NTV Telugu Site icon

Bhola Shankar Review: భోళాశంకర్ రివ్యూ

Bhola Shankar Review

Bhola Shankar Review

Bhola Shankar Movie Review: వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళాశంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటించగా… మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటించారు. సుశాంత్ ఈ సినిమాలో కీర్తికి లవర్ గా కనిపించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఇక ఎన్నో అంచనాల నడుమ భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన (నేడు) థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం

కథ:
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) పై చదువుల కోసం కలకత్తాకు వస్తాడు. అక్కడే ఉన్న వంశీ(వెన్నెల కిషోర్) కంపెనీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. శంకర్ తన చెల్లెలిని చదివించి ఆమెకు మంచి భవిష్యత్తును అందించాలనుకుని రాత్రి పగలు కష్ట పడుతూ ఉండగా ఒకరోజు బ్రేక్ డౌన్ అయ్యి కారు కోసం ఎదురుచూస్తున్న లాస్య తమన్నా కోర్టు వరకు డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో లాస్య తమ్ముడు శ్రీకర్(సుశాంత్), మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని శంకర్ దృష్టికి అలాగే తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పెళ్లి ప్రపోజల్ కూడా పెడతాడు. అయితే ముందు శంకర్ మీద ద్వేషం పెంచుకున్న లాస్య అనూహ్యంగా అతనితో ప్రేమలో పడుతుంది. ఒకసారి అతను అత్యంత క్రూరంగా మనుషులను చంపుతున్న క్రమంలో లాస్య చూసి ఇలాంటి నరరూప రాక్షసుడి చెల్లెలికి అన్నతో వివాహం జరిపించాలని తనకు లేదని చెబుతుంది. అయితే అసలు మహాలక్ష్మి తన చెల్లెలే కాదని చెబుతూ ఒక షాకింగ్ విషయాన్ని శంకర్ బయట పెడతాడు. శంకర్ బయటపెట్టిన భయంకరమైన విషయం ఏమిటి? నిజంగా శంకర్ చెల్లెలు మహాలక్ష్మి కాదా శంకర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? శంకర్ కి మహాలక్ష్మికి శంకర్ కు అసలు సంబంధం ఏమిటి? చివరికి శ్రీకర్ మహాలక్ష్మి వివాహం జరిగిందా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సబ్జెక్టు తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకుడు రమేష్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. నిజానికి మెహర్ రమేష్ ఒక అవుట్ డేటెడ్ డైరెక్టర్ అనే వాదన ముందు నుంచి అందరూ తెరమీదకు తెస్తూనే ఉన్నారు. దానికి కారణం ఆయన చివరిగా షాడో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అవకాశం ఇచ్చారంటే ఏదో మ్యాజిక్ చేస్తాడని అందరూ నమ్మారు కానీ సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తన పనితనాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకున్నాడో సగటు ప్రేక్షకుడికి కూడా ఈజీగా అర్థం అయిపోతుంది. వాస్తవానికి వేదాళం సినిమా నుంచి అక్రమ యువతుల ట్రాఫికింగ్ అనే ఒక విషయాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసిన మాట వాస్తవమే. కానీ పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తాను మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూసుకోవాలి అనుకున్నారో అదే విధంగా తెరమీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం శంకర్ కలకత్తా నేపథ్యంలో సీన్లు ఏమాత్రం ఆసక్తి పెంచకుండానే సాగిపోతూ ఉంటాయి. ఒక రకంగా మెగాస్టార్ లో ఉన్న కామెడీ ఈజ్ ని కూడా ఆయన వాడుకోలేకపోయాడు. నిజానికి భోళా శంకర్ అనేది ఒక ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ అని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. కమర్షియల్ ఎంటర్టైనర్ పని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడమే కానీ భోళా శంకర్ లో అదే మిస్ అయింది. మెగాస్టార్ చిరంజీవిలో స్వతహాగా ఉండే కామెడీ ఈజ్ ని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారేమో అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త మెరుగనిపిస్తుంది. శంకర్ బ్యాక్ గ్రౌండ్ రివిల్ చేయడం ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సెకండ్ హాఫ్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించొచ్చు.

ఎవరు ఎలా చేశారు అంటే
నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ పాత్రలో జీవించేసాడు. తనకి ఎప్పటినుంచో అచ్చొచ్చిన పాత్రలాగే అనిపిస్తూ ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి నటించడంలో పెద్దగా కష్ట పడినట్లు అనిపించలేదు. ఒకరకంగా సినిమా మొత్తం మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షోలా నడిపించే ప్రయత్నం చేశారు కానీ పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. తమన్నాతో పోల్చుకుంటే కీర్తి సురేష్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి. అయితే తమన్నా పాత్రను ఇరికించినట్లు అనిపించింది. కొన్ని కామెడీ సీన్ల కోసం ఎమోషన్స్ కోసం ఆమెను సినిమాలో భాగం చేశారేమో అనిపించింది. ఇక పూర్తి స్థాయిలో ఆమె తన పాత్రకు న్యాయం అయితే చేసింది. సుశాంత్ కీలకపాత్ర అని ముందు నుంచి ప్రచారం చేశారు కానీ ఈ సినిమాలో అతిధి పాత్ర అని చెప్పొచ్చు. వీరు కాకుండా సినిమాలో వేణు ఎల్దండి, గెటప్ శ్రీను, బిత్తిరి సత్తి, షకలక శంకర్, శ్రీముఖి, రష్మీ ఇలా పేర్లు కూడా గుర్తుంచుకో లేనంత మంది నటీనటులు ఉన్నారు. కానీ చాలా తక్కువ సీన్లకే పరిమితమయ్యారు. టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ఆయన అందించిన కొన్ని సాంగ్స్ వినడానికి బానే ఉన్నా విజువల్ గా ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు ఏమో అనిపించింది. సినిమాటోగ్రఫీ కొంతవరకు పర్వాలేదు అనిపించినా సినిమా నిడివి ఇబ్బంది పెట్టే విషయమే.

ఫైనల్ గా:
భోళా శంకర్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్… అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.