Satyam Sundaram Telugu Review: 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం సత్యం సుందరం. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కార్తీ హీరోగా ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన మరో హీరో అరవింద్ స్వామి కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. దానికి తోడు కార్తీ అన్నా వదినలు సూర్య, జ్యోతిక 2d ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు టీజర్ ట్రైలర్ తో పాటు కొన్ని పాటలతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించింది. మరి అంతలా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తమిళంలో 27వ తేదీన తెలుగులో 28వ తేదీన రిలీజ్ అవుతోంది. అయితే స్పెషల్గా మీడియా కోసం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనో రివ్యూలో చూద్దాం.
సత్యం సుందరం కథ:
సత్యమూర్తి(అరవింద్ స్వామి) తండ్రి(జయప్రకాష్) దాయాదుల ఆస్తి గొడవల్లో ఉన్న ఆస్తి అంతటినీ పోగొట్టుకుంటాడు. దీంతో మూడు తరాలుగా నివసిస్తున్న అమరావతి ప్రాంతాన్ని వదిలి విశాఖపట్నం షిఫ్ట్ అవుతారు.. అలా షిఫ్ట్ అయిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్ళని సత్యమూర్తి చెల్లెలు భువన వివాహం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. భువన పెళ్లి దగ్గర సత్యమూర్తికి బావ అంటూ ఒక వ్యక్తి(కార్తీ) తారసపడతాడు. తన బంధువులు సైతం ఆ వ్యక్తితో బాగానే మాట్లాడతారు కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా సత్యమూర్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసిన సరే జిడ్డులా వెంటే ఉండడంతో ఆ ప్రయత్నాలు సఫలం కావు. చివరికి అతను ఎవరో సత్యమూర్తి ఎలా తెలుసుకున్నాడు? అసలు బావా అంటూ సత్యమూర్తి వెంటపడుతున్నది ఎవరు? సత్యమూర్తి వదిలేసిన సైకిల్ ఒక కుటుంబం మొత్తాన్ని ఎలా నిలబెట్టింది? చివరికి సత్యమూర్తి ఆ వ్యక్తిని మళ్లీ కలిశాడా లేదా? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ప్రేమ్ కుమార్ ముందుగా దీన్ని ఒక నవలగా రాసుకున్నారట. కార్తీతో మాత్రమే సినిమా చేయాలని పంతం పట్టి పక్కన పెట్టేసిన స్క్రిప్ట్ ని అనుకోకుండా కార్తీ ప్రోద్బలంతో పట్టాలెక్కించడం జరిగింది.. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రకమైన విలేజ్ వైబ్ మనకి అర్థమయి పోతూ ఉంటుంది. ఒకరకంగా ఇది కొత్త కథ ఏమీ కాదు. ఆస్తి తగదాల వల్ల ఊరు విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి ఒక శుభకార్యం కోసం ఆ ఊరికి వెళితే, అక్కడ తన మీద అతిగా ప్రేమ చూపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ సాగే కథే ఇది. నిజానికి ఇది నవలగా అనుకున్నప్పుడు చాలా అత్యద్భుతంగా అనిపించి ఉండవచ్చు కానీ దాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావడం అనేది చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి. అలాంటి కథను ఒప్పుకున్న కార్తి సహా అరవింద్ స్వామి ఈ విషయంలో చాలా పెద్ద సాహసమే చేశారు. జీవితంలో అయిన వాళ్లు కూడా మనకి వెన్నుపోటు పొడుస్తారు అని నమ్మి తన కుటుంబాన్ని తప్ప బయట కుటుంబంలో వ్యక్తులను అసలు ఏమాత్రం నమ్మకుండా తయారైన సత్యమూర్తి చివరికి అలాంటి వాళ్ళు మాత్రమే కాదు ఎలాంటి సహాయం ఆశించకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని తెలుసుకునే ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది. నిజానికి రెండు గంటల 57 నిమిషాల నిడివి గల ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్నిచోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ కార్తీ తనదైన హాస్య చతురతతో దాన్ని మరిపింప చేసే ప్రయత్నం చేశాడు. బావ బావమరుదుల మధ్య సాగే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. అయితే ఇదేదో తమిళ సినిమాల కాకుండా అచ్చ తెలుగు సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో డబ్బింగ్ టీం కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్లు లేకపోతే ఇంకేవో ఫీట్లు ఉండవు కేవలం స్వచ్ఛమైన మట్టి వాసన తెలిసిన మనుషుల అంతరంగం ఉంటుంది. కమర్షియల్ లెక్కలు ఇప్పుడే చెప్పలేం కానీ అవార్డులు మాత్రం ఖచ్చితంగా అందుకునే సినిమా అవుతుందని మాత్రం చెప్పవచ్చు
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన కార్తీ, అరవింద్ స్వామి, రాజ్ కిరణ్, జయప్రకాశ్, శ్రీదివ్య వంటి వాళ్లు ఒకరకంగా ఆయా పాత్రలలో నటించలేదు పూర్తిగా జీవించేశారు. నిజంగానే మనం ఏదో వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న సన్నివేశాలను పక్కనే కూర్చుని చూస్తున్నట్టు బ్రమింప చేసేలా సినిమా మొత్తం నటీనటులు తమ సాయిశక్తులా కృషి చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా సింక్ సౌండ్ ప్రతి ఫ్రేమ్లో అత్యద్భుతమైన ఔట్పుట్ ఇచ్చినట్లే చెప్పొచ్చు. ముఖ్యంగా సంగీతం బాగా కుదిరింది. కొన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్టు సరిపోయింది. అయితే ఎడిటింగ్ విషయంలో మరికొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. లొకేషన్లు మాత్రం అత్యద్భుతంగా వచ్చాయి.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ సత్యం సుందరం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్.. ల్యాగ్ అనిపిస్తుంది కానీ తోబుట్టువులు ఉన్నవారు వాళ్లకి సినిమా అయిన వెంటనే ఫోన్ చేయకుండా ఉండలేరు.