అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లవ్ ఓటీపీ సినిమా మొత్తాన్ని రాజీవ్ కనకాల తన భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో అనీష్ తల్లిదండ్రుల పాత్రలలో రాజీవ్ కనకాల, ప్రమోదినీ నటించారు. భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ఆరోహి, జాన్విక హీరోయిన్లుగా నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
అక్షయ్ (అనీష్) ఓ క్రికెటర్. ముందు రంజీకి ఆడి, క్రమంగా ఎదుగుతూ ఇండియన్ నేషనల్ టీమ్‌కి ఆడాలనేది అతని జీవిత ధ్యేయం. అతని తండ్రి రాజీవ్ కనకాల ఓ పోలీస్. అతనికి భయపడి అమ్మాయిలు, ప్రేమ, గాలి తిరుగుళ్ళు లాంటి విషయాలకు దూరంగా ఉంటాడు. అయితే, అలాంటి అబ్బాయిని కూడా ప్రేమలో పడేస్తుంది సనా (ఆరోహి). అయితే అక్షయ్ కూడా ఆమెను ప్రేమిస్తాడు, కాదు కాదు ప్రేమించాల్సి వస్తుంది. ఆమెతో రిలేషన్ నచ్చకపోయినా, బ్రేకప్ చెబితే ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని భయపడి చెప్పలేకపోతాడు. అలా ఆమె టార్చర్ భరించలేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ జీవితంలోకి నక్షత్ర (జాన్విక) ఎంట్రీ ఇస్తుంది. అక్షయ్ ఆమెతో ప్రేమలో పడతాడు.
మరి, అక్షయ్ నక్షత్రను ప్రేమించిన విషయం సనాకు తెలిసిందా లేదా? అక్షయ్ తనకన్నా ముందు సనా అనే అమ్మాయితో ప్రేమలో పడి, ప్రేమ వ్యవహారం నడుపుతున్న విషయం నక్షత్రకు తెలిసిందా? అక్షయ్ అసలు నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? చివరికి అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, ఇంట్లో వాళ్ళు ముందు కాదు అనడం, తర్వాత క్లైమాక్స్‌కి వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనే లైన్‌లో కొన్ని వందల తెలుగు సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలకు కాలం చెల్లింది కాబట్టే, ఇప్పుడు రిలేషన్‌లో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్న రిలేషన్స్‌ను ఆధారంగా చేసుకుని కథలు రాసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో హీరోకి బ్రేకప్ చెప్పలేక, టాక్సిక్ రిలేషన్‌లో ఉండలేక రష్మిక పడే ఇబ్బందులను చూపిస్తే, ఈ సినిమా మాత్రం దానికి రివర్స్‌లో ఉంటుంది. క్లైమాక్స్ వేరనుకోండి, కాకపోతే ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి ఆపోజిట్‌గా చేశారేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వించేలా రాసుకున్నాడు దర్శకుడు. గర్ల్‌ఫ్రెండ్ టార్చర్ తట్టుకోలేక బాయ్‌ఫ్రెండ్ ఇబ్బంది పడే సీన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత కొంత కామెడీతో నడిపించిన తర్వాత ఎక్కువగా ఎమోషనల్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇద్దరమ్మాయిలతో ఒకే సమయంలో ప్రేమ, ఒకరితో మరొకరికి తెలియకుండా ప్రేమ వ్యవహారం నడపడం వంటి సీన్స్ కొన్ని తెలుగు సినిమాల్లోని సీన్స్ గుర్తుకు తెస్తాయి. అలా ఆసక్తికరంగా క్లైమాక్స్‌తో ప్రేక్షకులలో ఒక రకమైన ఆలోచనను రేకెత్తించాడు దర్శకుడు. ఇది ఒక రకంగా ఓటీటీ కంటెంట్. ఓటీటీ ఆడియన్స్ నువ్వు విపరీతంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
నటీనటులు, సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, హీరో అనీష్ ఆ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడు. అతని స్నేహితుడి పాత్ర కామిడీ టైమింగ్ కూడా బాగా సెట్ అయింది. ఆరోహి బావుంది, కానీ అనీష్ పక్కన ఎందుకో పూర్తిస్థాయిలో సెట్ కాలేదు అనిపిస్తుంది. జాన్విక మాత్రము నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. రాజీవ్ కనకాల నటన సినిమాకి ప్లస్ పాయింట్. మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఉంటే తప్ప వర్కౌట్ కాదు. కానీ, సాంగ్స్ అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కెమెరా వర్క్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. సినిమా డబ్బింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ఫైనల్లీ:
లవ్ ఓటీపీ… రొమాంటిక్ కామెడీ ఫిలిం విత్ కనెక్టింగ్ ఎలిమెంట్స్.