రిషబ్ శెట్టి హీరోగా రూపొందించబడిన కాంతార సినిమా గతంలో రిలీజ్ అయి, ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార చాప్టర్ వన్ అనే సినిమా సిద్ధమైంది. ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో పాటు, రిషబ్ శెట్టి మీద నమ్మకం పెరగడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కాంతార చాప్టర్ వన్ కథ
ఈ కథ కాంతార సినిమా ముగిసినప్పటి నుంచి మొదలవుతుంది. దైవంలో కలిసిపోయిన తన తండ్రి గురించి అడిగిన కొడుకుకి వృత్తాంతం అంతా చెబుతూ వస్తారు కాంతార ప్రజలు. అందులో భాగంగానే కాంతార ప్రజలు కాపాడుతున్న ఈశ్వరుని పూదోట అనే ప్రాంతం మీద కన్నేసిన రాజు (జయరాం) తన కొడుకు ( గుల్షన్ దేవయ్య)ను రాజుని చేసి అతనితో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో కాంతార ప్రజల కాపరి (రిషబ్ శెట్టి) అనుకోకుండా ఆ రాజు రాజ్యంలోకి వెళ్తాడు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న పంటను వ్యాపారం చేసి, తమకు కావలసిన వస్తువులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే రాజు కుమార్తె కనకవతి (రుక్మిణి వసంత్) ఎదురై, కాస్త సన్నిహితంగా మెలుగుతుంది. ఆమె ఈశ్వరుని పూదోట చూడాలనే కోరిక బయట పెట్టడంతో దూరం పెడుతూ వస్తాడు రిషబ్ శెట్టి. ఈ నేపథ్యంలో ఎలా అయినా ఈశ్వరుని పూదోట చూడాలని ప్రయత్నం చేసిన రాజు, అతని కుమార్తె విజయం సాధించారా? తన వారిని రిషబ్ శెట్టి ఎలా కాపాడుకోగలిగాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
కాంతార పార్ట్ వన్ అంటే గతంలో రిలీజ్ అయిన సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల్లోకి వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఆ సినిమా బాగా ఎక్కింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ప్రస్తుత సినిమా మీద ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఎంతలా అంటే సాధారణమైన సినిమాలను కూడా పెద్దగా పట్టించుకోని వారు సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే, సినిమా మొదలైన తర్వాత ఇదేంట్రా ఇది, మనం ఒకటి ప్రిపేర్‌వస్తే ఇక్కడ వేరేది ఏదో జరుగుతోంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే దర్శకుడు ఒక పెద్ద వరల్డ్ బిల్డ్ చేయాలనే ప్రయత్నం చేశాడు. అందుకోసం చాలా సమయమే తీసుకున్నాడు. ముందుగా కథ అడవిలోనే మొదలైన తర్వాత ఎక్కువసేపు రాజ్యంలో సాగుతుంది. అదంతా సాగదీసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కథ ఎప్పుడైతే ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్‌లోకి వెళ్లిందో అప్పుడు ఒక్కసారిగా అందరికీ సినిమా మీద ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ తర్వాత మాత్రం కథ పరుగులు పెట్టింది. ఏమాత్రం ఊహకు అందకుండా సాగుతూ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ హాఫ్‌లో కొట్టిన బోరు మొత్తం వదిలిపోయేలా సెకండ్ హాఫ్ మొత్తం ఆకట్టుకునేలా సాగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు ఏమాత్రం పక్క చూపులు చూడకుండా చేసుకునేలా దాదాపు చాలా ఎపిసోడ్స్ పెట్టుకున్నాడు రిషబ్ శెట్టి. కాంతారావు మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు వింతగా అరుస్తూ చేసే శబ్దం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు దాదాపు దాన్ని పోలి ఉండిన చాలా ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్‌లో పడడంతో కాస్త డివోషనల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం పండుగ చేసుకునేలా ఉంటుంది. అయితే, నార్మల్ సినిమా లవర్స్‌కి పర్వాలేదు అనిపించేలా ఈ సెకండ్ హాఫ్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే డివోషనల్ మూమెంట్స్ కోసం రిషబ్ శెట్టి తపన చాలా చోట్ల కనిపించింది. అవి చాలా చోట్ల వర్క్‌ఔట్ అయినట్లు కూడా అనిపించింది.అలాగే అంచనాల మహిమో మరొకటో తెలియదు కానీ కాంతారా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మాత్రం ఇప్పుడు లేదు, ఎక్కడో ఏదో మిస్సయిన ఫీలింగ్. అలాగే హీరో శరీరంలోకి గుళిగ వచ్చినప్పుడు ఉండే సన్నివేశాలు గూస్ బంప్స్. ఇక ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. సినిమాకి అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నాడు రిషబ్
నటీనటుల విషయానికి వస్తే రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో ఈ కాంతార చాప్టర్ వన్. తనదైన పర్ఫామెన్స్‌తో కళ్ళు తిప్పి పోకుండా నటించి అలరించాడు అనడంలో సందేహం లేదు. నిజానికి మరొక నేషనల్ అవార్డు సాధించిన ఆశ్చర్యం లేదు. అంతలా ఈ పాత్రలో రిషబ్ ఒదిగిపోయాడు. ఇక ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ జయరాం నటన. చాలా కాలం తర్వాత మనోడికి అంత మంచి పాత్ర పడింది. ఇక రుక్మిణి వసంత్ అదరగొట్టింది. అందంగా కనిపిస్తూనే అభినయంతో కళ్ళు తిప్పుకోకుండా చేసింది. గుల్షన్ దేవయ్య నటన సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాంతార పార్ట్ వన్‌లో కనిపించిన కొంతమంది నటులు కూడా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా హీరో రిషబ్ శెట్టి అయితే దర్శకుడిగా కూడా ఆయనే ద్విపాత్రాభినయం చేశాడు. నిజానికి దర్శకుడిగా కూడా ఆయన మంచి మార్కులు వేయించుకున్నాడు అని చెప్పాలి. ఇక తర్వాత అంతగా అభినందించాల్సింది సంగీత దర్శకుడిని. మొదటి భాగం సినిమాని ఎంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సంగీతం అందించాడో, ఈ సినిమా విషయంలో కూడా తన పాత్రను నెరవేర్చాడు. ఇక ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ప్రతి సీన్ కూడా కచ్చితంగా సెట్ చేసిన సెట్లోనే షూట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ఇక హోం బాలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు గురించి ఏం చెప్పాలి. ఇలాంటి సినిమా ఆ నిర్మాణ సంస్థ కాబట్టే చేసింది ఏమో అనాలేమో. అంతలా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ వంక పెట్టకుండా చూసుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా అత్యద్భుతంగా కుదిరింది. నిజానికి ఈ సినిమా టెక్నికల్‌గా టాప్ నాచ్. ఫస్ట్ హాఫ్ సాగదీసిన సెకండ్ హాఫ్, ఆ ఫీలింగ్ కలగకుండా చూసుకోవడం ప్లస్ అయింది.
ఫైనల్‌గా కాంతార చాప్టర్ వన్.. డివోషనల్ కంటెంట్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్ అలాగే కండిషన్స్ అప్లై