NTV Telugu Site icon

Rangabali Review: నాగశౌర్య ‘రంగబలి’ రివ్యూ

Rangabali Movie Review

Rangabali Movie Review

Rangabali Movie Review and rating: చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్య ఎట్టకేలకు రంగబలి అనే సినిమాతో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే సినిమా మీద నమ్మకంతో సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాలలో పలు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించింది. అలాగే మీడియా కోసం కూడా ఒక స్పెషల్ షో కూడా ప్రదర్శించింది ఈ సందర్భంగా నాగశౌర్య నటించిన రంగబలి సినిమా రివ్యూ ద్వారా సినిమా ఎలా ఉంది అనేది పరిశీలిద్దాం పదండి.

సినిమా కథ ఏమిటంటే
శౌర్య అలియాస్ షో(నాగశౌర్య) రాజవరం అనే ఊరిలో తన నలుగురు స్నేహితులతో కలిసి బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. తన తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊరిలో మెడికల్ షాప్ నడుపుకుంటూ మంచి పేరు సంపాదిస్తే శౌర్య మాత్రం ఊరిలో కుర్ర వాళ్లకు మందు అలవాటు చేస్తూ ఊరి మొత్తం మీద పేరు చెడగొడుతూ ఉంటాడు. అయితే తన తర్వాత షాప్ చూసుకోవాల్సిన శౌర్య బీఫార్మసీ పాస్ అవ్వాల్సిందేనని శౌర్యను విశాఖపట్నం పంపిస్తాడు విశ్వం. అక్కడ కాలేజీలో సహజ (యుక్తి తరేజా)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శౌర్య. కొంతకాలానికి సహజ కూడా శౌర్య ప్రేమలో పడుతుంది. ఇదే క్రమంలో సహజ తన తండ్రిని కలవమని శౌర్యను పంపిస్తుంది. సహజ తండ్రి(మురళీ శర్మ) కూడా శౌర్యను అల్లుడిగా ఒప్పుకుంటాడు కానీ శౌర్య ఆ ఊరిని వదిలేసి రావాలని కండిషన్ పెడతాడు. వదల్లేనని, అసలు ఇబ్బంది ఏంటో చెప్పమని ప్రాధేయపడితే శౌర్య ఊరిలో ఉన్న ఒక సెంటర్ కు రంగబలి సెంటర్ అనే పేరు ఉండటమే తన ప్రాబ్లమ్ అని చెబుతాడు. ఆ ఊరిలో ఆ సెంటర్ ఆ పేరు ఉన్నంతవరకు పెళ్లి జరగదని తేల్చేస్తాడు. అసలు రంగబలి సెంటర్ కు సహజ తండ్రికి ఉన్న కనెక్షన్ ఏమిటి ? సహజ తండ్రిని ఒప్పించడానికి శౌర్య ఏం చేశాడు? నిజంగానే రంగబలి సెంటర్ కి ఉన్న పేరు మార్చారా? శౌర్య సహజ చివరికి ఒకటవుతారా? లేదా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
ఈ సినిమా మొదలు పెట్టడమే నాగశౌర్య పరిచయంతో మొదలవుతుంది. నాగశౌర్య బలాదూర్ తిరుగుతూ ఉండడం అతని తండ్రి షాపు చూసుకోమని బలవంత పెడుతూ ఉండడం చివరికి అక్కడి నుంచి కథ విశాఖపట్నం మారడంతో ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఆ తర్వాత దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు కూడా సమయం తీసుకున్నాడు. అయితే ఈ క్రమంలో నాగశౌర్య, కమెడియన్ సత్య మధ్య వచ్చే ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని సత్యనే తన భుజస్కందాల మీద నడిపించాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా మళ్లీ వేగం మందగించిన భావన కలుగుతుంది. సత్య కామెడీ ఫస్టాఫ్ తోనే ముగించేసి సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ డ్రామాలా నడిపించే ప్రయత్నం చేశాడు కానీ ఏమాత్రం కన్విన్సింగ్ అనిపించలేదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్టే కానీ దాన్ని తెరమీద ఎక్కించే సమయంలో కాస్త తడబడినట్లు అనిపించింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఓవరాల్గా సినిమా మాత్రం కొత్త దర్శకుడు చేసినట్టు అయితే అనిపించలేదు.

ఎవరెలా చేశారు అంటే?
గాలికి తిరిగే కుర్రాడిగా ఆ పాత్రకి సరిగ్గా సూట్ అయ్యాడు నాగశౌర్య. ఎప్పటిలాగే తన న్యాచురల్ యాక్టింగ్ తో చంపేశాడు. ఇక సత్య ఈ సినిమాకి పెద్ద అసెట్ లాగా దొరికాడు. ఆయనే కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తాన్ని భుజస్కందాల మీద నడిపించాడు అని చెప్పవచ్చు ఇక గోపరాజు రమణ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా అద్భుతంగా నటించారు. మురళీ శర్మ కనిపించేది తక్కువ సీన్లలో అయినా ఆకట్టుకున్నాడు. అయితే షైన్ చాం టాకో పెద్దగా విలనిజం పండించే పాత్ర అయితే దొరకలేదు. ముందు నుంచి ఆయన పాత్రకు బిల్డప్ ఏమి ఇవ్వలేదు, అలానే జోకర్ ను చేసి ముగించేశారు. హీరోయిన్ యుక్తి తరేజ అందాల ఆరబోతకే పరిమితమైంది. ఆమె పాత్రకు పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. సప్తగిరి, బ్రహ్మాజీ, శరత్ కుమార్ వంటి వారి పాత్రలు కూడా చాలా చిన్నగా అనిపించాయి. ఇక పవన్ బాసం శెట్టి దర్శకుడిగా పూర్తిస్థాయిలో సినిమాకి న్యాయం చేయకపోయినా కొన్ని డైలాగులు సీన్ల విషయంలో మాత్రం టేకింగ్ విషయంలో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక మ్యూజిక్ సినిమాకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బీజీఎం కొన్ని చోట్ల సెట్ అయింది. ఇక సెకండాఫ్ కూడా కాస్త బోరింగ్ సీన్స్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా కుదిరింది. మ్యూజిక్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కొంచెం ఎక్కువ కత్తిరించి ఉంటే సినిమా క్రిస్పీగా ఉండేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్
కథ
ఫస్టాఫ్ కామెడీ
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
సెకండాఫ్
కన్విన్సింగ్ గా లేని ఫ్లాష్ బ్యాక్
ఎడిటింగ్

బాటమ్ లైన్: రంగబలి.. సత్య లేకుంటే సినిమా బలి

Show comments