ఈ మధ్యకాలంలో నటీనటులతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో దర్శకులు కూడా తమ సృజనాత్మకతను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని హీరోగా పెట్టి, ‘పుష్పక విమానం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన గీత్ సైనితో ‘కన్యాకుమారి’ అనే సినిమా చేశాడు ‘పుష్పక విమానం’ సినిమా దర్శకుడు సృజన్. ఈ సినిమాని ఒకప్పటి హీరోయిన్ మధుశాలిని ప్రజెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకాలోని పెంటపాడు అనే ఊరికి చెందిన తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ) పక్క ఊరిలో తనతో పాటు కలిసి చదువుకునే కన్యాకుమారి (గీత్ సైని)ని చిన్నప్పుడే ఇష్టపడతాడు. ఆ తర్వాత రైతు నవ్వాలని ఉద్దేశంతో చదువు ఆపేసిన తిరుపతి వ్యవసాయం మొదలుపెడతాడు. కన్యాకుమారి మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉద్దేశంతో డిగ్రీ వరకు చదువుకుని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వలేక పట్నంలో ఒక బట్టల కొట్టులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తూ ఉంటుంది. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న తిరుపతికి ఆటో డ్రైవర్ ద్వారా కన్యాకుమారి సంబంధం గురించి తెలుస్తుంది. ముందు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అని అబద్ధం చెప్పి ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నం చేసిన తర్వాత, ఆమె మీద ఉన్న ప్రేమతో రైతు ఆలోచనలను పక్కనపెట్టి ఉద్యోగం కూడా చేయడానికి సిద్ధమవుతాడు. అయితే ఆమె అప్పటికే నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమవుతుంది. దాన్ని చెడగొడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించుకున్న ఈ ఇద్దరూ కలిసారా లేదా? చివరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
కథగా చెప్పుకోవాలంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. ఊరిలో వ్యవసాయం చేసుకునే అబ్బాయి, ఉద్యోగం చేసుకునే అమ్మాయి వెంట పడటం, ఆ అమ్మాయి మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ఉండడంతో ఇతన్ని కాదని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. అయితే ప్రేమించాననే ఉద్దేశంతో ఆమె చేస్తున్న షాపులోనే ఆమె పై స్థానానికి ఎదుగుతాడు హీరో. అయినా సరే, ఆమె మాత్రం తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆలోచనలను పక్కన పెట్టదు. అయితే తన ఆలోచనలు వేరు, ఆమె ఆలోచనలు వేరు. ఆమె అంటే ఇష్టం ఉన్నంత మాత్రాన తనతోనే కలిసి ఉండాలనుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో హీరో ఆమెను త్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతాడు. కానీ ముందు ప్రేమ కన్నా జీవితమే ముఖ్యం, తన గోల్ ముఖ్యమని భావించిన కన్యాకుమారి, తిరుపతి ప్రేమను అర్థం చేసుకొని అతని కోసం ఏం చేసింది అనే లైన్‌లో ఈ సినిమా రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలియని హీరో, కాస్త తెలిసిన హీరోయిన్, ఆ పక్కన పాత్రధారులు ఎవరో కూడా తెలియదు. కానీ సరదాగా ప్రేక్షకులను ఒక మట్టి వాసనకు దగ్గరగా తీసుకువెళ్లేలా దర్శకుడు సినిమాని తెరమీదకు తీసుకొచ్చాడు. అయితే తెలిసిన కథ కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ మ్యూజిక్‌తో కొంతవరకు ఆ బోర్ ఫీలింగ్ కలగకుండా చూసుకున్నాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే, తిరుపతి పాత్రలో శ్రీచరణ్ రాచకొండ ఒదిగిపోయాడు. ఒక పల్లెటూరి కుర్రాడిగా పరకాయ ప్రవేశం చేశాడేమో అనిపించింది కూడా. కన్యాకుమారి అనే శ్రీకాకుళపు అమ్మాయి పాత్రలో గీత్ సైని పరకాయ ప్రవేశం చేసింది. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సంగీతం. సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా సంగీత దర్శకుడు కథను నడిపించాడు. అలాగే విజువల్స్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. పూర్తిగా ఈ సినిమా అంతా పల్లెటూరిలోనే సాగిపోతూ ఉండడం గమనార్హం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
**కన్యాకుమారి కూల్ అండ్ బ్రీజీ లవ్ స్టోరీ**