NTV Telugu Site icon

Malikapuram Review: మాలికాపురం (మళయాళం డబ్బింగ్)

Malikkapuram

Malikkapuram

Malikapuram Review: ఇంతకు ముందు తెలుగులో “జనతా గ్యారేజ్, పంచాక్షరి, యశోద” వంటి చిత్రాలలో నటించిన మళయాళ నటుడు ఉన్నిముకుందన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మాలికాపురం’. మళయాళంలో డిసెంబర్ 30న విడుదలై బిగ్ హిట్ గా నిలచిన ‘మాలికాపురం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ అనువాద చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ ‘గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్’ విడుదల చేసింది.

‘మాలికాపురం’ కథ విషయానికి వస్తే- చిన్నారి షన్నూకు అయ్యప్పస్వామి అంటే ఎంతో భక్తి, ఇష్టం. ఆమె నాన్నమ్మ దగ్గర రోజూ అయ్యప్ప కథలు వింటూ ఉంటుంది. ఆమె తండ్రి శబరిమల తీసుకువెళ్తానంటూ ఉంటాడు. కానీ, అప్పులవారి చేత అవమానం పొందిన షన్నూ తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. ఆ సమయంలో షన్నూ ఎలాగైనా శబరిమల వెళ్ళాలనుకుంటుంది. ఆమె తండ్రి స్నేహితుని కొడుకైన అబ్బాయిని షన్నూ అన్నా అంటూ పిలుస్తూ ఉంటుంది. చెల్లెలిని శబరిమల తీసుకువెళ్ళాలని ఆ బాబు, షన్నూను తీసుకు వెళతాడు. పాపను ఎత్తుకు పోవాలని ఓ దుర్మార్గుడు ప్రయత్నిస్తాడు. అయితే అయ్యప్ప అనే వ్యక్తి తానూ శబరిమల పోతూ పిల్లలను క్షేమంగా స్వామి దర్శనమయ్యేలా చేస్తాడు. ఆ వ్యక్తి అక్కడ పనిచేసే పోలీస్ అని తెలుస్తుంది. షన్నూ మాత్రం అయ్యప్పనే తమను వచ్చి రక్షించాడని భావిస్తుంది. పిల్లలు కనిపించక కన్నవారు తల్లడిల్లుతారు. చివరకు షన్నూ తండ్రి స్నేహితుడు వచ్చి పిల్లలను తీసుకు వెళతాడు. షన్నూ ఎప్పటిలాగే అయ్యప్ప బొమ్మలు వేస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

పిల్లలు, భక్తి నేపథ్యంలో గతంలోనూ పలు చిత్రాలు రూపొందాయి. అయ్యప్ప స్వామి బాలభక్తులతోనూ కొన్నిసినిమాలు వెలుగు చూశాయి. తొలిసారి మాల వేసుకొనేవారిని ‘కన్య స్వామి’ అంటూ సంబోధిస్తారు. ఎనిమిదేళ్ళ బాలికలకు కూడా అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం ఉంటుంది. అలాంటి వారిని ‘మాలికాపురం’ అని పిలుస్తారు. ఇందులో కథ మొత్తం పాప చుట్టూ తిరుగుతుంది కాబట్టి ‘మాలికాపురం’ అన్న టైటిల్ నిర్ణయించారు. షన్నూగా నటించిన దేవ నందా, శ్రీపత్ ఆకట్టుకొనే అభినయం ప్రదర్శించారు. ఉన్ని ముకుందన్ తన పాత్రకు తగిన రీతిలో నటించి మెప్పించారు. రంజిన్ రాజ్ సంగీతం అలరిస్తుంది. భక్తిగీతాలు ఆకట్టుకుంటాయి. గతంలో తెలుగులోనూ ‘దేవుళ్ళు’ అనే సినిమా పిల్లల నేపథ్యంలోనే రూపొంది అలరించింది. ఈ సినిమా సైతం భక్తకోటిని ముఖ్యంగా అయ్యప్పస్వామి భక్తులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– అయ్యప్ప భక్తులను ఆకట్టుకొనే కథ
– బాలల నటన
– కథను పట్టుగా నడపడం
– నేపథ్య సంగీతం, పాటలు

మైనస్ పాయింట్స్:
– పాత కథనే అనిపించడం

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: భక్తిపారవశ్యం!