Kranthi Movie Review: ఈ వీకెండ్ ఏడు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయితే… మరికొన్ని స్ట్రయిట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. అందులో ఒకటి ‘క్రాంతి’. ప్రముఖ గీత రచయిత, స్వర్గీయ వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి ప్రధాన పాత్ర పోషించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను భీమశంకర్ డైరెక్షన్ లో భార్గవ్ మన్నె నిర్మించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 90 నిమిషాల నిడివి ఉన్న ‘క్రాంతి’ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
కాకినాడకు చెందిన రామ్ (రాకేందుమౌళి) ఎస్.ఐ. ట్రైనింగ్ కు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతుంటాడు. అప్పటికే అతను సంధ్య (ఇనయా సుల్తానా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన తండ్రిని వచ్చి కలవమని సంధ్య… రామ్ కు చెప్పిన మర్నాడే హత్యకు గురౌతుంది. దాంతో రామ్ పూర్తిగా డిప్రషన్ కు లోనవుతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు రామ్ సోదరిగా భావించే రమ్య (శ్రావణి) కూడా కనిపించకుండా పోతుంది. ఇలా కాకినాడ నగరంలో ఇంకొందరు అమ్మాయిలు మిస్ అయినా పోలీసులు దీన్ని పెద్దంత సీరియస్ గా తీసుకోరు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుంది. సంధ్య హత్యతో డిప్రషన్ కు లోనైన రామ్ తిరిగి కోలుకుని, రమ్య ఆచూకీ ఎలా కనిపెట్టాడు? అందుకోసం తమ నగరానికి చెందిన మహిళలలో ఎలా చైతన్యం తీసుకొచ్చాడు? ఫలితంగా మహిళలను కిడ్నాప్ చేస్తున్న ద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడు? అనేదే ‘క్రాంతి’ మూవీ.
ఇవాళ వయసొచ్చిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడటం అనేది సాధారణ విషయం అయిపోయింది. పలుకుబడి ఉన్న వారి పిల్లల విషయంలో పోలీసులు చొరవచూపి నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు, సాధారణ కుటుంబాల వారి విషయంలో జరగడం లేదు. అలానే ప్రభుత్వానికి, అధికారులకు చెడ్డపేరు వస్తుందని భయపడినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే నిందితులుగా అనుమానించిన వారిని ఎన్ కౌంటర్ చేయడానికి వెనుకాడటం లేదు. అదే మామూలు వ్యక్తుల విషయంలో న్యాయం కోసం ఒక్కో కోర్టునూ ఆశ్రయిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపు కూడా కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయమై మహిళలలో చైతన్య తీసుకొస్తే, కిడ్నాప్ కు గురైన వారిని పట్టుకోవడం ఏమంత కష్టం కాదని దర్శకుడు భీమశంకర్ చెప్పాలనుకున్నాడు. మహిళా చైతన్య ప్రాధాన్యం తెలియచేస్తూ, ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మహిళలు పూనుకుంటే కానిది ఏదీ లేదు. ఈ విషయాన్ని ఏనుగు కథను ఉదహరిస్తూ దర్శకుడు బాగా వివరించాడు. అయితే… పరిమితమైన బడ్జెట్ కారణంగా ఈ సినిమాను చుట్టేశారనే భావన కలుగుతుంది. ఇందులో నేపథ్య గీతాలకు రెండు మూడు చోట్ల స్కోప్ ఉంది. కాని పెట్టలేదు. అలానే కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా తీసి ఉండాల్సింది. అలా జరగలేదు. ఎంచుకున్న కథాంశం మంచిది కావడం ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్.
నటీనటుల విషయానికి వస్తే… మల్టీ టాలెంటెడ్ రాకేందు మౌళి… తనదైన శైలిలో నటించి, మెప్పించాడు. ఓ రకంగా ఇది అతని వన్ మ్యాన్ షో. అతని ప్రియురాలిగా ఇనయా సుల్తానా, చెల్లెలిగా శ్రావణి బాగానే నటించారు. కథానాయకుడి తల్లిగా యమున శ్రీనిధి, రాజకీయ నేతలకు తొత్తులా పనిచేసే పోలీస్ ఆఫీసర్ గా స్వర్గీయ ‘ఆహుతి’ ప్రసాద్ తనయుడు కార్తీక్ యాక్ట్ చేశారు. జ్ఞాని నేపథ్య సంగీతం, కిశోర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. పోలీసులు పట్టించుకోకపోతే, కామన్ మ్యాన్ ఇన్వెస్టిగేషన్ కు దిగక తప్పదని ఈ సినిమాలో చూపించారు. నిజంగా అదే జరిగితే సగం కేసులు త్వరితగతిన సాల్వ్ అయిపోతాయి. సినిమా నిడివి తక్కువే అయినా… మొదటి అరగంట చాలా స్లోగా సాగింది. రామ్ రంగంలోకి దిగిన తర్వాత సినిమా కాస్తంత ఊపందుకుంది. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… సమయం ఉన్నప్పుడు ఓసారి చూడటంలో తప్పులేదు!
రేటింగ్: 2.5/5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథాంశం
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
బడ్జెట్ పరిమితులు
ట్యాగ్ లైన్: కామన్ మ్యాన్ ఇన్వెస్టిగేషన్!