Naa Nee Prema Katha Review: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా పూర్తిగా మాయం అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమకు పెద్దగా పరిచయం లేని వారు సైతం సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు చేస్తున్నారు. అదే విధంగా ఈ వారం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ నా నీ ప్రేమ కధ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఖుషి లాంటి సినిమా వస్తున్నా సరే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం
కథ:
నాని (అముద శ్రీనివాస్) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. మరో పక్క ఆ గ్రామ పెద్ద నాయుడు(అజయ్ ఘోష్) కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్ కోర్సు చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవాలని సొంతూరుకు వస్తుంది. ఈ క్రమంలో నాని నందిని ప్రేమలో పడతాడు. ఇక అదే సమయంలో గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తూ ఉంటాడు. విషయం తెలిసిన నాయుడు నానిని చంపాలనుకుంటే గుణ నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి అతన్ని ఎందుకు రక్షించాడు? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? గుణ, నందిని పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కథగా చెప్పాలంటే ఇదేమీ కొత్తగా సృష్టించిన కథ కాదు. ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
సాధారణంగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే అతని వ్యక్తిని చంపి అయినా సరే ఆ అమ్మాయిని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ ఈ సినిమాలో గుణ మాత్రం నాని చనిపోకుండా నాయుడు బారి నుంచి రక్షించడం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ పాయింట్ ని డైరెక్టర్ బాగా డీల్ చేశాడు అని చెప్పక తప్పదు. డైరెక్షన్ తో పాటు హీరోగా నటించడంతో ఎందుకో రెండు పడవల మీద కాలు వేసినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలోనే డైరెక్షన్ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లు అనిపించింది. నిజానికి హీరో స్థానంలో మరొక వ్యక్తిని కనుక పెట్టుకుని డైరెక్షన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ వేరే లెవెల్ లో ఉండేదేమో అనిపిస్తుంది. అయితే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆసక్తికరమైన ట్విస్టుతో కథ బాగానే రాసుకున్న పూర్తి స్థాయిలో దాన్ని తెర మీద చూపించే విధానంలో కాస్త తడబడ్డాడు.
ఎవరు ఎలా చేశారంటే
డైరెక్షన్ తో పాటు హీరోగా నటించిన అముద శ్రీనివాస్ ఒక పేపర్ బాయ్ పాత్రలో బాగా చదువుకున్న అమ్మాయిని ప్రేమించిన వ్యక్తిగా ఇమిడిపోయాడు. కారుణ్య చౌదరి కూడా తనదైన శైలిలో నటించింది. ఇక సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ షఫీ గురించి అజయ్ గౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వారిద్దరూ తమ తమ పాత్రలలో పూర్తిస్థాయిలో ఒక రేంజ్ లో నటించారు. టెక్నికల్ విషయాలకు వస్తే… దర్శకుడు లవ్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించే విషయంలో పర్వాలేదు అనిపించుకున్నా స్ర్కీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. పాటలు సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం బాగా నప్పింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్ గా రొటీన్ ప్రేమకథే అయినా ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చచ్చు.