజనం గ్యారెంటీ.