NTV Telugu Site icon

Lucky Lakshman Movie Review: లక్కీ లక్ష్మణ్ రివ్యూ

Lucky Lakshman

Lucky Lakshman

Lucky Lakshman Movie Review: లక్కీ లక్ష్మణ్ రివ్యూ
రిలీజ్: 30-12-2022
నటీనటులు: సోహెల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, గీతు రాయల్, రచ్చరవి, యాదమ్మ రాజు
కెమెరా: ఆండ్రూ
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయానంద్ కీతా
నిర్మాత: హరిత గోగినేని
కథ, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం: ఎ.ఆర్. అభి

బిగ్ బాస్ 4లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన సయ్యద్ సోహెల్ కి విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతకు ముందు అడపా దడపా వెండితెర, బుల్లితెరపై మెరిసినా బిగ్ బాస్ ఇచ్చిన సరికొత్త ఇమేజ్ తో ఒక్కసారిగా వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రమే ‘లక్కీ లక్ష్మణ్’. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లబిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే లక్ష్మణ్ (సోహెల్) మధ్యతరగతికి చెందిన యువకుడు. బీదరికంతో తండ్రి (దేవిప్రసాద్) తనకు గొప్ప జీవితాన్ని ఇవ్వలేదని అతడిని ద్వేషిస్తాడు. కాలేజీలో చేరిన లక్ష్మణ్ శ్రద్ధ (మోక్ష)తో ప్రేమలో పడి చదువు సంకనాకిస్తాడు. అయితే ఫైనల్ ఇయర్‌లో చిన్న క్లాష్ వల్ల వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత చిన్నానాటి స్నేహితులతో కలసి లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో ఆరంభిస్తాడు. అందులో అతను సక్సెస్ అయ్యాడా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటాడా? ద్వేషించిన తల్లిదండ్రులను దగ్గరకు తీస్తాడా? లక్ష్మణ్ లో మార్పుకు కారణం ఏమిటన్నదే ఈ సినిమా!

నిజానికి ఇందులో సోహెల్ చాలా బాగా నటించాడు. అయితే తన పొటెన్షియాలిటీకి తగ్గ కథ మాత్రం సెట్ అవలేదు. తన పోషించిన పాత్రలో స్టెబిలిటీ లేదు. రచయిత, దర్శకుడు అభి హీరో పాత్రను క్యారక్టర్ లెస్ గా చిత్రీకరించి చివరకు పరివర్తన చెందిన వాడిగా చూపించాడు. హీరోయిన్ గా నటించిన మోక్ష అందంగా కనిపించడమే కాదు చక్కటి నటనను కనబరిచింది. తనకి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుందనిపిస్తోంది. సోహెల్ స్నేహితులుగా నటించిన అనురాగ్, అమీన్ లో కూడా ఈజ్ ఉంది. సోహెల్ తండ్రిగా దేవి ప్రసాద్ ఎమోషనల్ పాత్రలో, రాజా రవీంద్ర ఎమ్.ఎల్.ఎగా, సమీర్ కాఫీ షాప్ యజమానిగా తమ ఉనికిని చాటుకున్నారు. చివరలో ఒక్క సీన్ లో కనిపించే కాదంబరి కిరణ్ తన దైన ముద్ర వేశాడు. ఇక దర్శకుడు అభి అందించిన కథలో కొత్తదనం లేదు. సీన్స్ లో కూడా ఆకట్టుకునేవి కాగడా పెట్టి వెతికినా కనిపించవు. ఇలాంటి సినిమాకు సాంకేతిక నిపుణుల ప్రతిభ ఏ మాత్రం హెల్ప్ అవదు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓ విధంగా వేస్ట్ అనే చెప్పాలి. ఇక అనూప్ రూబెన్స్ పాటల్లో ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే పర్వాలేదు అనిపిస్తుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో చెప్పుకోవాలి అంటే ఒక్క క్లయిమాక్స్ మాత్రమే. ఏది ఏమైనా ఈ సినిమా తర్వాత రాబోయే సోహెల్ సినిమాలు ‘మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ దర్శకనిర్మాతలను ‘లక్కీ లక్ష్మణ్‌’ టెన్షన్ లో పెట్టేశాడు.

రేటింగ్: 2.25/5

ప్లస్ పాయింట్స్
సోహెల్, మోక్ష నటన
ఎమోషనల్ క్లైమాక్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
కథ, కథనం
డైరెక్షన్

ట్యాగ్ లైన్: అన్ లక్కీ ఆడియన్స్