Miss Perfect Web Series Review: మెగా కోడలిగా మారిన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’ నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ అభిజీత్ కీలక పాత్రలో నటించగా అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. స్కై ల్యాబ్ ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథ: లావణ్య రావుకి(లావణ్య త్రిపాఠి)ప్రమోషన్ వచ్చి ముంబై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఆమెకు ఓసీడీ కారణంగా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాదులో ఆమె ఫ్లాట్‌లో వంట చేయడానికి పనమ్మాయి జ్యోతి (అభిజ్ఞ) కుదురుకుంటుంది. అదే సమయంలో లావణ్య ఉండే గేటెడ్ కమ్యూనిటీలో రోహిత్ (అభిజీత్) ఫ్లాట్‌లో కూడా జ్యోతి పని చేస్తుంటుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా తాను పనికి రాలేనని చెప్పి ఆ విషయం రోహిత్‌కు చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. అతని ఫ్లాట్‌కు వెళ్లిన లావణ్యను చూసి పని మనిషని, జ్యోతి మరొకర్ని పంపిందని భావించి రోహిత్ వెంటనే వెళ్లి పడుకుంటాడు. లావణ్య అసలు విషయం చెబుదామని అనుకున్నా దరిద్రంగా ఉన్న ఫ్లాట్ చూసి క్లీన్ చేస్తుంది. మొదటిరోజు తరువాత ఇక అటు వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్లి తన పేరు లక్ష్మి అని చెబుతుంది.ప్రతి రోజూ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండగా లక్ష్మీ అలియాస్ లావణ్యను చూసి రోహిత్ ప్రేమలో పడతాడు. ఆమె కోసం జ్యోతిని పనిలోంచి తీసేయడంతో జ్యోతి ఈ లక్ష్మి ఎవరో తెలుసుకోవాలని స్పై చేస్తుంది. దీనికి ఆమె సోదరుడు కార్తీక్(హర్ష్ రోష్), బిల్డింగ్ వాచ్ మెన్(మహేష్ విట్టా) సహకరిస్తాడు. రోహిత్ కి కి కుకింగ్ అంటే ఇష్టం. ప్రతి రోజూ లక్ష్మికి ఇష్టమైనవి వండి పెడుతూ ఉండగా అమ్మ పోరు పడలేక పెళ్లి చూపులకి సిద్ధం అవుతాడు. అయితే తన ఇంటికి పని మనిషిగా వచ్చేది లక్ష్మి కాదని, లావణ్య అని రోహిత్ తెలుసుకున్నాడా? ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడా? లేదా? రోహిత్ మీద లావణ్యకి ప్రేమ ఉందా? అతనికి ఆమె తన అసలు పేరు ఎందుకు చెప్పలేదు? చివరికి ఏమైంది? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: ఒకప్పుడు మన తెలుగు వాళ్లకి ఓసిడి అనే విషయం మీద పెద్దగా అవగాహన లేదు. కానీ మారుతీ దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత ఓసిడి అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. ఇది చాలా తక్కువ మందిలో ఉండే ఒక రకమైన డిసార్డర్. దాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన సిరీస్ ఈ మిస్ పర్ఫెక్ట్. కరోనా లాక్డౌన్ సమయంలో జరిగిన కథగా ఈ సిరీస్ ని మన ముందుకు తీసుకొచ్చారు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ. అతి శుభ్రత అనే సమస్యతో బాధపడే లావణ్య అసలు అది సమస్య కాదని భావిస్తూ ఉంటుంది. నిజానికి ఆమెకు ఉన్న అతి శుభ్రత వల్ల ప్రేమించిన ప్రియుడు కూడా దూరమవుతాడు. అయినా సరే ఎక్కడో కొంచెం శుభ్రత తక్కువ అయింది అనిపించినా వెంటనే రంగంలోకి దిగి దాన్ని సరిదిద్దడం ఆమె నైజం. అలాంటిది పనమ్మాయి రావడం లేదు అని చెప్పడానికి వెళ్లి అక్కడున్న అపరిశుభ్ర వాతావరణాన్ని మొత్తం పరిశుభ్రంగా చేయడం లాజికల్ గా ఎందుకో కరెక్ట్ గా అనిపించ లేదు. జ్యోతి అనే క్యారెక్టర్ ని కథ నుంచి పక్కకు డీవియేట్ చేయాలని భావించారో ఏమో తెలియదు కానీ ఆమెకు సింగింగ్ టాలెంట్ ఉందని దాని కోసం ఆమె ఏమైనా చేస్తుందని కష్ట పడుతుందని ఇరిగించినట్టు అనిపించింది. లాక్ డౌన్ కాన్సెప్ట్ తోనే కొంత ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉన్నా దాన్ని వదిలేసి హర్షవర్ధన్, ఝాన్సీ మధ్య లవ్ ట్రాక్ కూడా ఇరికించిన విధంగానే ఉంటుంది. అయితే ఉన్నంతలో జ్యోతి, కార్తీక్, సెక్యూరిటీ గార్డ్ ట్రాక్ నవ్వులు పూయించే విధంగా ఉంది. అయితే కథగా పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ కాదు అలాగే అత్యద్భుతం అని ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా ఉండవు. ఒక చిన్న అపార్ట్మెంట్లో లావణ్య లక్ష్మీగా మారిన సమయంలోనే ఏదో ఒక రోజు ఆమె లావణ్య అని తెలుస్తుంది అందరికీ తెలుసు. అయితే రోహిత్ ఎలా స్పందించాడు? లక్ష్మీగా ప్రేమించిన అతను లావణ్యను ఎలా రిసీవ్ చేసుకుంటాడు? అనేది క్లైమాక్స్లో ఊహకు తగ్గట్టుగానే ముగించారు.
నటీనటుల విషయానికి వస్తే లావణ్య అలియాస్ లక్ష్మి అనే పాత్రలో లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్ గా నటించింది. రెండిటికీ పెద్దగా తేడా లేకపోయినా ఆమె తనదైన శైలిలో తేడా కనిపించేలా చేసింది. ఇక జ్యోతి పాత్రలో అభిజ్ఞ పనమ్మాయిగా కనిపిస్తూనే అనుకున్న దాని కోసం కష్టపడే యువతిగా ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్, ఝాన్సీ ఇద్దరి పాత్రలు చాలా పరిమితమే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. హర్ష్ తో పాటు మహేష్ కామెడీ కొంత వరకు వర్కౌట్ అయింది. పాటలు కూడా ఉన్నా పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. కాకపోతే నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ విషయంలో మరింత క్రిస్పీగా కట్ చేసుకోవచ్చు.
ఫైనల్ గా మిస్ పర్ఫెక్ట్ ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఒక పర్ఫెక్ట్ వెబ్ సిరీస్.. అంచనాలు లేకుండా చూసే వారికి నచ్చొచ్చు.. ఏ సర్టిఫికెట్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా చూసే వారికి నచ్చకపోవచ్చు.