కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకన్ సినిమా దాదాపు 38 ఏళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి థగ్ లైఫ్ అనే సినిమాను రూపొందించారు. త్రిష, అభిరామి హీరోయిన్‌లుగా, శింబు, జోజూ జార్జ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. నాయకన్ కంటే ఇది ఉత్తమ సినిమా అని కమల్ హాసన్ పేర్కొనడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?
థగ్ లైఫ్ కథ: తన అన్న మాణిక్యం (నాజర్)తో కలిసి రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్) ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌గా ఒక గ్యాంగ్‌ను నడుపుతూ ఉంటాడు. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్‌తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సందర్భంలో సదానంద్, శక్తి రాజు గ్యాంగ్‌ను పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే, శక్తి రాజు ఒక చిన్నారిని (శింబు) కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్‌ను సొంత కొడుకులా పెంచుతాడు. అయితే, ఒకసారి జరిగిన దాడిలో శక్తి రాజు అమర్‌పై అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో, తన తండ్రిని చంపింది శక్తి రాజేనని తెలుసుకున్న అమర్, శక్తి రాజును ఒక లోయలోకి తోసేస్తాడు. చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తి రాజు మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా? తన భార్య లక్ష్మి (అభిరామి), కూతురు మంగా? ఏమయ్యారు? చిన్నప్పుడే తప్పిపోయిన అమర్, చంద్ర (ఐశ్వర్య లక్ష్మి) మళ్లీ కలిసారా? చివరికి ఏం జరిగింది? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, నాయకన్ తర్వాత ఇది అంతకు మించిన సినిమా అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే, ప్రేక్షకులు కూడా దాదాపు మనసులో అదే విషయాన్ని పెట్టుకుని థియేటర్‌కు వస్తారు. కానీ, సినిమా మొదలైన కొద్దిసేపటికి ఇది రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ఫీలింగ్ కలగడం సహజం. నిజానికి ఇలాంటి కథలు మనం గతంలో ఎన్నో సినిమాలలో చూశాం. ఇందులో కూడా అలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాతోనే కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక గ్యాంగ్‌స్టర్, ఒక చిన్న కుర్రాడి కారణంగా ప్రాణాలు కాపాడుకుని, అతన్ని తనతో పాటు పెంచుకుంటూ ఉంటాడు. కొన్నాళ్లకు చాకులా తయారైన ఆ కుర్రాడు, గ్యాంగ్‌స్టర్ మీద తిరగబడతాడు. చివరికి వారిద్దరిలో ఎవరు మిగిలారు అనే లైన్‌తో ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చూశాం. ఈ సినిమాను కూడా దాదాపు అదే లైన్‌తో రాసుకున్నాడు మణిరత్నం. దానికి కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామాలో సరిగ్గా మిక్స్ అవ్వకపోవడంతో, ఇది ఒక సంపూర్ణమైన మణిరత్నం సినిమా ఫీలింగ్ కలగదు. నిజానికి ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. కానీ, మణిరత్నం, కమల్ హాసన్ ప్రమోషన్స్‌లో నాయకన్ ని మించిన కథ, అంతకంటే అద్భుతమైన స్టోరీ, అంతకు మించిన సినిమా అని ప్రచారం చేసుకుంటూ రావడం సినిమాకు చాలా ఇబ్బంది కలిగించే అంశం. ప్రేక్షకులందరూ చాలా హైప్‌తో సినిమా థియేటర్‌కు వస్తే, అది ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ చేసే విషయంలో వెనకబడింది. నిజానికి కమల్ హాసన్ లాంటి హీరోలు ఇలాంటి కథలు ఒప్పుకోవడం కాస్త ఇబ్బందికర అంశం. ఎందుకంటే, ఒకపక్క ఫ్యామిలీ మ్యాన్‌గా ఉంటూనే, మరోపక్క ఒక అఫైర్ నడుపుతూ ప్రేమాయణం సాగించేలాంటి పాత్రలో కమల్ హాసన్ కనిపించాడు. నిజానికి మనం ఇలాంటి సినిమా కథలను ఎప్పుడో చూశాం. ఎప్పుడో చూశాం పవన్ కళ్యాణ్ బాలు సహా పంజా అలాగే తెలుగులో వచ్చిన ఎన్నో గ్యాంగ్ స్టార్ డ్రామా సినిమాలు దాదాపు ఇదే లైన్లో సాగుతూ ఉంటాయి. కొత్తదనం ఆశించి ఈ సినిమాకి వెళితే మాత్రం ప్రేక్షకుడు నిరాశ చెందక తప్పదు. ఒకానొక సందర్భంలో నాయకుడు తర్వాత ఇమీడియట్ గా కమలహాసన్తో సినిమా చేయడానికి రాసుకున్న కథతో ఇప్పుడు మణిరత్నం ఈ సినిమా చేశారేమో అని అనుమానం కలగక మానదు.
నటీనటులు: రంగరాయ శక్తి రాజు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కమల్ హాసన్ ఇమిడిపోయాడు. ఆయనకు ఇలాంటి తరహా పాత్రలు కొట్టిన పిండే. ఒక గ్యాంగ్‌స్టర్‌గా, ఎవరికీ భయపడని పాత్రలో విశ్వరూపం చూపించాడు. కొన్ని సన్నివేశాలలో కళ్లతో నటించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనలో ఆయన లోకనాయకుడనే మాటకు నిజమైన నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. ఇక శింబు ఒక స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఫైట్స్ అలాగే డాన్స్ విషయంలో శింబు మరోసారి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్రిష స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ చూపు తిప్పుకోకుండా చేసింది. అభిరామి నటన ఎమోషనల్‌గా బాగా వర్కౌట్ అయింది. ఇక జోజూ జార్జ్, నాజర్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫర్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఆయన చూపించిన చాలా ఫ్రేమ్స్ టెక్నికల్‌గా బాగా అడ్వాన్స్‌డ్‌గా అనిపించాయి. కొన్ని స్క్రీన్‌ప్లేలో కీలకమైన భాగాన్ని పోషించాయి. రెహమాన్ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్టుగా అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి కాస్ట్యూమ్స్ విషయంలో కాస్ట్యూమర్‌కు మంచి మార్కులు పడాలి. అలాగే, ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. తెలుగు డైలాగ్స్ రాసినది ఎవరో తెలియదు కానీ, బాగానే నవ్వించేలా రాయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా ఫైట్స్ స్టైలిష్‌గా ఉన్నాయి.
ఫైనల్లీ : లిమిటెడ్ ఎంగేజింగ్ మూమెంట్స్ తో అవుట్ డేటెడ్ అండ్ రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా.. అంచనాలు లేకుండా వెళ్తే గ్యాంగ్ స్టర్ డ్రామాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది .