వరుస ప్లాపులు అందుకుంటూ వస్తున్న మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మదరాసి. శివ కార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ విలన్‌గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచిగా వర్కౌట్ అయింది. తిరుపతి ప్రసాద్ నిర్మాతగా రూపొందించబడిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి కూడా ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
మదరాసి కథ:
రఘు (శివ కార్తికేయన్) ఒక మానసిక రుగ్మతలతో బాధపడుతున్న యువకుడు. అయితే, ఆ మానసిక రుగ్మత వల్ల చాలామందికి మంచి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ సందర్భంలో అతనికి మాలతి (రుక్మిణి వసంత్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి, తర్వాత అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ బాధలో తాను చనిపోవడానికి సిద్ధమైన సమయంలో తమిళనాడు ఎన్‌ఐఏ హెడ్ ప్రేమ్ నాథ్ (బిజు మీనన్)కి పరిచయమవుతాడు. ఎలాగో సూసైడ్‌కి రెడీ అవుతున్నాడని ఒక సూసైడ్ మిషన్ రఘుతో ప్లాన్ చేస్తాడు ప్రేమ్. ప్రేమ్ ప్లాన్ చేసిన సూసైడ్ మిషన్ ఏంటి? ఇందులో విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్) పాత్ర ఏమిటి? చివరికి బ్రేకప్ కథ ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: నిజానికి హీరోకి ఒక మానసిక రుగ్మత లేదా శారీరక అవలక్షణాలు పెట్టుకుని, దాని చుట్టూ రాసుకున్న సినిమా కథలెన్నో మనకు తెలుసు. ఇది కూడా దాదాపుగా అలాంటిదే. హీరోకి ఉన్న మానసిక రుగ్మత ప్రకారం చనిపోయిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తొస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే, వారిలో కుటుంబ సభ్యులను చూసుకొని, వారికి అండగా నిలబడుతూ ఉంటాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, సినిమాగా చూసినప్పుడు మాత్రం భలే ఆసక్తికరంగా అనిపించింది. ఆ మానసిక రుగ్మతను చూసి ప్రేమలో పడిన హీరోయిన్, దాని కారణంగానే దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే, తదనంతర పరిస్థితుల్లో హీరో ఏం చేశాడు, హీరో చావుకు కూడా సిద్ధమవ్వడానికి కారణమైన పరిస్థితులు ఏమిటి అనేది దర్శకుడు ఆసక్తికరంగా రాసుకున్నాడు. నిజానికి శివ కార్తికేయన్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమా అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా కూడా దాదాపుగా అలాగే సాగింది. ఫస్ట్ హాఫ్‌లోనే హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేసిన దర్శకుడు, తర్వాత హీరోయిన్‌తో పరిచయం వంటి సీన్స్ ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఆ తర్వాత గన్ డిస్ట్రిబ్యూషన్ కోసం విలన్ గ్యాంగ్ దిగటం, దాన్ని హీరో, హీరోయిన్‌లకు లింక్ చేసిన విధానం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతూ ఉండగా, సెకండ్ హాఫ్ మాత్రం వైలెంట్‌గా అనిపిస్తుంది. మితిమీరిన హింస అనే ఫీలింగ్ కూడా ఒకానొక సందర్భంలో వస్తుంది. కానీ సినిమా కథకు అది సరిపోయే వైలెన్స్ అనే చెప్పాలి. అయితే, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నంత బాగా సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు ఎక్కదు. కానీ, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి.
నటీనటులు: ఈ సినిమాలో శివ కార్తికేయన్‌కి కొత్త పాత్ర ఏమీ కాదు. గతంలో ఆయన ఎలాంటి పాత్రలో మెరిసాడో, ఈ పాత్రలో కూడా చాలా ఈజీగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక రుక్మిణి వసంత్ అందంగా కనిపిస్తూనే, తనదైన అభినయంతో ఆకట్టుకుంది. విద్యుత్ జమ్వాల్‌కి చాలా మంచి పాత్ర దొరికింది. అతని స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు కూడా ఇరగదీశాడు. సహా మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు. అనవసర సీన్లు సెకండ్ హాఫ్‌లో సాగదీసిన ఫీలింగ్ కలిగించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ అనవసరంగా ఎక్కువ వాడినట్లు అనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు.
ఫైనల్‌గా, ఈ మద్రాసి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్.