దేవన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ కృష్ణ లీల. ఒకప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఎన్నో కేసులకు తీర్పులు ఇచ్చిన అనిల్ కథ అందించగా దేవన్ డైరెక్ట్ చేశారు. అనిల్ భార్య జోత్స్న నిర్మాతగా వ్యవహరించారు. ప్రమోషనల్ కంటెంట్తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
కథ
విహారి (దేవన్) అమెరికాలో ఒక బిజీ యోగా గురువు. తన చెల్లెలి పెళ్లి నిమిత్తం ఇండియాకు వచ్చి హోమ్ మినిస్టర్ కూతురైన బృంద (ధన్య బాలకృష్ణ)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. , ఆమెకు అబ్బాయిలంటే కోపం. సొంత కాలేజీ కావడం వల్ల, అబ్బాయిలను ఏడిపిస్తూ ఉంటుంది. విహారి తన చెల్లెలి పెళ్లిలో బృందను చూసినప్పటి నుంచి విహారి ఆమె ప్రేమలో పడతాడు, అంతేకాకుండా అతనికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. బృందను ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నించినా, ఆమె అతన్ని తిట్టి, కొట్టి, కొట్టించి పంపిస్తుంది.
విహారి తల్లిదండ్రులు (బబ్లూ పృథ్వీ – రజిత), బృంద తండ్రి (వినోద్ కుమార్) వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, అతను వారిని అవమానించి పంపిస్తాడు. దీంతో విహారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తాను హోమ్ మినిస్టర్ కూతురిని చంపేశానని చెబుతాడు. పోలీసులు విచారణ చేయగా, విహారి ‘గత జన్మలో చంపాను’ అని చెప్పడంతో ఆశ్చర్యపోతారు. అసలు గత జన్మలో బృంద – విహారి ఎవరు? బృందకు కూడా గత జన్మ గుర్తొస్తుందా? విహారి ప్రేమని బృంద అంగీకరిస్తుందా? పోలీసులు ఏం చేశారు? బృంద తండ్రి పెళ్లికి ఒప్పుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.
📝 విశ్లేషణ
గత జన్మల ప్రేమ కథాంశం, ఈ జన్మలో నెరవేరడం అనేది ‘అనేక సినిమాల్లో చూశాం. ఈ ‘కృష్ణ లీల’ కూడా అదే మూల కథాంశంతో వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ప్రధాన పాత్రల పరిచయాలు, విహారి బృంద కోసం తిరగడం, పోలీస్ స్టేషన్ సీన్స్‌తో సాగుతుంది. కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కాలేజీలో ధన్య బాలకృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి. బృంద కోసం విహారి పడే తపన రొటీన్ ప్రేమ కథల మాదిరిగానే ఉన్నా, మధ్యలో వచ్చే గత జన్మ లీడ్ సీన్లు ఆసక్తిని పెంచుతాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, హోమ్ మినిస్టర్ కూతురిని గత జన్మలో చంపానని చెప్పడం వంటి సన్నివేశాలు కథపై క్యూరియాసిటీని పెంచుతాయి. ఇంటర్వెల్ కూడా గత జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ మొదట్లో గత జన్మ కథను సగం మాత్రమే చూపించి, మిగిలిన సగం క్లైమాక్స్ వరకు దాచడంతో ప్రేక్షకుల్లో ‘ఏమైంది’ అనే ఉత్సుకత ఉంటుంది. గత జన్మ లవ్ స్టోరీ రొటీన్‌గా అనిపించినా, పాత్రల ఎంపిక కొత్తగా ఉంది. ఫ్లాష్‌బ్యాక్ తర్వాత బృందకి నేను ప్రపోజ్ చేయాలి, అందుకు ఆమె నన్ను కలిసేలా చేయాలి అని విహారి కోర్టుకు పిటిషన్ వేయడం వంటి సన్నివేశాలు కాస్త కొత్తగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా కొంత భిన్నంగా ఉంది.
⭐నటీనటుల విషయానికి వస్తే, హీరోనే దర్శకత్వం వహించిన దేవన్, రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించడానికి బాగానే కష్టపడ్డాడు. ధన్య బాలకృష్ణ, మోడ్రన్ పాత్రలోనూ, ఫ్లాష్‌బ్యాక్‌లో గ్రామీణ యువతిగానూ బాగా నటించింది. బబ్లూ పృథ్వీ, రజిత జంట తల్లిదండ్రులుగా కొత్తగా ఉంది.. సీనియర్ నటుడు వినోద్ కుమార్, హోమ్ మినిస్టర్ పాత్రలో నెగిటివ్ రోల్‌ను బాగా పోషించారు. సరయు సహా మిగిలిన నటీనటులు వారి పాత్రలకు పర్వాలేదనిపించారు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అవ్వలేదు. పాటలు కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్‌లో కూడా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగానే పనిచేసింది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంత శ్రద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పునర్జన్మల ప్రేమ కథకి డివోషనల్ టచ్ ఇచ్చిన ‘కృష్ణ లీల’