NTV Telugu Site icon

Michael Movie Review: ‘మైఖేల్’ మూవీ రివ్యూ

Michele1

Michele1

వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సందీప్ కిషన్ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన సినిమా ‘మైఖేల్’. తెలుగులోనే హిట్ లేక అల్లాడుతున్న సందీప్ కిషన్ హీరోగా ఏకంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో భారీ స్థాయిలో విడుదలైన ‘మైఖేల్’కి అతిథిగా విజయసేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తోడవటంతో కొద్దిగా అంచనాలు పెరిగాయి. మరి శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది? సందీప్ ని సక్సెస్ పలకరించిందా? లేదా? అన్నది చూద్దాం.

కథ విషయానికి వస్తే ఇది 1991లో నేపథ్యంలో తెరకెక్కింది. తన తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి మైఖేల్ (సందీప్ కిషన్) ముంబై గ్యాంగ్ స్టర్ గురు (గౌతమ్ మీనన్) పంచన చేరుతాడు. గురు తన భార్య చారులత (అనసూయ) మాట జవదాటడు. వీరి కొడుకు వరుణ్ సందేశ్. తనే సొంతంగా గూండాగిరి చేయాలనుకుంటాడు వరుణ్. అందుకు తండ్రి గురు అడ్డుపడతాడు. దీంతో సొంత తండ్రినే చంపాలనుకుంటాడు. అయితే దీనికి మైఖేల్ అడ్డుపడి గురును కాపాడతాడు. తనను చంపాలనుకున్నవారిని కనిపెట్టే పని మైఖేల్ కి అప్పచెబుతాడు గురు. ఆ పని మీద ఢిల్లీ వెళ్ళిన మైఖేల్ అక్కడ థీర (దివ్యాంశ కౌశిక్) ప్రేమలో పడి గురును చంపటానికి ప్లాన్ వేసిన ఆమె తండ్రిని వదిలేస్తాడు. దీంతో వరుణ్ అతని గ్యాంగ్ మైఖేల్ ను కాల్చి థీరను తీసుకువెళుతుంది. ప్రాణాలతో బయటపడ్డ మైఖేల్ థీరను కాపాడతాడా? విజయ్ సేతుపతికి మైఖేల్ కి ఉన్న బంధం ఏమిటి? మైఖేల్ తల్లికి అన్యాయం చేసిందెవరు? అందుకు తను పగ తీర్చుకున్నాడా? వీటన్నింటికి సమాధానమే ఈ ‘మైఖేల్’ సినిమా.

టోటల్ సినిమా అంతా డార్క్ మోడ్ లో తెరకెక్కించారు. ఆరంభంలో స్వామి పాత్ర (అయ్యప్ప పిశర్మ)తో మైఖేల్ గురించి చెప్పటం నుంచి చివరి వరకూ మొత్తం ‘కెజిఎఫ్’ ప్రేరణతోనే సాగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రంజిత్ జయకోడి మాస్ ఆడియన్స్ ని మెప్పించాలనే తాపత్రయంతో సినిమాని నడిపించినట్లు అనిపించింది. సందీప్ కిషన్ కెరీర్ పూర్తిగా పరాజయాల బాటలో ఉన్నపుడు ఈ డార్క్ క్రైమ్ డ్రామాను కథావస్తువగా ఎంచుకోవడంతో పాటు ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోవడం పెద్ద డ్రా బ్యాక్. తను కొత్తవాడైనా, సందీప్ కి మార్కెట్ లేకున్నా, అడిగిన నటీనటులను ఇచ్చి ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమా అన్నా వెరవక ఖర్చుపెట్టి సినిమా తీసిన నిర్మాతలను దర్శకుడు నిలువునా ముంచేశాడనే చెప్పాలి. నటీనటుల విషయానికి వస్తే మైఖేల్ గా సందీప్ కిషన్ ప్రాణం పెట్టి చేశాడు. అయినా మరోసారి అదృష్ఠం తనని వెక్కిరించింది. అందుకు కారణం సరైన కథను ఎంపిక చేసుకోలేకపోవడమే. తనకు జోడీగా నటించిన దివ్యాంశ కౌశిక్ గ్లామర్ ఆకట్టుకుంటుంది. గురుగా గౌతమ్ మీనన్, అతని కొడుకుగా వరుణ్ సందేశ్ ఓకె. అనసూయకు ఈ తరహా పాత్ర ఆలవాలమే. అయ్యప్పపిశర్మ ఇలాంటివి కొన్ని వందలు చేసి ఉంటాడు. శ్యామ్ మ్యూజిక్ సినిమా మూడ్ కు అనుగుణంగా సాగింది. ఇక ఈ సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందనే భ్రమను కలిగించటం మరింత హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా మైఖేల్ గురించి చెప్పుకోవాలంటే నిర్మాణ విలువలు మినహా ఇంకేమీ లేదు.

ప్లస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
కెజిఎఫ్ ప్రేరణతో తీయటం

ట్యాగ్ లైన్: నిరాశపరిచిన ‘మైఖేల్’